విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక రైతు సేవా కేంద్రంలో సిబ్బందికి సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడికి ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కోసం సమాచారం పొందే హక్కు వుంటుందన్నారు. అలాంటప్పుడు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతతో వారు అడిగిన సమాచారం 30 రోజుల లోపల అందించి వారినుండి రషీదు పొందవలెనని తెలిపారు. సమాచారం కోసం సమాచార అధికారిని సంప్రదించాలని, సమాచారం సంతృప్తి చెందనట్లయితే అప్పీలేట్ అధికారిని సంప్రదించవచ్చనన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి పెద్దకడుబురు మండల వ్యవసాయ అధికారి సమాచార అధికారి కాగా, సహాయ వ్యవసాయ సంచాలకులు ఆదోని వారు ఫస్ట్ అప్పీలేట్ అధికారి అవుతారని, జిల్లా వ్యవసాయ అధికారి సెకండ్ అప్పీలేట్ అధికారిగా వ్యవహారిస్తారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సిబ్బంది పాల్గొన్నారు.