Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి
ఫోటో గవర్నర్ కు సంబంధించిన ఫోటోలు

విశాలాంధ్ర- ఉంగుటూరు ( ఏలూరు జిల్లా): ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రధమ స్థానంలో ఉందని త్రిపుర గవర్నర్ ఎం. ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం లో ఏర్పాటుచేసిన ఆక్వా ఎగ్జిబిషన్ ను శనివారం త్రిపుర గవర్నర్ పరిశీలించి, స్థానిక మత్య రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా కల్చర్ అభివృద్ధికి మంచి అనువైన పరిస్థితులు ఉన్నాయన్నారు. త్రిపుర రాష్ట్రానికి కూడా ఈ ప్రాంతం నుండి ప్రతీ రోజు 20 లారీల వరకు ఆక్వా ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయన్నారు. ఈ ప్రాంతంలోని ఆక్వా రైతులను కలిసి ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి అనుకూలమైన పరిస్థితులు, అధిక దిగుబడికి తీసుకుంటున్న చర్యలు, ఆక్వా రైతుల అనుభవాలను తెలుసుకున్నానన్నారు. ఈ ప్రాంతంలోని భూములు ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి ఎంతో అనుకూలంగా ఉన్నాయన్నారు. త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా పరిశ్రమను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నదని, ఇందుకోసం ప్రత్యేక చట్టాలు చేసిందన్నారు. త్రిపుర రాష్ట్రం చిన్న రాష్ట్రమని, కొండ ప్రాంతమని, అక్కడ ఎకరం లోపు భూములలో ఆక్వా చెరువులలో సాగుచేస్తుంటారని, వారి సంక్షేమాన్ని, వారి భద్రతకు త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఎక్కువ భూ విస్తీర్ణములో రైతులను గ్రూపుగా ఏర్పరచి, వాణిజ్యపరంగా సహకార విధానంలో ఆక్వా పరిశ్రమను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఈ ప్రాంతంలో ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి అనువైన పరిస్థితులు, తీసుకోవలసిన చర్యలు, తదితర అంశాలపై అధ్యాయనం చేసి, త్రిపుర రాష్ట్రంలోని ఆక్వా రైతులకు అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. త్రిపుర రాష్ట్రం ప్రముఖ పర్యాటక రాష్ట్రంగా రూపుదిద్దుకుందని , విద్యా, వైద్య పరంగా ఉన్నతస్థానములో ఉందని, త్రిపురలో అక్షరాస్యత జనాభాలో 97 శాతంగా ఉందన్నారు.
ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ 11. 93 లక్షల టన్నుల మత్య్స ఉత్పత్తులతో ఏలూరు జిల్లా రాష్ట్రంలో ప్రధమ స్థానంలో ఉందన్నారు. ప్రభుత్వ చేప పిల్లలాల ఉత్పత్తి కేంద్రాల ద్వారా చేప పిల్లలను పెంచి, చేపల, రొయ్యల చెరువులలో నిషిద్ధ యాంటీ బయోటిక్స్ వాడకుండా నాణ్యమైన చేపల మేతను సరఫరా చేసి నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులను సాదిస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తున్నదన్నారు.
కార్యక్రమంలో ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ కే.ఎస్. వి. నాగలింగాచార్యులు, ప్రముఖులు గారపాటి రామాంజనేయ చౌదరి (తపన చౌదరి), మాలతీ రాణి, ఎఫ్.డి. ఓ లు కే మంగారావు భార్గవి టి రవి. వివిధ శాఖల అధికారులు, వి ఎఫ్ ఏ లు వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img