యూరోపియన్ కమ్యూనిస్ట్ యాక్షన్ పిలుపు
బ్రసెల్స్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల విముక్తి కోసం పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని యూరోపియన్ కమ్యూనిస్ట్ యాక్షన్ (ఈసీఏ) పిలుపునిచ్చింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ), పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థ, సామ్రాజ్యవాద యుద్ధాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సూచించింది.‘శ్రామిక మహిళలకు విముక్తి కల్పించే ప్రక్రియను ఇంటర్నేషనల్ వర్కింగ్ ఉమెన్స్ డే ఓ సూచిక. వర్గపోరునకు ఇది వేరు కాదు. మహిళలు అనుభవించే అసమానత్వం, లింగపని వివక్షపై పోరునకు సంకేతం. దీనిని మనం జీవించే పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి వేరు చేయలేం’ అని యూరోపియన్ కమ్యూనిస్ట్ యాక్షన్ (ఈసీఏ) ప్రకటన పేర్కొంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల హక్కుల పరిరక్షణ కోసం పిలుపునిచ్చింది. 1917లో గ్రేట్ అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం ద్వారా మహిళలకు కీలక హక్కులు లభించాయని గుర్తుచేసింది. సమానత్వం, విడాకులు పొందడం. స్వేచ్ఛా జీవితం, న్యాయబద్ధంగా గర్భవిచ్ఛితికి హక్కులు వచ్చాయని తెలిపింది. పనిచేసే మహిళలు అనేక రకాలుగా వివక్షను ఎదుర్కొంటున్నట్లు గుర్తుచేసింది. వేతనాల్లో వ్యత్యాసం, పని భద్రత లేకపోవడం, నియామకాల్లో అసమానతలు, మెటర్నిటీ, మేనోపాస్ కారణంగా వివక్షకు గురవుతున్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తంచేసింది. కుటుంబ సంరక్షణ, పిల్లల బాగోగుల బాధ్యతనూ మహిళలు మోస్తున్నారని పేర్కొంది. ‘వివక్ష, లైంగిక వేధింపులు, హింస, పని ప్రదేశాల్లో అభద్రత, కుటుంబ సమస్యల వంటివి మహిళలను మానసికంగానే కాకుండా భౌతికంగానూ కుంగతీస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వారి మరణానికి దారితీస్తున్నాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ వేధింపుల నుంచి తప్పించుకునేందుకు మహిళలకు పెద్దగా అవకాశం ఉండటంలేదు. ఇటీవల కాలంలో పరిస్థితి మరింత దిగజారింది. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల వల్ల మహిళల జీవితాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. వారి మనుగడ కష్టసాధ్యంగా మారుతోంది. కార్మిక సంఘాల్లో మహిళా భాగస్వామ్యాన్ని, సామాజిక, రాజకీయ జీవనశైలినీ దెబ్బతీస్తోంది. లింగ
పని వివక్ష సవాల్‌గా మారింది. లైంగిక వేధింపులు, హింస పేట్రేగిపోతోంది. వీటి నియంత్రణకు పోరాటం తప్పదు’ అని యూరోపియన్ కమ్యూనిస్ట్ యాక్షన్ (ఈసీఏ) ప్రకటన పేర్కొంది.