Saturday, November 2, 2024
Saturday, November 2, 2024

కాల్పుల విరమణకు ఇజ్రాయిల్‌ వ్యతిరేకం

దాడుల విస్తరణపై లెబనాన్‌ ప్రధాని నజీబ్‌ మికాటి

బీరుట్‌: తమ భూభాగంలో ఇజ్రాయిల్‌ బాంబుల వర్షం కురిపిస్తుండటంపై లెబనాన్‌ ప్రధాని నజీబ్‌ మికాటి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ స్థాయిలో దాడులను విస్తరిస్తుండటాన్ని బట్టి కాల్పుల విరమణ ఉద్దేశం ఇజ్రాయిల్‌కు లేదని స్పష్టమైందని ఆయన అన్నారు. నెలరోజులుగా సాగుతున్న రాజీ చర్చలను నిర్వీర్యం చేసే విధంగా ఇజ్రాయిల్‌ వైమానిక, భూతల విస్తృత దాడులు సాగుతున్నాయని ఆయన శుక్రవారం ఒక ప్రకటన చేశారు. ‘లెబనాన్‌ భూభాగాల్లో ఇజ్రాయిల్‌ సైన్యం విధ్వంసం సృష్టిస్తోంది. వరుసగా గ్రామాలు, నగరాలను ఖాళీ చేయిస్తోంది. దక్షిణ బీరుట్‌ శివారు ప్రాంతాలే లక్ష్యంగా విధ్వంసకాండ సాగిస్తోంది. దీంతో కాల్పుల విరమణను ఇజ్రాయిల్‌ తిరస్కరిస్తోందని స్పష్టమైంది’ అని నజీబ్‌ పేర్కొన్నారు. లెబనాన్‌లో పోరు ముగించడంపై రాజీ కోసం అమెరికా దౌత్యాధిరులతో ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు భేటీ క్రమంలో లెబనాన్‌ ప్రధాని వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడిరది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఇజ్రాయిల్‌హెజ్బుల్లా మధ్య పోరులో కాల్పుల విరమణకు అవకాశం ఉన్నట్లు అమెరికా దౌత్యాధికారి అమోస్‌ హోచ్‌స్టిన్‌ ఫోన్‌లో చెప్పినట్లు నజీబ్‌ ఇటీవల వెల్లడిరచారు. ఆమోదయోగ్యమైన ప్రతిపాదనలు ఉంటే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని హెజ్బుల్లా అధినేత సైతం ప్రకటించారు. కానీ ఇజ్రాయిల్‌ తీరు అందుకు భిన్నంగా ఉంది. ఇజ్రాయిల్‌కు దీర్ఘకాల భద్రతకు హామీ ఇచ్చేలా లెబనాన్‌ ఒప్పందం ఉండాలని అమెరికా దౌత్యాధికారులు అమోస్‌ హోచ్‌స్టిన్‌, బ్రెట్‌ మెక్‌గుర్క్‌తో నెతన్యాహు చెప్పారు. ఇజ్రాయిల్‌పై లెబనాన్‌ రాకెట్‌ దాడి: నలుగురు థాయి పౌరుల మృతి ఉత్తర ఇజ్రాయిల్‌పై లెబనాన్‌ జరిపిన రాకెట్‌ దాడిలో నలుగురు థాయిలాండ్‌ పౌరులు మరణించారు. ఈ మేరకు థాయిలాండ్‌ విదేశాంగ మంత్రి మారిస్‌ సంగియాంపోస్కా ‘ఎక్స్‌’లో తెలిపారు. మెటులా పట్టణం సమీపంలో మరణాలు సంభవించాయని, మరొకరికి గాయాలయ్యాయని తెలిపారు. రాకెట్‌ దాడిలో స్థానిక రైతు, నలుగురు విదేశీ వర్కర్లు చనిపోయినట్లు స్థానిక అధికారులు వెల్లడిరచారు. ఇజ్రాయిల్‌లో 30వేల మంది థాయిలాండ్‌ పౌరులు ఉన్నారు. 2023 అక్టోబరు 7 నుంచి 39 మంది చనిపోయారు. 23 మంది నిర్బంధానికి గురయ్యారు. మేలో గాజా నిర్బంధంలో ఇద్దరు థాయి పౌరులు మరణించినట్లు ఇజ్రాయిల్‌ సైన్యం వెల్లడిరచారు. తమ పౌరుల మరణాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన థాయిలాండ్‌ విదేశాంగ మంత్రి... శాంతికి పిలుపునిచ్చారు. అమాయక పౌరుల రక్తాన్ని చిందిస్తూ ప్రాదేశిక ఘర్షణను మరింత తీవ్రతరం చేయొద్దని, సాగదీయొద్దని హితవు పలికారు. లెబనాన్‌లో 24 మందిగాజాలో మరో 16 మంది మృతి
తూర్పు, దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయిల్‌ జరిపిన వైమానిక దాడుల్లో 24 మంది చనిపోగా, మరో 19 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు లెబనాన్‌ సైన్యం తెలిపింది. ఇజ్రాయిల్‌ యుద్ధ విమానాలు, డ్రోన్లు దక్షిణ లెబనాన్‌పై 35సార్లు, తూర్పు భాగంలో 12సార్లు దాడి చేశాయని పేర్కొంది. తూర్పు లెబనాన్‌లోని బెకా లోయలో మోటార్‌సైకిల్‌ లక్ష్యంగా ఒక దాడి జరిగినట్లు వెల్లడిరచింది. 2023, అక్టోబరు 8 నుంచి ఇప్పటివరకు 2,867 మంది చనిపోగా, 12,047 మంది గాయపడ్డారని లెబనాన్‌ ఆరోగ్యశాఖ తెలిపింది. అటు సెంట్రల్‌ గాజా స్ట్రిప్‌లోని నుసీరత్‌ శరణార్థి శిబిరం పరిధిలోని రెండు నివాసాలపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 16 మంది పలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. పౌర రక్షణ, వైద్య బృందాలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మృతులను, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 16 మృతదేహాలు తమ ఆసుపత్రికి రాగా మరో 30 మంది తీవ్రస్థాయిలో గాయపడ్డారని అల్‌ అవ్దా ఆసుపత్రి వర్గాలు వెల్లడిరచాయి. గాయపడిన వారిలో ఇద్దరు జర్నలిస్టులు, ఒక మెడిక్‌ ఉన్నట్లు తెలిపాయి. గాజాలో మృతుల సంఖ్య 43,204కు పెరిగినట్లు తాజా ప్రకటన తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img