London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Monday, October 7, 2024
Monday, October 7, 2024

ఈ పదాల వాడకం ఏమిటో… !?

తెలుగులోనే ఇలా జరుగుతుందేమో. తెలుగులోనే పదాలకు అర్ధాలు మార్చేసి ఇష్టానుసారం వాడేస్తేరేమో… ఇతర భాషల గురించి నాకు తెలియదు కాని తెలుగులో మాత్రం పదే పదే వాడుతున్న పదాలు, కొన్ని చర్యలు నా మటుకు నాకు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తాయి. తెలుగు పత్రికల్లో ఎక్కువగా కనిపించే పదం బ్రహ్మరథం. ఎవరైనా ఏ రంగంలోనైనా గొప్పవారిగా ప్రపంచం గుర్తిస్తేనూ, ఎవరైనా ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జరిపే ఉత్సవాలు, ఊరేగింపుల్లోనూ ఈ బ్రహ్మరథం అనే పదాన్ని విరివిగా వాడతారు. నిజానికి ఈ పదానికి అనేకానేక అర్ధాలున్నాయి. వాటిని పట్టించుకోకుండానే ఈ బ్రహ్మరథం అనే మాటని వాడేస్తారు. పత్రికల్లోనే కాదు వాడుకలో కూడా ఈ బ్రహ్మరథం పదం వాడడం పరిపాటిగా మారింది. బ్రహ్మరథం అనే మాటకి ఉన్న అనేకానేక అర్ధాల్లో ఒకటి అనాథ శవ సంస్కారం. ఆ అనాథ శవ అంతిమ ఘడియలను నలుగురూ కలిసి ఓ బాధ్యతగా నిర్వర్తిస్తారు. దీన్నే బ్రహ్మరథం అంటారు. ఏ ఆలయంలోనైనా జరిగే బ్రహ్మోత్మవాల్లో దేవుని ఊరేగింపులో ఆ రథాన్ని సాక్షాత్తూ ఆ బ్రహ్మే లాగుతారని, అందుకే అది బ్రహ్మరథం అయ్యిందనే మాట కూడా ఉంది. మహాకాళి సుబ్బరాయుడు అనే మహానుభావుడు రూపొం దించిన శబ్దార్థ చంద్రిక నిఘంటువులో బ్రహ్మరథం అనే పదానికి అర్ధం అనాథ శవ సంస్కారమనే ఉంది. పురాణాల్లో ఈ పదం పుట్టుకకు ఓ కథే ఉంది. అయితే, వాటిని పట్టించుకునే వారు లేని లోకం కాబట్టి ఇష్టానుసారంగా ఈ మాటని వాడేస్తున్నారు చాలా మంది.
ఇలాంటిదే మరో పదం నివాళి. ఎవరైనా మరణించారని తెలియగానే ఫేస్‌బుక్‌ల్లోనూ, వాట్సాప్‌ల్లోనూ ఓ దండం పెట్టేసి నివాళి అని పెట్టేస్తారు. ఈ నివాళి అనే పదం పాజిటివ్‌ పదమే అని చాలా మందికి తెలియకపోవడం వల్లే ఈ అనర్ధం. నివాళి అంటే నీరాజనం, హారతి అని సూర్యరాయాంధ్ర నిఘంటువులో ఉంది. ఈ పదానికి అనేక అర్ధాలు, ఈ నివాళితో ఉన్న పద్యపాదాలను కూడా ఈ సూర్యరాయాంధ్ర నిఘంటువులో పొందుపరిచారు. అంతెందుకు మహాకవి శ్రీశ్రీ ఇద్దరు మిత్రులు సినిమా కోసం రాసిన ‘‘ఓహో… ఓహో.. నిన్నే కోరెగా…’’ అనే పాటలో హీరో ‘‘నివాళి అందుకో… ఈ వేళ పండుగా’’ అంటారు. అంటే ఈ నివాళి అనే పదం బాధకు పర్యాయపదం కాదనేగా. ఇప్పుడంటే విమర్శకులు లేరు కాని ఆ పాట రాసిన సమయానికి తెలుగులో రా.రాగా పిలుచుకునే రాచమల్లు రామచంద్రారెడ్డి, వేల్చేరు నారాయణ రావు వంటి దిగ్గజ విమర్శకులు శ్రీశ్రీ వాడిన ఈ నివాళి అందుకో అనే పదాన్ని చీల్చి చెండాడే వారే కదా. అలాగని మహాకవి శ్రీశ్రీ చెప్పారనే కాదు… అనేక నిఘంటువుల్లో కూడా నివాళి అనే పదానికి చింతించడం అనే అర్ధం లేదు.
నాకు ఆశ్చర్యంతో పాటు నవ్వు తెప్పించే మరో మాట ‘‘లోటు’’. ఎనిమిది పదుల వయసు దాటిన వారు కాలం చేస్తే ఇక వెనుక, ముందు చూడకుండా ‘‘ఆయన లేదా ఆమె లేని లోటు’’ అంటూ రాజకీయులతో పాటు సామాన్యులు కూడా ఓ మాట అనేస్తారు. ఎనిమిది పదుల వయసులో కుటుంబానికి కాని, తన చుట్టూ ఉన్న సమాజానికి ఎంతో ఉపకరించిన ఆ శరీరం ఇక అలసి శాశ్వత నిద్రలోకి జారుకుంటే ఆయన లేని లోటు తీర్చలేనిది అంటారేమిటో నాకు అర్ధం కాదు. ఎనిమిది పదుల వయసు దాటిన తర్వాత వారి నుంచి కుటుంబం కాని, సమాజం కాని ఆశించేది ఏముంటుంది. పోనీ అని ఎవరైనా ఆశించినా ఆ వ్యక్తి ఆ ఆశల్ని నెరవేర్చగలరా అనే ఆలోచన కూడా లేకుండా వాడే పదమే ‘‘వారు లేని లోటు తీర్చలేనిది’’. ఇలాంటిదే మరో పదం. వారి ‘‘అకాల మరణానికి చింతిస్తున్నాం’’. ఎనిమిది పదుల వయసు దాటిన తర్వాత అకాలమేమిటి. అదే సకాలం. అలసిన కన్నులు, శరీరం శాశ్వత నిద్రను కోరుకుంటాయి కదా. పత్రికల్లోనూ, జనసామాన్యంలోనూ కూడా ఎక్కువగా వినిపించే మరో పదం మానవ మృగాలు. ఎక్కడో, ఎవడో దుర్మార్గుడు ఓ దారుణం చేస్తే దాన్ని పురుష సమాజం మొత్తానికి అంటగట్టి వాళ్లందరిని మానవ మృగాలు అనేస్తారు. ఇదెక్కడి న్యాయం అనే నా ప్రశ్న.
భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాల్లో ప్రతి ఒక్కరి జీవితానికి అన్వయించుకోవాల్సిన భగవద్గీతను శవ యాత్రలకు పరిమితం చేసిన తెలుగు సమాజం మనది. ఇది ఎంత వరకూ వెళ్లిందంటే మానసిక ప్రశాంతత కోసం ఏ ఇంట్లోనైనా భగవద్గీత వింటూంటే ఆ ఇంటి వైపు అనుమానంగా చూసే కాలంలోకి వచ్చేసింది తెలుగు సమాజం. నా మటుకు నేను ఉదయాన్నే వాకింగ్‌లో భగవద్గీత వింటే ఆ రోజంతా నాలో తెలియని ఉత్సాహం, జీవితంపై ఓ నమ్మకం వస్తాయి. వాకింగ్‌లో నేను పొరపాటున నా ఈయర్‌ ఫోన్స్‌ తీసుకువెళ్లడం మరచిపోయి భగవద్గీతను ఫోన్‌లో పైకి వింటూంటే నా సహచర వాకర్స్‌ నా వైపు అనుమానపు చూపులు చూస్తారు. అక్షరాలు, మాటలు చాలా ఒద్దికగా, గౌరవంగా, అణకువగా వాడాలి. లేకపోతే అక్షరం శపిస్తుంది. ఆ శాప ప్రభావంతో నిరక్షరాస్యుడిగా మిగిలిపోతామేమో… తస్మాత్‌ జాగ్రత్త.
సీనియర్‌ జర్నలిస్టు, 99120 19929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img