పాఠశాల ఆస్తుల ధ్వంసం.. ఉపాధ్యాయులు, విద్యార్థినుల్లో భయాందోళన
పాఠశాల ముగియగానే ఆవరణలో మద్యం సేవిస్తున్న యువకులు
నీటి పైపులు, కుళాయిలు, గోడలు, పాఠశాల ఆస్తుల ధ్వంసం
మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థినులు, ఆయాలు భయాందోళన
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని పోలీసులను కోరుతున్న ఉపాధ్యాయులు
విశాలాంధ్ర ధర్మవరం/బత్తలపల్లి;; నియోజకవర్గంలోనిబత్తలపల్లి మండలంలోని అప్పరాచెరువు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారిందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉపాధ్యాయుల కథనం ప్రకారం, ప్రతిరోజూ పాఠశాల ముగిసిన వెంటనే గ్రామానికి చెందిన కొందరు యువకులు పాఠశాల ఆవరణలోకి వచ్చి మద్యం సేవిస్తున్నారు. అనంతరం మద్యం సీసాలు, గ్లాసులు, కుర్కురే ప్యాకెట్లు తదితర చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. అంతేకాకుండా పాఠశాల ప్రాంగణంలో క్రికెట్ ఆడుతూ విద్యార్థులకు ఉపయోగపడే పరికరాలు, నీటి పైపులు, కుళాయిలు, గోడలు, మెట్లు తదితర ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఈ విషయాన్ని పలుమార్లు పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) సభ్యుల దృష్టికి తీసుకెళ్లగా, వారు సంబంధిత యువకులను హెచ్చరించినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపారు. “మీరు చెప్పితే మేము వినాలా” అన్న ధోరణితో మరింత రెచ్చిపోతున్నారని ఉపాధ్యాయులు వాపోయారు.ధ్వంసమైన సామగ్రిని పదేపదే మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, అయినప్పటికీ మళ్లీ వాటిని ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. కొందరు పాఠశాల పూర్తిగా ముగియకముందే ఆవరణలోకి వస్తుండటంతో మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థినులు, ఆయాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా బత్తలపల్లి సీఐ ప్రభాకర్, ఎస్‌ఐ శ్రీనివాసులు స్పందించి పాఠశాల ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని విద్యాసంస్థను రక్షించాలని ఉపాధ్యాయులు, గ్రామస్థులు కోరుతున్నారు.


