వాషింగ్టన్: డెమోక్రాటిక్ అభ్యర్థి కమలాహారిస్‌కు సంబంధించి ఎడిట్ చేయని ఒరిజినల్ ఇంటర్వ్యూ ట్రాన్స్‌స్క్రిప్ట్‌ను బహిర్గతం చేయాలని ఓ మీడియా సంస్థకు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ లేఖ రాశారు. లేకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అమెరికన్ మీడియా సంస్థ ‘సీబీఎస్’ కమలా హారిస్ ఇంటర్య్వూను మోసపూరితంగా ఎడిట్ చేసిందని ట్రంప్ ఆరోపించారు. ఇంటర్వ్యూలో ఆమెను అడిగిన ప్రశ్నకు మీడియా సంస్థ రెండు సమాధానాలను ప్రసారం చేసిందని విమర్శించారు. ‘హారిస్ సామర్థ్యం, తెలివితేటల విషయంలో ఓటర్లలో గందరగోళం సృష్టించే ఉద్దేశంతో మార్పులు చేసిన ఇంటర్వ్యూను ప్రసారం చేసి ఓటర్లను తప్పుదారి పట్టించారు’ అని సీబీఎస్‌కు రాసిన లేఖలో ట్రంప్ న్యాయవాది పేర్కొన్నారు. ఆ మీడియా సంస్థ మాత్రం ట్రంప్ ఆరోపణలు అవాస్తవం అంటూ తోసిపుచ్చింది. ‘కమలాహారిస్‌తో జరిగిన మోసపూరిత ఇంటర్వ్యూ వివరాలను సీబీఎస్ ఎప్పుడు విడుదల చేస్తుంది. హారిస్‌ను తెలివైన వ్యక్తిగా చూపించేందుకు ఆమె ఇచ్చిన సమాధానాన్ని వారు మార్చారు. బ్రాడ్కాస్ట్ ఇండస్ట్రీలో జరిగిన అతిపెద్ద మోసం ఇదే కావొచ్చు. రెండు వాక్యాలను కలిపి సమాధానం చెప్పలేని పరిస్థితిలో హారిస్ ఉన్నారు. దానిని తొలగించి కొత్త సమాధానాన్ని ప్రసారం చేశారు. ఆమెను రక్షించడానికి అసలేం మార్చారో తెలుసుకునే హక్కు అమెరికా ఓటర్లకు ఉంది. ఆమె ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం’ అంటూ ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్టుతో ఈ వివాదం మొదలైంది.