ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల విస్తారమైన ఆయకట్టు భూములకు సాగునీరు అందించే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఆధునికీకరణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం శ్రీకారం చుట్టనున్నారు. సుమారు రూ.150 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో 117 కొత్త గేట్ల ఏర్పాటు, వాటి బిగింపు సహా పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు.
అనంతరం కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక పరిధిలోని పిచ్చుకలంకకు చేరుకుని రైతులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు.ఈ సందర్భంగా వ్యవసాయం, సాగునీటి సదుపాయాలు, రైతుల సమస్యలపై వారితో చర్చించి ప్రసంగించనున్నారు.
ప్రాజెక్టు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం
తదుపరి పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లనున్న సీఎం, ముందుగా ఏరియల్ సర్వే నిర్వహించి నిర్మాణాల పురోగతిని పరిశీలిస్తారు.
అనంతరం అక్కడికి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారు.
పోలవరం ప్రాజెక్టులో ఈసీఆర్‌ఎఫ్ డ్యాం గ్యాప్-2, జలవిద్యుత్ కేంద్రం, ఇతర కీలక నిర్మాణాలకు సంబంధించిన ఫొటో ప్రదర్శనలను సీఎం పరిశీలించనున్నారు.
అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి నిర్మాణాల పురోగతి, చేపట్టాల్సిన తదుపరి చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.
కార్యక్రమాలు ముగిసిన అనంతరం సీఎం ఉండవల్లికి బయల్దేరి వెళ్తారు.


