Monday, October 28, 2024
Monday, October 28, 2024

పెన్షన్ల పంపిణీ నుంచివలంటీర్లు ఔట్‌!

సచివాలయ ఉద్యోగులకు బాధ్యతలు
రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం
2.60 లక్షల మంది అయోమయం
జులైలో గౌరవ వేతనం పడుతుందా?, లేదా?

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : కూటమి ప్రభుత్వ తొలి మంత్రివర్గ సమావేశ నిర్ణయాలతో వలంటీర్లకు నిరాశ మిగిలింది. జులై 1న ఇంటింటా పెన్షన్లను గ్రామ, వార్డు సచివాలయ పూర్తి స్థాయి ఉద్యోగులతోనే పంపిణీ చేయించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వలంటీర్ల సేవల వినియోగంపై స్పష్టత రాలేదు. వారి సేవలను యథాతథంగా కొనసాగిస్తారా? లేక పునర్యవస్థీకరిస్తారా? అనేదీ చర్చకు రాలేదు. వచ్చే పెన్షన్ల పంపిణీని వలంటీర్లకు బదులుగా సచివాలయ ఉద్యోగులకే బాధ్యతలు అప్పగించాలని మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. సోమవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు చేసిన 5 సంతకాలపై ఆమోదముద్ర వేసి, వాటి అమలుకు తక్షణమే కార్యాచరణ రూపొందించారు. ఇందులో ప్రధాన అంశమైన పెన్షన్లను ఇంటింటా గ్రామ, వార్డు సచివాలయ పూర్తి స్థాయి ఉద్యోగుల ద్వారానే పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో వలంటీర్ల పరిస్థితి అయోమయంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించింది. వారికి రూ.5 వేల గౌరవ వేతనం కల్పిస్తూ, ఇంటింటా పెన్షన్ల పంపిణీకి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు, సమాచారం సేకరణ తదితర అవసరాలకు వినియోగించింది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ ముందు వరకూ వారి సేవలు కొనసాగాయి. ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో వారి సేవలను నిలిపివేశారు. ఆ సమయంలో పెన్షనర్ల దారులు సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరిగి నానా ఇబ్బందులకు గురయ్యారు. చాలా మంది చనిపోయారు. కూటమి తరపున టీడీపీ, జనసేన తన ఎన్నికల మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే… వలంటీర్ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.
మంత్రులు, ఎమ్మెల్యే చుట్టూ వలంటీర్ల ప్రదర్శనలు
ఎన్నికల సమయంలో వేలాది మంది వలంటీర్లు రాజీనామాలు చేశారు. మిగిలిన వారు తటస్థంగా ఉండిపోయారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో రాజీనామాలు చేసిన వలంటీర్ల పరిస్థితి అయోమయంగా మారింది. ఒక వైపు స్థానిక వైసీపీ నేతలను వారు నిలదీస్తూ… మరోవైపు కూటమి ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలను కలుస్తూ తమ ఉద్యోగాలు తిరిగి ఇచ్చేలా చూడాలని విన్నవిస్తున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కూడా కొందరు వలంటీర్లు కలిసి అభ్యర్థించారు. మరోవైపు రాజీనామాలు చేయని వలంటీర్ల సేవల కొనసాగింపుపైనా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. జులై 1 నుంచి తమతోనే పెన్షన్లు పంపిణీ చేయిస్తారని ఆశించిన వలంటీర్లు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం వ్యూహాత్మకంగా గ్రామ, వార్డు సచివాలయ పూర్తి స్థాయి ఉద్యోగులతోనే పెన్షన్ల పంపిణీ చేయనుంది. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చి… ఏకకాలంలో దాదాపు లక్షా 37 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. వివిధ శాఖలను నెలకొల్పి వారికి బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసి, ఇతర శాఖలకు కొంత మంది వెళ్లిపోగా, ప్రస్తుతం సచివాలయాల ద్వారా దాదాపు లక్షా 24 వేల మంది పూర్తి స్థాయి ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతోనే స్థానిక ప్రజలకు దాదాపు అన్ని రకాల సంక్షేమం, ధ్రువీకరణ పత్రాల పంపిణీకి సులువైన మార్గం ఏర్పడిరది. ఇదే సమయంలో ప్రతి 50 మందికి ఒక వలంటీరును సేవలందించేవారు. కూటమి ప్రభుత్వం జులై 1 నుంచి పంపిణీ చేయబోయే పెన్షన్లకు వలంటీర్లను దూరం పెట్టడంతో అనేక అనుమానాలు నెలకొన్నాయి. అసలు వలంటీర్‌ వ్యవస్థ ఉంటుందా?, లేక రాబోయే రోజుల్లో ఉన్న వలంటీర్లను పక్కన పెట్టి, నూతన నియామకాలు ఉంటాయా? అనేదీ గందరగోళంగా మారింది. మేనిఫెస్టోలో కూటమి ఇచ్చిన వలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు రాజీనామాలు చేసిన వారు మినహా, మిగిలిన అందరు వలంటీర్లకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం వేశారు. కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా పెంచిన రూ.10 వేల గౌరవ వేతనాన్ని జులైలో వారికి వేస్తారా?, లేదా? అనే ఆందోళనతో వారంతా ఉన్నారు. వలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని సమాచార శాఖ మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. తమ సేవలు యథాతథంగా ఉంటాయని ఆశించిన వలంటీర్లు మంత్రివర్గ తొలి సమావేశంలో ఎటువంటి నిర్ణయం వెలువడకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img