Monday, October 28, 2024
Monday, October 28, 2024

పశ్చిమ దేశాలపై తీవ్ర రుణ భారం

బి. లలితానంద ప్రసాద్‌
యూరప్‌లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. అవి ప్రజలు ఎన్నుకున్నవి. కానీ అధికారంలోకి వస్తున్న వారికి వారసత్వం లాగా అప్పుల కుప్పలు సంక్రమిస్తున్నాయి. దీనితో అక్కడ వారు ఆశించిన నూతన మార్పులు రావడానికి/ తేవడానికి అక్కడి వనరులు పరిమితం. అక్కడ ఇంగ్లీష్‌ ఛానల్‌కి రెండువైపులా గల కొత్తగా ఎన్నికలు జరిగిన చోట ప్రభుత్వ రుణ భారం ఎన్నడూ లేనంతగా ఉంది. ఇటు ప్రాన్స్‌ అటు బ్రిటన్‌ రెండు దేశాల్లో ప్రభుత్వ వ్యయం, బడ్జెట్‌ లోటు జీడీపీలో అధిక శాతం కోవిడ్‌- 19 స్థాయి కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక వృద్ధి మందగించింది. రుణ పరిమితులతో వ్యయం పెరిగింది. ప్రభుత్వ వ్యయంపై ఒత్తిడి పెరిగింది. వీటి పర్యవసానం బడ్జెట్‌పై ప్రతిఫలిస్తుంది. తక్కువ వ్యయం, అధిక పన్నులు తప్పనిసరి అవుతాయి అని ఆర్థికవేత్తల భావన. కానీ రాజకీయాలలో వారు దీనికి అంగీకరించరు పౌరుల మాదిరిగానే. పైగా వారు సాహస వ్యయ ప్రణాళికలు సూచిస్తారు. ఈ విషయాలలో అన్ని పక్షాలు పరస్పరం పోటీ పడతాయి. ఫ్రాన్స్‌లో ఇటీవల అదే జరిగింది.
ఏ ఫ్రెంచ్‌ పార్టీ కూడా ఈ వ్యయం లోటు జీడీపీలో ఐదు శాతానికి ఏ విధంగా తగ్గించే దానిపై చర్చించలేదు. ఇది యూరోపియన్‌ యూనియన్‌ నిర్దేశిత ప్రమాణాల అతిక్రమణ, క్రమశిక్షణ చర్యల ప్రక్రియకు దారితీస్తుంది. ఫ్రెంచ్‌ ప్రభుత్వ బాండ్లను పెద్ద స్థాయిలో ఆదరించిన పెట్టుబడిదారులు ఇప్పుడు అధిక రుణభారం కారణంగా ఆందోళన చెందుతున్నారు. స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ సంస్థ మే నెలలో వారి పరపతి రేటింగ్‌ను ఏ ఏ కి తగ్గించింది.
బ్రిటన్‌లో అధికారానికి వచ్చిన లేబర్‌ పార్టీ ప్రజా సేవలపై ఖర్చుని పెంచుతానని సూచిస్తోంది. దీని ప్రతిపాదనలు అందుకు తగిన రీతిలో ఉన్నట్లు లేవు అంటున్నారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిస్కల్‌ స్టడీస్‌( ఐఎఫ్‌ఎస్‌), లండన్‌ మేధో కూటమి ప్రస్తుత పరిస్థితికి ఇటీవల అన్ని పార్టీలని తప్పుపట్టింది. వారి ప్రణాళికలను, అవాస్తవిక ప్రతిపాదలని తప్పు పట్టింది. కఠిన నిర్ణయాలు తప్పనిసరి అని భావించింది. ‘వృద్ధి ఎంతో నిరాశాజనకంగా ఉంది. రుణాలపై వడ్డీ భారం అధికంగా ఉంది. భద్రతా పరిస్థితులు యుద్దానంతరం( రెండో ప్రపంచ) చరిత్రలో బ్రిటన్‌లో ఎన్నడూ లేనంత అద్వానంగా ఉన్నది’ అని ఐఎఫ్‌ఎస్‌ సీనియర్‌ ఆర్థికవేత్త ఇసాబెల్‌ స్టాక్‌ టన్‌ అన్నారు. బ్రిటన్‌లో ప్రభుత్వ రుణ భారం జీడీపీతో పోల్చినప్పుడు 104 శాతానికి పెరిగింది. ఇది 2019లో 86%. కాగా 2007లో 43 శాతం మాత్రమే. ఫ్రాన్స్‌ జాతీయ రుణం జీడీపీికి 112 శాతం. ఇది 2019లో 97%. కాగా 65 శాతం మాత్రమే 2007లో. ఇవి అంతర్జాతీయ ద్రవ్యనిధి( ఐఎంఎఫ్‌) ప్రకారం.
ప్రభుత్వ బడ్జెట్‌ లోటు సంపన్న పశ్చిమ దేశాల్లో కోవిడ్‌ ముందు కన్నా మూడు శాతం పర్సంటేజ్‌ పాయింట్లు ఉండటం కీలకాంశం ‘క్యాపిటల్‌ ఎకనమిక్స్‌’ ప్రకారం. దీనర్థం పాక్షికంగా అధిక వడ్డీ రేట్లు, అధిక వ్యయం కోవిడ్‌తో సంబంధం లేకుండా ఉండటం అన్నారు ‘నెయిల్‌ షీరింగ్‌’ , ఈ సంస్థ ముఖ్య ఆర్థికవేత్త. ఆఖరికి యూరోప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల జర్మనీ కూడా అధిక లోటు బడ్జెట్‌తో ఉంది.
అగ్రరాజ్యం అమెరికా అన్నింటా ఉన్నట్లే ఈ రుణ విషయంలోను అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఈ రుణభారం ఐఎంఎఫ్‌ విస్తృత కొలమానం ప్రకారం జీడీపీకి 123 శాతం. 2019లో 108 శాతం నుంచి పెరిగి పెరిగి ఈ స్థాయికి వచ్చింది . ఇదే సమయంలో ‘ఫెడరల్‌ రిజర్వ్‌’ రుణభారం 78 శాతం నుంచి 97 శాతానికి పెరిగింది. అయినప్పటికీ ప్రస్తుత అధ్యక్ష పోటీలో ఉన్న ట్రంప్‌ గానీ, ఉంటారో లేదో తెలియని ఊగిసలాడే డెమోక్రటిక్‌ అభ్యర్థి బైడన్‌ గాని ఈ అంశాన్ని తమ ప్రాధాన్యతా క్రమంలో ఉంచలేదు. ఐఎంఎఫ్‌ అంచనాల ప్రకారం అమెరికా వార్షిక బడ్జెట్‌ లోటు జీడీపీిలో 6.5%. ఇది దగ్గర దగ్గర సంపన్న దేశాల్లో అధికంగా గల జపాన్‌కు సమీపంలో ఉండటం గమనార్హం. అయితే అమెరికా యూరోప్‌ కన్నా వివిధ రీతుల్లో మెరుగుదలలో ఉంది. అవి అధిక ఆర్థిక వృద్ధి, వయో దామాషాల సమతుల్యత, అంతర్జాతీయ ప్రమాణాల రీత్యా అధిక పన్నులు విధించే అవకాశం లాంటివి. ఇవి కాక భౌగోళిక, సాంకేతిక నైపుణ్య, విశ్వ వ్యాప్త మేధో ఆకర్షిత లక్షణాలు లాంటివి ఉన్నాయి. ఇక అధిక విలువగల, నిలువ సామర్థ్యం గల డాలర్ల ఆధిపత్యం ఉండనే ఉంది. అస్థిర ప్రపంచ లావాదేవీలలో పెట్టుబడిదారులు సహజంగానే వీరి బాండ్ల కొనుగోలుకు మొగ్గు చూపే అవకాశం ఎలాగూ ఉంటుంది.
గతంలో రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ప్రభుత్వ రుణ భారం జీడీపీిలో అధికంగానే ఉండేది కానీ అప్పుడు ఆయా ప్రభుత్వాలు అధిక ఆర్థిక వృద్ధి ద్వారా, సైనిక వ్యయం తగ్గించడం ద్వారా దాన్ని అధిగమించ గలిగాయి అప్పటి ప్రభుత్వాలు. కానీ ఇప్పుడు ఎక్కడ ఖర్చు తగ్గించాలో తెలియని దిక్కుతోచని స్థితి. ఈ దేశాల్లో పెరుగుతున్న వయోవృద్ధులు, ఆరోగ్య సంరక్షణపై పెరుగుతున్న వ్యయం, పెన్షన్లు లాంటివి నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. ప్రజా ఆరోగ్య సంరక్షణ రీత్యా అవన్నీ తప్పనిసరి. ప్రభుత్వ వ్యయం తగ్గించడానికి అంచనాలు తగ్గి ప్రభుత్వం పాత్ర ప్రజారోగ్యంలో తగ్గటమే. ఈ అంచనాలు రెండో ప్రపంచ యుద్ధం అనంతరం గణనీయంగా పెరిగాయి.
ఇవన్నీ పెట్టుబడిదారుల రిస్క్‌ని పెంచుతాయి. ముఖ్యంగా ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్ల వ్యవహారంలో వీటిపై వచ్చే ఆదాయంపై సంశయాలు రేకెత్తిస్తాయి. 2022లో బ్రిటన్‌ అప్పటి ప్రధాని ‘లీజ్‌ ట్రస్‌’ టాక్స్‌ తగ్గింపుతో పెరిగిన రుణాల వలన అంతలోనే ఉపసంహరించారు. ఇదేవిధంగా ఇటలీలో 2018లో అధిక వ్యయంతో జారీ చేసిన బాండ్‌లను అంతలోనే ఉపసంహరించారు. అక్కడి ప్రధాని గియోర్గియా మెలోని ఇంతవరకు పెట్టుబడిదారుల వ్యతిరేకతని తప్పించుకోగలిగారు. ఖర్చులను తగ్గించడం ద్వారా, బ్రెష్హిల్స్‌ ఒప్పందాలకు రాజీగా. దీని ద్వారానే ఇటలీ ఫ్రాన్స్‌ లాగా లోటు మార్గదర్శకాలని ఉల్లంఘించినట్లు ప్రకటించింది. కానీ అక్కడ సంక్షేమ సమర్థకులు మెలోడీ స్థానంలోకి వస్తే ఈమె వారికి ప్రాతినిధ్యం వహించక పోవచ్చు. 2023 లో ఒక అధ్యయనం ప్రకారం 51 దేశాలలో ప్రజాధరణ గల అధ్యక్షులు, ప్రధానుల కాలంలో 1900- 2020 మధ్య కనుగొన్నది వారు ఆర్థికంగా ఆశించినదాని కన్నా దిగువ స్థానంలో ఉన్నారని. గమనించింది వారంతా ఆర్థిక
రుణం వ్రణం లాంటిది. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా స్థల- కాలాలకు అతీతంగా. వ్యక్తి, కుటుంబం, సమాజం, ఏ దేశంలోనైనా పరిమాణం మారవచ్చు. పర్యవసాన పరిణామాలు మాత్రం ప్రమాదకరం. ఈ మానని వ్రణం అన్ని స్థాయిల్లో సదా సలుపుతూనే ఉంటుంది. పైన పేర్కొన్నవి అన్నీ ప్రజాస్వామిక దేశాలు. పెట్టుబడి దేశాలే. రెండూ పర్యాయపదాలుగా పరిఢవిల్లుతుంటాయి. జుగల్బందీతో క్షణం క్షణం పెరిగే అనంత అసమానతల జ్వాలకు ఆజ్యం పోస్తూ ఉంటాయి. సమస్త వనరులు కొందరికి, అష్ట కష్టాలు అందరికీ పంచుతుంటాయి. ఇంతకాలం ఈ రుణ భారాలు అన్నీ ఏదో లాటిన్‌ అమెరికా, ఆఫ్రికన్‌, ఆసియాలోని కొన్ని బడుగు దేశాలకే పరిమితంగా భావించేవారు. పై వివరాలు పశ్చిమ సంపన్న దేశాలు సైతం వీటికి అతీతం ఏమీ కాదని రుజువు పరుస్తున్నాయి. అయితే అంకెల వివరాలు ఇచ్చే సంస్థలు, నిపుణులు, మేధావులు ఎవరూ కూడా వాటి వెనుక ఉన్న ‘ఆర్తి’ తాలూకు వాస్తవాలు, వాటి కారణంగా ఆయా దేశాల్లోని బడుగు జీవుల అవస్థలు, దైనందిన జీవితంలో వారు ఎదుర్కొనే సమస్యలు ప్రస్తావన, విశ్లేషణలు ఇవ్వరు, చెప్పరు. ఉండవు. ఇందుకు దాఖలాలు నిత్యం సర్వత్ర కనిపిస్తుంటాయి. వీటన్నిటికీ కారకులు ఎవరెవరు, ఏఏ రూపాల్లో, ఎన్ని ఎన్ని విధాల ఇందుకు శాయశక్తుల తోడ్పడ్డారో తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా? తెచ్చిన రుణాలను సద్వినియోగం చేసినప్పుడే కదా సామాన్యులకు మేలు జరిగేది!. ప్రపంచ మానవాళి శ్రేయస్సు దృష్ట్యా ఇకముందు అయినా వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటిది ఏమైనా జరిగిందా? మరి ఆ విషయాలు ఎందుకు వెలుగులోకి తీసుకురారు? ఆయా దేశాల్లోని ప్రభుత్వ నేతల తప్పిదాలకు అవకతవకలకు అక్కడి ప్రజలు యావత్తు నిష్కారణంగా నిరంతరం మూల్యం చెల్లిస్తూ ఉన్నారు. ఉంటారు. బాధ్యతాయుత ప్రభుత్వాలు ప్రజల కడగండ్లు తగ్గించాలి కానీ అవి పెంచడానికి వారి విధానాలు, చేతలు కారణం కారాదు. ఎంతో నమ్మకంతో మార్పును ఆశించి ఆయా దేశాల్లోని ప్రభుత్వాలను మారుస్తున్నప్పటికీ అక్కడి ప్రజానీకం జీవన స్థితిగతులు నానాటికి దిగజారటం మానవాళి పట్ల ఆయా ప్రభుత్వాల, అక్కడి నేతల నైతికత, విజ్ఞత, మానవీయ విలువల పట్ల విశ్వసనీయతను ప్రశ్నార్థకం గావిస్తున్నాయి. వీటిలో మార్పు కోసం యావత్తు ప్రపంచం ఎంతో ఆశగా నిరీక్షిస్తుంది.
రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, 9247499715

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img