Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

అలుపెరగని పోరాటయోధుడు వి.కె.

సనప రామకృష్ణ

ఎర్రజెండా స్పూర్తితో జీవిత చరమాంకం వరకు ప్రజాసమస్యలపై పోరాడిన విప్లవ యోధుడు వి.కె. ఆది నారాయణరెడ్డి. మొదటి దేశ స్వాతంత్య్ర భావాలను కలిగి ఉన్న వి.కె. 1843లో కమ్యూనిసు ్టపార్టీలో చేరారు. రాయలసీమ ప్రాంతంలో కరువుతో కష్టాలపాలైన రైతులకు అండగా వి.కె. అలుపెరుగని పోరాటాలు జరిపారు. 08101917లో జన్మించిన వి.కె. 18071877లో మరణించారు. 54 సంవత్సరాలు రుజువర్తుడైన వి.కె. రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలపై ఉద్యమించారు. సాగునీటి ప్రాజెక్టు సాధనకు, రాయలసీమ అభివృద్ధికోసం, ముఖ్యంగా అనంతపురం జిల్లా కరువు బారి నుంచి విముక్తి గావించేందుకు ఎనలేని కృషి చేశారు. అవినీతికి, దౌర్జన్యాలకు, హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి జీవిత పర్యంతం పోరాడిన వీరుడు ఆయన. కమ్యూనిస్టుపార్టీని బలోపేతం చేసేందుకు నిరంతరం పనిచేశారు. తాగునీరు, సాగునీటి పరిష్కారం కోసం జిల్లాలో కమ్యూనిస్టు కార్యకర్తలను, ప్రజలను సమీకరించి పోరాడారు. జిల్లాలో మొదట 1949లో వ్యవసాయ కూలీ పోరాటాన్ని చీముల వాగుపల్లె, తరిమెల్ల ప్రాంతంలో నిర్వహించారు. చీముల పల్లె వి.కె. పుట్టిన గ్రామం. వి.కె. తండ్రి, అన్నలు, చెల్లెళ్లు ఆయనకు అండగా నిలచి ఉద్యమాల్లో పాల్గొన్నారు.
సోదనపల్లె, జలాల్‌ పురం, పెరవలి, చిత్రచేడు, చిట్టూరు, ఎక్కలూరు, చీమలవాగుపల్లె, చుక్కలూరు, చియ్యేడు, పూలకుంట, పెద్దపప్పురు, గ్యాదిగకుంట, బుక్కపట్నం కమ్యూనిస్టు శాఖలు మొదట కదలినాయి. పార్టీశాఖలుగాని, వ్యవసాయ కార్మిక సంఘాలుగాని లేని ప్రాంత ప్రజలు కూడా తమంతతాము చొరవతీసుకొని ఈ సమ్మెలు నిర్వహించారు. అర్ధశేరు గింజల పెంపుకోసం తీవ్రమైన పోరాటం చేయవలసి వచ్చింది. పీడితప్రజల చిన్న పోరాటంకూడా తీవ్రనిర్బంధాన్ని ఎదుర్కొంది. ఏది ఏమైనా కూలీలు నెగ్గకూడదని భూస్వాములు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగమూ – శాసనసభ్యులు, మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శి నుండి చిన్న పోలీసు దాకా- భూస్వాములూ, వారి స్నేహితులూ, అనుయాయులూ ప్రజల వాక్‌, సభా, పత్రికా స్వాతంత్య్రాలు అరికట్టడానికి పూనుకున్నారు. కరపత్రాలు ఏ ప్రెస్సూ ముద్రించకుండా చేసినారు. పోలీసులు సభలకు అనుమతి ఇవ్వలేదు. ప్రజలకు, పార్టీకి సంబంధాలు తెగగొట్టే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయి. పోరాటవార్తలు వ్యాపించకుండా సర్వప్రయత్నాలు చేసారు. భూస్వాములు, పెత్తందార్లు పోలీసు బలగాన్ని ముఖ్యంగా రిజర్వు పోలీసులను బాగా ఉపయోగించు కున్నారు. పెత్తందార్ల రౌడీలకన్నా ఈ పోలీసులు చాలా కిరాతకంగా వ్యవహరించారు. 16-05-1949 న సోదనపల్లెలో రిజర్వు పోలీసులు పార్టీకార్యకర్త ముత్యాలును రక్తం కక్కేవరకూ కొట్టారు. పార్టీ కార్యకర్తలను కొట్టంలోవేసి సజీవదహనం చేయాలనే ప్రయత్నాలు రెండుచోట్ల జరిగింది. ఇట్లాంటి హింసాత్మక సంఘటనలు పోరాటం ప్రతివూరిలోనూ జరిగింది. వ్యవసాయ కార్మిక ఉద్యమానికి కమ్యూనిస్టుపార్టీ బాధ్యునిగా వీ.కే. పథకరచన చేసారు. భూస్వాముల దౌర్జన్యాల గురించీ, ప్రభుత్వ దమననీతి గురించి, ప్రజాపోరాటాల ద్వారా సాధించిన కోర్కెల గురించి కూలివాడల్లో పోస్టర్లు వేసారు. జీవనభృతికి తగినకూలి, దోపిడి ఫలితంగా నికృష్ట జీవనం గడపవలసిన పరిస్థితిని వి.కె. వివరించారు. భూస్వాములు, ధనికరైతులు సంపాదించే లాభమంతా వ్యవసాయ కూలీల అదనపు శ్రమ ఫలితమని, దోపిడీ మూలకారణాన్ని తొలగించే పోరాటమే వ్యవసాయ కార్మిక పోరాటమనీ హక్కునూ, లక్ష్యాన్ని స్పష్టీకరించారు. స్త్రీలకు ప్రత్యేక గృహ సమావేశాలు నిర్వహించి, వారిని సమీకరించి పోరాటంలో పురుషులకన్నా ముందువుండేటట్లు చూసారు. ఒక ప్రాంతానికి చెందిన సమస్య అయినా చుట్టుపక్కల గ్రామాలనుండి జన సమీకరణచేసి, సభలు నిర్వహించారు. కోర్కెల నినాదాలతో ఎజండా ఊరేగింపులు చేసారు. దీనివల్ల కూలీలలో ఐక్యత, ఆత్మవిశ్వాసం, ఐక్య ప్రతిఘటనా శక్తి పెరిగింది.
1953 లో ఒక్క కళ్యాణ దుర్గంఏరియాలోనే 14వేలఎకరాల శివాయిజమా భూమిని కూలీలు ఆక్రమించారు. వ్యవసాయ కార్మికులలో వచ్చిన చైతన్యమూ, సజావుగా తర్కించే తీరూ, ప్రశ్నించేతత్వమూ తెలపడానికి ఒకచిన్న ఉదారణ..చీమలవాగుపల్లెలో జరుగుతున్న వ్యవసాయకార్మిక సమ్మెను అణచటానికి గ్రామపెత్తందార్ల అర్జీ మేరకు ఆ ఊరిలో రిజర్వు పోలీసును వుంచాడు కలెక్టరు. వేములపాడులో రహస్య స్థావరంలో వుంటూ సమ్మెను పర్యవేక్షిస్తున్నారు. 13-10-1949 న కలెక్టరు గ్రామానికి వచ్చి వ్యవసాయ కార్మికులతో వాదనకు దిగినాడు.- ‘‘ పూర్వకాలంలో మూడు శేర్లు కుటుంబపోషణకు సరిపోతుంటే ఇప్పుడెందుకు చాలదు?’’ అని కలెక్టరు ప్రశ్నించాడు. ‘‘ధరలు పెరిగినాయని మంత్రులు తమ జీతాలను ఐదువందల నుంచి పదైదు వందలకు పెంచుకుంటే, మేము మూడుశేర్ల కూలిని నాలుగుశేర్లకు పెంచమని అడగటం అన్యాయమా?’’ అని కలెక్టరుకు ఎదురు ప్రశ్న వేసినారు. ‘‘మాకు ఆరునెలలు పని వుండదు. ఆ ఆరునెలలలోనే పండ్రెండు నెలలకు సరిపడ సంపాదించుకోవాల. మీ పిల్లలు విద్యావంతులై సుఖసంపదలతో తులతూగుతుంటే మేము తరతరాలుగా బానిసలుగా వుండాల్సిందేనా?’’ అని కూడా జనం నిలదీసారు.
వికె భారత కమ్యూనిస్టు పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించినారు. అనంతపురం జిల్లా కార్యదర్శిగా, జిల్లా వ్యవసాయ కార్మికసంఘం కార్యదర్శిగా, రాయల సీమ జిల్లాల కమ్యూనిస్టు పార్టీ నేతగా, రాష్ట్రపార్టీ కార్యదర్శివర్గ సభ్యునిగా, రాష్ట్ర విద్యార్ధి సమాఖ్య ఇన్‌చార్జిగా, జాతీయ సమితి సభ్యులుగా, కంట్రోల్‌ కమీషన్‌ సభ్యునిగా, విశాలాంధ్ర విజ్ఞాన సమితి గవర్నింగు బాడి సభ్యునిగా, 1962 లో గుత్తి నియోజకవర్గ శాసనసభ్యునిగా, రైల్వే కార్మిక సంఘ ప్రధాన బాధ్యునిగా, అయన బాధ్యతలు నిర్వహించారు. వికె సతీమణి పార్వతమ్మగారు చాలా ఓపికతో, సహృదయతతో, యింటికివచ్చిన వారిని ఆదరించేవారు. పార్టీ జిల్లాసమితి సమావేశాలు. కార్యవర్గ సమావేశాలు, పార్టీ ముఖ్యుల సమావేశాలు వికె యింట్లోనే జరిగేవి. ఎవరు వచ్చినా, ఎందరు వచ్చినా చక్కని ఆతిథ్యం యిచ్చేవారు పార్వతమ్మ గారు. నేను జిల్లా అరసం ప్రధాన కార్యదర్శిగా వున్నప్పుడు వారాంతపు సమావేశాలు వికెగారి యింట్లోనే నిర్వహించేవాన్ని. అరసం బహిరంగ సభలకు వచ్చే రాంభట్ల కృష్ణమూర్తి, గజ్జల మల్లారెడ్డి వచ్చేవారు. నేను జిల్లా ప్రజా నాట్యమండలి ప్రధాన బాధ్యునిగా కూడా వున్నాను. మా ఆహ్వానంపై నల్లూరి వెంకటేశ్వర్లు వచ్చేవారు. వీరందరికీ భోజనం, వసతి యిక్కడే. ఒక్కొక్కప్పుడు వీరి రానుపోను టికెట్టు ఖర్చు వికె భరించేవారు. పార్వతమ్మ గారి మొహంలో ఎప్పుడూ చిరునవ్వు మాత్రమే వుండేది.
వికె గారికి రెడ్‌ సెల్యూట్‌!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img