Monday, May 20, 2024
Monday, May 20, 2024

ప్రపంచవ్యాప్తంగా ఘనంగా మేడే

. ఎర్రజెండాలతో కదం తొక్కిన కార్మికవర్గం
. అనేక నగరాల్లో వెల్లువెత్తిన నిరసన ర్యాలీలు
. వేతనాలు పెంచాలని, ధరలు తగ్గించాలని డిమాండ్‌

సియోల్‌/ఇస్తాంబుల్‌/టోక్యో: ఎన్నో ఉద్యమాలు జరుగుతుంటాయి కానీ, కొన్ని చిరస్థాయిగా నిలిచిపోతాయి… దానికి ప్రధాన కారణం ఆ ఉద్యమం సాధించిన ఫలితమే. అలాంటిదే మేడే… ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవా (మేడే) న్ని ఎర్రజెండాల రెపరెపల నడుమ ఘనంగా నిర్వహించారు. వేలాదిమంది కార్మికులు, వామపక్ష కార్యకర్తలు ఎర్రజెండాలను చేతబూని భారీ ప్రదర్శనలు నిర్వహిస్తూ… హక్కులు సాధించుకున్న రోజును జరుపుకున్నారు. అదే సమయంలో కొన్ని చోట్ల తమ సమస్యలపై నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టారు. ఆసియాలోని రాజధాని నగరాలు, ఐరోపా నగరాల్లో కార్మికులు బుధవారం మే డేను పురస్కరించుకుని పెరుగుతున్న ధరలు, ఆయా ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక విధానాలపై వీధుల్లోకొచ్చి నిరసన తెలిపారు. టర్కీలోని అతిపెద్ద నగరం ఇస్తాంబుల్‌లో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రఖ్యాతి గాంచిన సెంట్రల్‌ తక్సిమ్‌ స్క్వేర్‌కు ర్యాలీగా వెళ్లేందుకు యత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ కార్మికదినోత్సవం జరుపుకోవడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయినప్పటికీ సెంట్రల్‌ తక్సిమ్‌ స్క్వేర్‌కు చేరుకోవడానికి ప్రయత్నించిన డజన్ల కొద్దీ వామపక్ష పీపుల్స్‌ లిబరేషన్‌ పార్టీకి చెందిన కార్యకర్తలను ఇస్తాంబుల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ ప్రభుత్వం భద్రతా కారణాల పేరుతో తక్సిమ్‌ ప్రాంతంలో ర్యాలీలు, ప్రదర్శనలను నిషేధించింది. 1977లో ముష్కరులు తక్సిమ్‌లో మేడే వేడుకలపై కాల్పులు జరిపారు. దీనివల్ల తొక్కిసలాట జరిగి 34 మంది మరణించారు. బాధితులకు నివాళులర్పించేందుకు కార్మికులు చేసిన యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. చివరకు కొంతమంది కార్మిక సంఘం ప్రతినిధులకు మాత్రమే స్క్వేర్‌లోకి అనుమతించారు.
అ ఇండోనేసియాలో కొత్త చట్టంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హక్కులను ఉల్లంఘిస్తున్నారని, సంక్షేమాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస వచ్చిన కార్మికులకు రక్షణ కల్పించాలని, కనీస వేతనాలను పెంచాలని డిమాండ్‌ చేశారు. శాటిలైట్‌ నగరాలైన బోగోర్‌, డెపోక్‌, టాంగెరాంగ్‌, బెకాసి నుండి సుమారు 50వేల మంది కార్మికులు రాజధాని జకార్తాలోని నిర్వహించిన మే డే ర్యాలీలో పాల్గొన్నట్లు ఇండోనేషియా ట్రేడ్‌ యూనియన్ల సమాఖ్య అధ్యక్షుడు ఇక్బాల్‌ తెలిపారు. నేషనల్‌ మాన్యుమెంట్‌ పార్క్‌ దగ్గర గట్టి పోలీస్‌ బందోబస్తు ఉన్నప్పటికీ కార్మిక సంఘాల జెండాలను ఊపుతూ… ఉద్యోగ సృష్టి చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇండోనేషియా పార్లమెంట్‌ గత సంవత్సరం ఉద్యోగ కల్పనపై వివాదాస్పద చట్టాన్ని భర్తీ చేస్తూ ప్రభుత్వ నియంత్రణను ఆమోదించింది. అయితే ఇది ఇప్పటికీ వ్యాపారాలకు ప్రయోజనం చేకూరుస్తుందని విమర్శకులు తెలిపారు. ఆగ్నేయాసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన దేశానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు అధ్యక్షుడు జోకో విడోడో చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా అధికారుల పాత్రను తగ్గించేందుకు ఈ చట్టం ఉద్దేశించబడిరది.
అ దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో మేడేను పురస్కరించుకుని పెరుగుతున్న ధరలు, ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ… కొరియన్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది నిరసనకారులు జెండాలు చేతబూని, కార్మిక అనుకూల నినాదాలు చేశారు. తమ ర్యాలీ ప్రధానంగా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన స్వరాన్ని పెంచడానికి ఉద్దేశించినదని నిర్వాహకులు తెలిపారు. గత రెండేళ్లలో మా కార్మికుల జీవితాలు నిరాశలో కూరుకుపోయాయని కొరియన్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ నాయకుడు యాంగ్‌ క్యుంగ్‌-సూ పేర్కొన్నారు. యున్‌ సుక్‌ యోల్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు విస్మరించబోమన్నారు. సియోల్‌ ర్యాలీలో పాల్గొన్నవారు ఆ తర్వాత వీధుల గుండా కవాతు చేశారు. ఇలాంటి మే డే ర్యాలీలు బుధవారం దక్షిణ కొరియా అంతటా పదికిపైగా ప్రాంతాల్లో జరిగాయి.
అ జపాన్‌ రాజధాని టోక్యోలోని యోయోగి పార్క్‌లో మేడే సందర్భంగా 10వేల మందికి పైగా కార్మికులు సమావేశమయ్యారు. వేతనాలు పెంచాలని, ధరల పెరుగుదలను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. చెప్పారు. నేషనల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ నాయకుడు మసాకో ఒబాటా మాట్లాడుతూ… తగ్గుతున్న వేతనాలు జపాన్‌లో చాలా మంది కార్మికుల జీవితాలను ఛిద్రం చేశాయన్నారు. ఆదాయ అసమానతలను పెంచాయని అన్నారు. ‘ఈ మేడే నాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా తోటి కార్మికులతో మేము వారి హక్కుల కోసం నిలబడతాము’ అని తెలిపారు.
అ ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో వందలాది మంది కార్మికులు, వామపక్ష కార్యకర్తలు మండుతున్న వేసవి వేడిలో కవాతు, ర్యాలీ నిర్వహించారు. నిత్యావసరాలు, చమురు ధరలు తగ్గించాలని, కనీస వేతనం పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. నిరసనకారులను రాష్ట్రపతి భవనం వద్దకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎర్ర జెండాలు ఊపుతూ, పోస్టర్లు పట్టుకుని ‘మేము జీవించడానికి పని చేస్తున్నాము, చనిపోవడానికి కాదు’, ‘ధరలు తగ్గించండి… జీతాలు పెంచండి’ అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img