Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

ఆదర్శ జర్నలిస్టు ఎంపీ సారథి

నిఖార్సయిన కమ్యూనిస్టు, నమ్మిన సిద్ధాంతాల కోసం కడవరకు కట్టుబడివున్న మహోన్నత వ్యక్తి తెలుగు పత్రికా రంగానికి సుదీర్ఘ కాలంపాటు సేవలందించిన ప్రముఖ జర్నలిస్టు కామ్రేడ్‌ మాదాసు పార్థ సారథి (ఎంపీ సారధి). విశాలాంధ్ర, సీపీఐ పట్ల ఆయన నిబద్ధత, నిరాడంబర జీవితం మాలాంటి పాత్రికేయులెందరికో ఆదర్శం. విశాలాంధ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. స్నేహశీలి, అజాత శత్రువు అయిన సారథి జీవితం నేటి తరం జర్నలిస్టులకు ఆదర్శనీయం. ఆయనొక నిశ్శబ్ద స్వరూపం, మృదుభాషి, కలం కదలికలతో పాఠకుల మెదళ్లలో చైతన్య కెరటాలు సృష్టించారు. ఆర్థికంగా పేదవాడు అయినప్పటికీ విజ్ఞానపరంగా సుసంపన్నుడు. తనకు తెలిసిన విద్యను దాచుకోకుండా అందరికీ పంచి ఎందరినో ఉత్తమ జర్నలిస్టులుగా తీర్చిదిద్దిన మహనీయుడు. విశాలాంధ్రను ఒక గురుకులంగా రూపుదిద్దిన వారిలో సారథి అగ్రగణ్యులు. విశాలధృక్పధంతో మానవీయ కోణంలో ఆయన ఆలోచనలు వుండేవి. ప్రతి ఒక్కరినీ నిష్ణాతులైన జర్నలిస్టులుగా తయారుచేయాలన్న తపన ఆయనలో ఎంతగానో ఉండేది. పలకరింపులో నిర్మలత్వం, ఆలోచనల్లో ఔన్నత్యం, ఆశయాల ఆచరణలో కచ్చితత్వం ఎంతో నిరాడంబర జీవనం సారథికే సాధ్యమైంది. విశాలాంధ్రలో వివిధ హోదాల్లో ఎనలేని సేవలు అందించారు. విధి నిర్వహణలో ఎటువంటి ఒత్తిడికి గురయ్యేవారు కాదు. విధినిర్వహణలో సమయపాలన, క్రమశిక్షణకు ఆయన మారుపేరు. విశాలాంధ్ర పత్రిక అభివృద్ధికి విశేషంగా కృషిచేశారు. ఇతర పత్రికలలో అనేక అవకాశాలు వచ్చినా తృణప్రాయంగా త్యజించి జీవితకాలం మొత్తం విశాలాంధ్రకే సేవలు అందించారు. అటువంటి మహనీయుడు నేడు మన మధ్యలేకపోయినా ఆయన స్మృతులు పాతతరం జర్నలిస్టులను వెన్నంటే వుంటాయి. కామ్రేడ్‌ సారథి మన నుంచి భౌతికంగా దూరమై ఈ నెల 15వ తేదీకి 25 సంవత్సరాలు గడుస్తుంది. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయ, కమ్యూనిస్టు జీవితాన్ని ఒకసారి గుర్తుచేసుకుంటే… ప్రకాశం జిల్లా విద్యార్థి ఉద్యమ నిర్మాతలలో, ప్రజానాట్యమండలి ప్రకాశం జిల్లా సంస్థాపకులలో సారథి ఒకరు. ప్రసిద్ధ వామపక్ష పత్రికా రంగ ప్రముఖులు, విశాలాంధ్ర దినపత్రికలో దాదాపు 34 సంవత్సరాలు వివిధ హోదాలలో పనిచేశారు. అభ్యుదయ సాహిత్య రంగంలోనూ, ప్రజానాట్యమండలి నిర్మాణంలోనూ ఆయన కృషి మరువరానిది. వామపక్ష పాత్రికేయునిగా కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. పార్థసారథి స్వగ్రామం ప్రకాశం జిల్లా పేర్నమిట్ట, చిన్ననాటి నుంచి సనాతన భావాలను వ్యతిరేకిస్తూ అభ్యుదయ భావాలను అలవర్చుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు విశాలాంధ్రలోనే పనిచేస్తున్నాడు. ఒంగోలులోని శర్మ కాలేజీలో బీఏ ఉత్తీర్ణత అనంతరం జిల్లా కమ్యూనిస్టుపార్టీ నిర్ణయం ప్రకారం 1965 జూన్‌లో విశాలాంధ్రలో సబ్‌ ఎడిటర్‌గా చేరారు. న్యూస్‌ ఎడిటర్‌, అసిస్టెంట్‌ ఎడిటర్‌, అసోసియేట్‌ ఎడిటర్‌గా పదోన్నతి పొందారు. విశాలాంధ్ర ఎడిటోరియల్‌ బోర్డు సభ్యునిగా, విశాలాంధ్ర గవర్నింగ్‌బాడి సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు. 1972 నుంచి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యునిగా వున్నారు. విజయవాడ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షునిగా పనిచేశారు. విశాలాంధ్రలో కమ్యూనిస్టు పార్టీ శాఖ కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. కామ్రేడ్‌ సారథి విద్యార్థి దశ నుంచి సాహిత్య సాంస్కృతిక రంగాలలో ఎంతో ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపైన, తాజా రాజకీయ పరిస్థితులపైన విశాలాంధ్రలో అనేక సంపాదకీయాలు రాశారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఆ సంపాదకీయాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వ్యాఖ్యలు- విమర్శలు శీర్షికను దీర్ఘకాలంపాటు నిర్వహించి, వ్యంగ్య రాజకీయ రచనలుచేస్తూ వామపక్ష భావజాల ప్రచారాన్ని ఇనుమడిరప చేసేందుకు కృషిచేశారు. అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ పదకోశ రూపకల్పనలో పద సంగ్రహణను అందించారు.
ఏపీయూడబ్ల్యూజే, ప్రెస్‌ అకాడమీ సంయుక్తంగా అనేక జిల్లాలలో నిర్వహించిన జర్నలిస్టుల శిక్షణాతరగతులలో ఉపాధ్యాయునిగా అనేక అంశాలపై బోధించి ఎందరినో నిష్ణాతులైన జర్నలిస్టులుగా తీర్చిదిద్దారు. యువజర్నలిస్టులకు ఓపికతో శిక్షణనిచ్చేవారు. ముఖ్యంగా ఆంగ్ల భాష నుంచి తెలుగులోకి అనువదించడంలో ఆయన ఇచ్చిన శిక్షణ మరవలేనిది. విసుగు, కోపం అనేది ఆయన ముఖంలో ఎన్నడూ కనిపించేదికాదు. ఎదుటి వ్యక్తిని ఏమాత్రం చిన్నబుచ్చుకోనిచ్చే వారు కాదు. అనువాదంలో వారు చేసిన తప్పులను అర్ధమయ్యే రీతిలో సహనంతో సరిదిద్దేవారు. విశాలాంధ్రలో ఆయన వద్ద శిక్షణ పొందిన అనేక మంది నేటితరం జర్నలిస్టులు వివిధ దినపత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. తనతో పనిచేసే వారందరితో కలివిడిగా వుండేవారు. వారి కుటుంబాలతో కూడా సన్నిహిత సంబంధా లుండేవి. తాను ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నప్పటికీ తోటి జర్నలిస్టులు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే తల్లడిల్లిపోయేవారు. వారికి ఏదో రూపేణ సాయం చేసే వరకు మనసు కుదుటపడేదికాదు. అవసరమైతే వారి ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పేవారు. ట్రైనీ సబ్‌ఎడిటర్లకు మార్గదర్శిగా ఉండేవారు. తోటివారికి సాయం చేయడం ఎలాగో ఆయన నుంచి నేర్చుకోవాల్సిందే. ఆయన కుటుంబానికే కాక విశాలాంధ్రకు, జర్నలిస్టు సమాజానికి, అభ్యుదయ ఉద్యమానికి సారథి లేనిలోటు తీరనిది. ఆయన ఆశయ సాధనకు అంకిత భావంతో కృషిచేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి.
మోదుమూడి మురళీకృష్ణ (1507`2024 కామ్రేడ్‌ ఎంపీ సారథి 25వ వర్ధంతి సందర్భంగా)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img