Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

న్యాయవ్యవస్థపై అపనమ్మకం

గత పదేళ్లుగా వివిధ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం తగ్గిపోతోంది. మరింత ఆందోళనగొలిపేది న్యాయ వ్యవస్థపై కూడా విశ్వాసం సన్నగిల్లిపోవడం. అప్పుడప్పుడు సుప్రీం కోర్టులు ప్రజల విశ్వాసాన్ని నిలుపుకోగలవిగా ఉంటున్నాయి. అయితే ఈ దశాబ్దికాలంలో నేటి పాలక ప్రభుత్వం న్యాయ వ్యవస్థను అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నదని నిపుణులేకాక ప్రజలు సైతం భావిస్తున్నారు. ఇందుకు కీలక ఘట్టాలు ప్రజల విశ్వాసం క్షీణించడానికి దోహదం చేశాయి. ముఖ్యంగా బాబ్రిమసీదును కూల్చివేసి, అక్కడ రామాలయం నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు తీర్పుచెప్పి, అందుకు బహుమతినిగా రాజ్యసభ సభ్యత్వం పొందిన సంఘటనను దేశవ్యాప్తంగా ప్రజలు నేటికీ మరువలేదు. తీర్పులు న్యాయంగా, నిష్పాక్షికంగా ఉన్నాయని నమ్మడానికి వీలులేని విధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఉదాహరణకు ఇటీవల హైకోర్టు జడ్జి ఒకరు తన పదవికి రాజీనామాచేసి రాజకీయాలలో చేరుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, రాజ్యాంగంపై విధేయత లేనట్లుగా మాట్లాడారు. దీని వెనుక ప్రభుత్వానికి ఏదో ఒక కేసులో సహకరించి ఉండవచ్చునని వదంతులు వచ్చాయి. ప్రభుత్వానికి సహకరించిన జడ్జిలకు ప్రభుత్వం బహుమతులిచ్చిన ఘటనలు ఉన్నాయి. ఈ జడ్జి ప్రతిపక్ష రాజకీయ నాయకుల బెయిల్‌ నిరాకరించారు. రాజకీయ దురుద్దేశంతోనే బెయిల్‌ నిరాకరించారని, ఇందుకు ప్రాథమిక సమాచారం రుజువు చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు కొందరు విచారణ దశలో ‘సీల్డు కవరు’ సంస్కృతిని ప్రోత్సహించారు. స్వేచ్ఛగా, న్యాయంగా జరగవలసిన సూత్రాలను ఉల్లంఘించారు. చాలా మంది జడ్జిలు పాలక పార్టీకి అనుకూలంగా తీర్పులిచ్చి పదవీ విరమణ తర్వాత ప్రభుత్వంలో పదవులు పొందారు. లోక్‌పాల్‌గా, గవర్నర్లుగా కేంద్ర సంస్థల చైర్‌పర్సన్‌లుగా చేరి ప్రయోజనం పొందారు. ఇలా ప్రవర్తించి న్యాయవ్యవస్థ పరువు, ప్రతిష్టను దెబ్బతీశారు. న్యాయవ్యవస్థ రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన జడ్జిలే ఉల్లంఘిస్తున్నారు. న్యాయవ్యవస్థ నిషాక్షికతపై అనేక ప్రశ్నలు తలెత్తడం అత్యంత విచారకరం. క్విడ్‌ప్రోకో (ఇచ్చిపుచ్చుకోవడం) పద్ధతిని కొందరు జడ్జిలు అనుసరిస్తున్నారు. ఎన్నికల బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్‌ తనతీర్పులో ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమైనవి, ఇవి క్విడ్‌ప్రోకోకు దారితీసే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. ఈ తీర్పును దేశంలో న్యాయనిపుణులేగాక ప్రజలు హర్షించారు. ఇలాంటి తీర్పులు న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని మరింత ఇనుమడిరపచేస్తాయి. కొన్ని తీర్పులు తమకు ప్రయోజనకరంగా ఉన్నప్పుడు జడ్జిల పదవీ విరమణ తర్వాత, ఆకర్షణీయ, ప్రయోజనకరమైన పదవులను పాలకులు కట్టబెడుతున్నారు. జడ్జిలకు రాజ్యాంగం విలువలను, పౌరస్వేచ్ఛలను కాపాడవలసిన కీలకమైన బాధ్యత ఉంది. వీటిని పరిరక్షించవలసిన బాధ్యత కేసులను విచారణ చేసినంత కాలమేకాదు, పదవీ విరమణ తర్వాత కూడా ఉంటుంది. తమ కుటుంబ సభ్యులు న్యాయవాదులుగా ఉన్నప్పుడు వారికి ప్రమోషన్లు ఇప్పించినప్పటికీ, అవి రాజ్యాంగాన్ని ధిక్కరించినట్లే అవుతుంది. ఇవన్నీ న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దిగజారుస్తాయి.
జడ్జిలకు రాజకీయ భావజాలం, నమ్మకాలు, సూత్రాలు ఉండవచ్చు. అయితే వాటి ప్రభావం తీర్పులపై ఉండకూడదు. అంతేకాదు, పాలకులిచ్చే పదవులను స్వీకరించి ఆర్థిక ప్రయోజనాలు పొందడం నేరంగా పరిగణించాలి. కోల్‌కతా హైకోర్టు జడ్జి అభిజిత్‌ గంగోపాధ్యాయ రాజీనామాచేసి రాజకీయాలలో చేరుతున్నారని ప్రకటించడం అత్యంత దారుణం. పశ్చిమబెంగాల్‌లో ప్రతిపక్ష బీజేపీ గంగోపాధ్యాయకు టమ్‌లుక్‌ (తూర్పు మిడ్నాపూర్‌) నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టికెట్‌ ఇచ్చింది. అంటే ఏదో విషయంలో బీజేపీకి అనుకూలంగా ఈ జడ్జి తీర్పు ఇచ్చివుండవచ్చు. గంగోపాధ్యాయ గతంలో ప్రజల జడ్జి అని పేరు తెచ్చుకున్నారు. పదవీ విరమణ తర్వాత విశ్రాంత జీవనాన్ని పొందుతున్నవారు ఎంతమంది ఉన్నారన్న పరిశీలన తప్పక ఉంటుంది. పాలకులు తమకు అనుకూలమైన తీర్పుల కోసం వత్తిళ్లు, బెదిరింపులు లాంటివి ఉంటాయి. న్యాయవ్యవస్థలో పనిచేస్తున్న వారు, రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నవారు గణనీయంగా పెరుగుతున్నారు. గతించిన దశాబ్దికాలంలో న్యాయవ్యవస్థపై ప్రజలనమ్మకాన్ని చెల్లాచెదురుచేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. 2018లో నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇండియాలో న్యాయవ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి చీకటి దశ అని బహిరంగంగానే ప్రకటించారు. తమకు అనుకూలమైన ధర్మాసనాలకు అతి ముఖ్యమైన కేసులను బదిలీ చేయాలని పాలకులు ఒత్తిడి చేశారని, ఇది అవాంఛనీయమైనదని ఆ నలుగురు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారంటే ఇండియా న్యాయవ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఈ న్యాయమూర్తుల ఆందోళనకు కారణాలున్నాయని అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా కూడా వ్యాఖ్యానించారు. దీపక్‌మిశ్రా పనిచేసిన కాలం అత్యంత వివాదాస్పదమైనది. సీజేఐ రంజన్‌ గగోయ్‌ మొదటి మూడుమాసాల్లోనే రఫేల్‌ విమానాల వ్యవహారం, సీబీఐ దర్యాప్తు అంశాలు ప్రజల దృష్టిని ఎక్కుగా ఆకర్షించాయి. సీజేఐ అరుణ్‌కుమార్‌ మిశ్రా కూడా విమర్శలకు దూరంగా లేరు. ఆయన పదవీ విరమణ తర్వాత జాతీయ మానవహక్కుల కమిషన్‌ చైర్మన్‌ పదవి లభించింది. ఇలాంటివారు ప్రభుత్వ మానవ హక్కుల ఉల్లంఘనలను విమర్శించే అవకాశం ఉండదు. అంతేకాదు, తమ హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఎవరైనా ఫిర్యాదుచేస్తే వారికి న్యాయం జరిగే అవకాశమే ఉండదు. సుప్రీంకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తి అబ్దుల్‌ నజీర్‌ను పదవీ విరమణ చేసిన మూడునెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా ప్రభుత్వం నియమించింది. నరేంద్ర మోదీ పాలనా కాలంలోనే న్యాయవ్యవస్థ దిగజారిందని చెప్పడానికి ఇలాంటి ఎన్నో ఘటనలున్నాయి. న్యాయవ్యవస్థ, రాజ్యం ఒక దానినొకటి సహకరించుకున్నట్లయితే ప్రజలు తమ కష్టాలను ఎవరితో మొరపెట్టుకోవాలి? అందుకే సార్వత్రిక ఎన్నికల సందర్భంగానైనా ఓటర్లు ఆలోచించి ఓట్లు వేసిన ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఎన్నుకోవలసిన ఆవశ్యకత ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img