Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

వైజ్ఞానికులకు వైజ్ఞానికుడు బుద్ధుడు

డాక్టర్‌ దేవరాజు మహారాజు

బుద్ధుడు చెప్పిన విషయాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి, ఎన్నో రకాలుగా స్ఫూర్తినిచ్చాయి. బుద్ధుడి స్ఫూర్తితోనే ఎంతోమంది తాత్త్వికులయ్యారు. కవులు, రచయితలయ్యారు. రాజకీయ నాయకుల య్యారు. విప్లవ వీరులయ్యారు. సిద్ధాంత కర్తల య్యారు. మేధావులయ్యారు. వీరు మాత్రమే కాకుండా బుద్ధుడు చెప్పిన ఒక సిద్ధాంతంతో చాలామంది శాస్త్రవేత్తలయ్యారు. పరిశోధకు లయ్యారు. ఆయన చెప్పిన అనేక విషయాలలో ఈ ఒక్క సిద్ధాంతం విశ్వవ్యాప్తంగా ప్రభావం చూపింది. అదేమంటే‘కార్యకారణ సిద్ధాంతం’. ఆ ఒక్క మాటతో ఆయన వైజ్ఞానికులకే వైజ్ఞానికుడయ్యాడు. ఏ కార్యం జరిగినా, దాని వెనక ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని అన్వేషించి, అర్థం చేసుకుంటే గాని దాన్ని నివారించడానికి మార్గాలు వెతుక్కోవచ్చుఅన్నది బుద్ధుడి కార్యకారణ సిద్ధాంతం! ఎక్కడ ఏ ప్రగతీలేని రోజుల్లో మానవ మేధస్సు వికసించని దశలో, బుద్ధుడు సుమారు రెండున్నర వేల ఏళ్ల క్రితం ఆ విషయం చెప్పడం మామూలు విషయం కాదు. ఈరోజు వైజ్ఞానిక ప్రపంచమంతా ఈ సూత్రం చుట్టే తిరుగుతూ ఉండడం మనం గమనించొచ్చు. బుద్ధుడు ఏం చెప్పాడు? ప్రపంచంలో దుఃఖం ఉంది. దానికి కారణముంది. కారణముంది కాబట్టి, నివారణ ఉంది. నివారణ ఉంది కాబట్టి అందుకు మార్గాలున్నాయిఅన్నాడు. దీని మీద ఆధారపడి కారల్‌మార్క్స్‌ మరో సిద్ధాంతం చెప్పాడు. ఆయన ప్రపంచంలోని పేదరికాన్ని, అణచివేతను, అసమానతను గుర్తించాడు. ఆ విషయాన్నే తన సిద్ధాంతంగా చెప్పాడు. ప్రపంచంలో పేదరికం ఉంది. పేదరికం ఉంది కాబట్టి అసమానత, అణచివేత ఉన్నాయి. పేదరికానికి కారణాలు తెలుసుకుంటేనే, ఆ కారణాలకు నివారణలు తెలుసుకోవచ్చు. ఆ నివారణకు దారులూ సమసమాజ స్థాపన క్రాంతివిప్లవంఅని వివరించాడు మార్క్సు! లోతుగా తరచిచూస్తే, మార్క్సిజం, బుద్ధిజం పునాదులపైనే నిర్మాణమైందని అనిపిస్తుంది. నేటి ఆధునిక వైద్య శాస్త్రమైనా ఏం చెబుతుంది? ప్రపంచంలో రోగాలున్నాయి. రోగాలున్నాయి కాబట్టి ఆరోగ్య సమస్యలున్నాయి. అవి ఉండడానికి కారణాలున్నాయి. ఆ కారణాలు బ్యాక్టీరియా, వైరస్‌లే కావచ్చు. వారసత్వ లక్షణాలే కావొచ్చు. మరింకేదైనా కావచ్చు. కారణాలేవైనా అందుకు నివారణలున్నాయి. ఆ నివారణలకు వేర్వేరు దారులున్నాయి. ఆ దారులేమిటీ? చికిత్స, థెరపీ, ఆపరేషన్‌ వగైరా ఏదైనా కావొచ్చు. ఒక్క వైద్య శాస్త్రమే కాదు, ఇతర అన్ని శాస్త్రాలు ఆ ఒక్క ‘కార్యకారణ సిద్ధాంతం’ లోంచి వెలువడ్డవే. ఉదాహరణకు తొలి రోజుల్లో మనిషి చేపను చూశాడు. చేప నీటిలో ఈదడం చూశాడు. అది ఎలా తేలగలుగుతుందో, ఎలా ఈదగలుగుతుందో వాటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం తెలుసుకున్నాడు. కాలక్రమంలో నీటిపై తేలుతూ ప్రయాణించగల పడవకు, ఓడకు, స్టీమర్‌కు రూపకల్పన చేసుకున్నాడు. అలాగే మనిషి పక్షిని గమనించాడు. అది రెక్కలాడిస్తూ, గాలి ఒత్తిడితో పైకి లేవగలగడం అధ్యయనం చేశాడు. దాని వెనక గల కార్యకారణ సంబంధాన్ని అర్థం చేసుకుని విమానాల్ని తయారు చేసుకున్నాడు. గద్ద ఆకాశంలో ఎగురుతూ కింద భూమి మీద గల చిన్న కోడిపిల్లను ఎలా చూడగలుగుతుందో పరిశీలించి, లెన్స్‌ల్ని ఆవిష్కరించు కున్నాడు. దూరపు చూపు, దగ్గరి చూపునకు తగిన కటకాల్ని తయారుచేసుకున్నాడు. ఆవిరి ఎంత బలమైందో జేమ్స్‌వాట్‌ గ్రహించగలిగాడు కాబట్టిఆవిరి యంత్రానికీ, ఇంజన్‌కు, రైలుకు ఆవిష్కరణలు జరిగాయి. ప్రతి కార్యానికీ కారణముంటుందన్న విషయం గ్రహించిన శాస్త్రవేత్తలంతా తమ తమ రంగాలలో పరిశోధనలు కొనసాగించారు. నూతన ఆవిష్కరణలతో విశ్వమానవాళికి మేలు చేస్తూ వచ్చారు. ఈ విషయంలో శాస్త్రవేత్తలంతా బుద్ధుని అనుచరులే! కార్యకారణ సిద్ధాంతం 16 వ శతాబ్దంలో యూరప్‌కు చేరినప్పుడు అక్కడ బేకన్‌, న్యూటన్‌, కెప్లర్‌, గెలీలియో వంటి మహా శాస్త్రవేత్తలంతా తయారయ్యారు. ఈ రకంగా చెప్పాలంటే భారతదేశం ‘విశ్వ గురువు’ ఎప్పుడో అయిపోయింది. కాస్త చదువూ, జ్ఞానం, విజ్ఞత ఉన్నవారికి ఈ విషయం తెలుస్తుంది. అది లేనివారు ఇప్పుడీ దేశాన్ని కొత్తగా ‘విశ్వ గురువు’ గా నిలబెడతామని బయలుదేరుతున్నారు. అది వారి అజ్ఞానాన్ని బయటపెడుతుంది. భారతదేశం ప్రపంచానికి ఏమిచ్చిందీ అంటే బుద్ధుణ్ణి ఇచ్చింది. బుద్ధుడు ప్రపంచానికి ఏమిచ్చాడంటే కార్యకారణ సిద్ధాంతాన్నిచ్చాడు. ఎక్కడ ఏ ఆధారాలూ లేని రోజుల్లో ఏ పరిశీలనలు, ఏ పరిశోధనలూ జరగని రోజుల్లో బుద్ధుడు ఆ సిద్ధాంతాన్ని ఇచ్చాడంటే మాటలా? ఆయనకు జ్ఞానోదయమైందంటే ఇదేప్రపంచానికి ఆయన జ్ఞానాన్నిచ్చాడంటే ఇదే! ఆ ఒక్క సిద్ధాంతం మీదే అన్నీ ఆధారపడి ఉన్నప్పుడు, వైజ్ఞానిక పరిశోధనలన్నీ ఇప్పటికీ ఆ సిద్ధాంతం మీదే ఆధారపడి జరుగుతున్నప్పుడు ఇన్ని శతాబ్దాల తర్వాత మనం ఆయనను ఏ స్థాయిలో నిలుపుకోవాలీ? అందుకే ప్రజలు ఆయనను ‘భగవాన్‌’ అన్నారు. భగవా అని అంటే పరిపూర్ణుడు అని అర్థం! బుద్ధడు చెప్పిన విషయాలేవీ మిగలక పోయినా, ఈ ఏకవాక్య సిద్ధాంతం మిగిలినా, ఆయన బుద్ధుడిగానే మిగిలి ఉండేవాడు. ఎందుకంటే ఈ ఒక్క ఆలోచనే ప్రపంచ గతిని మార్చింది. ఎన్నో వైజ్ఞానిక సిద్ధాంతాలకు ఇది మూలం అయ్యింది. బీజమైంది. మాతృక అయ్యింది. జీవితానికి సంబంధించి బుద్ధుడు ఎన్నో విలువైన విషయాలు చెప్పాడు. అవన్నీ మానవ ప్రవృత్తికి, సమాజగతికి సంబందించినవి. ఈ కార్యకారణ సిద్ధాంతం మాత్రం ప్రగతికి, పురోగతికి, అభ్యున్నతికి, విప్లవానికీ సంబంధించింది. శతాబ్దాలు గడుస్తున్నా ఆ సిద్ధాంతం ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అన్వయించు కునే విధంగా ఉంటూనే ఉంది. తరం తర్వాత తరంలో ఇది మనిషిని ఆధునికుణ్ణి చేస్తూనే ఉంది. అది నిత్య నూతనం! బుద్ధుణ్ణి ఒక సామాజిక కార్యకర్తగా, సంఘ సంస్కర్తగా, తాత్త్వికుడిగా ముఖ్యంగా మార్గదర్శిగా చూడకుండా ఆయనను దేవుళ్లలో కలపడం, ఆయనకు మతాన్ని పులమడం ఆలోచనలేని కొందరు చేసిన పిచ్చిపని. పరిపూర్ణుడు గనకనే శతాబ్దాలకు ముందే ఆనాటి ప్రజలు ఆయనను భగవాన్‌గా పూజించారు. శతాబ్దాల తర్వాత ఈనాడు కూడా ఆధునిక ఆలోచనా పరులు ఆయన మేధోశక్తికి అబ్బురపడి ఆరాధిస్తున్నారు. ఆ స్ఫూర్తిని నిలుపుకుని, వచ్చే తరాలకు అందించాలను కుంటున్నారు. పూజఅంటే అదే. పూలు, కుంకుమ జల్లి, గంటలు మోగించి, అర్థంలేని, అర్థంకాని సంస్కృత శ్లోకాలు అరవడం పూజ కాదు. అది దారి తప్పిన మనువాదుల పైత్యం! వారి దృష్టిలో భగవాన్‌ అంటే అస్థిత్వం లేనివాడు. కేవలం విశ్వాసంలో తిష్టవేసినవాడు మాత్రమే! వీరి దేవుడు మనిషి బుర్రలో పుట్టి, మనిషినే బానిసగా లేదా మూర్ఖుడిగా చేసినవాడు మాత్రమే! పదిహేడవ శతాబ్దంలో బుద్ధుడి కార్యకారణ సిద్ధాంతం అందుబాటు లోకి వచ్చిన తర్వాతనే యూరప్‌లో వైజ్ఞానిక విప్లవం వచ్చింది. అంతకు ముందు అక్కడ ఏదైనా జరిగిందంటే దానికి కారణం ధార్మిక, ఆధ్యాత్మిక, దైవ కారణాల్ని వెతుక్కునేవారు. ఇది అప్పటి వారి రచనల్లో దొరికిన అంశమే. బుద్ధుడు తన బోధనల్ని నాటి ప్రజల భాష అయిన పాలి భాషలో బోధించాడు. అందువల్ల అతడి బోధనలతో పాటు ఆ పాలి భాష ప్రభావం ఇతర దేశాల మీద కూడా పడిరది. ఉదాహరణకు కొన్ని ముఖ్యమైన పదాలు చూద్దాం. ధ్యానాన్ని పాలి భాషలో ‘రaాన్‌’ అంటారు. దాన్ని మన భారతదేశంలో వైదిక మతస్థులు ధ్యానంగా మార్చారు. ఇదే పదం చైనాకు పోయి ‘చాన్‌’ అయ్యింది. అక్కడ ‘చాన్‌’ సంప్రదాయం ఏర్పడిరది. అలాగే పాలి భాషలోని రaాన్‌ పదం జపాన్‌లో జేన్‌ అయ్యింది. అది పాటించే ‘జేన్‌’ సంప్రదాయం అక్కడ వర్థిల్లింది. ఇదే రaాన్‌ కొరియాలో ‘సార్‌ జాన్‌’ అయ్యింది. వియత్నాంలో ‘థియాన్‌’ అయ్యింది. ఇలా వేరు వేరు దేశాల్లో ఆ పదం వేరు వేరుగా వ్యాపించింది. ఇంతెందుకూ? మనం మన ఊళ్ల పేర్లలో సామాన్యంగా ‘పల్లి’ అని ఉండడం చూస్తుంటాం. అది పాలి భాషలోంచి వచ్చిందే. ఇరాండ్‌ పల్లిఅనే ఊరు అశోకుడి శాసనాలలో కూడా కనిపించింది. పల్లి అంటే పాలి భాషలో నగరం అని అర్థం. పర్షియా రాజధాని పర్సిపోలస్‌లో పోలిస్‌ అంటే నగరం అనే అర్థం ఉంది. ఇవన్నీ బుద్ధుడి బోధనలతో పాటు వేర్వేరు భాషల్లోకి ప్రవేశించిన పదాలు. అందుకే మూలాల్లోకి వెళ్లాలి. డాక్టర్‌ రామ్‌ విలాస్‌ శర్మ వృత్తిరీత్యా ఇంగ్లీషు ప్రొఫెసర్‌. భాషా శాస్త్రజ్ఞుడు కూడా. బౌద్ధ మతాభిమాని అయినందువల్ల ఆ విషయాలలో విస్తృతంగా పరిశోధనలు చేశారు. పాలి భాషా పదాలు వివిధ దేశాలకు ఎలా ప్రయాణించాయన్న విషయం ఆయన చాలా వివరంగా రాశారు. థెరపీ/ థియరీ వంటి పదాల గురించి కూడా ఆయన వివరణ ఇచ్చారు. తార్కిక విశ్లేషణలతో లభించేది ‘ధేర్‌’ అని పాలి భాషలో బౌద్ధం చెపుతుంది. ఆస్థా (నమ్మకంవిశ్వాసం) నుంచి వేదాలు వచ్చినట్లుగా తార్కిక దృక్పథంతో ‘ధేర్‌’ వచ్చింది. ధేర అంటే పెద్దవారు. అన్నీ తెలిసిన విజ్ఞుడు అని అర్థం. (థేరవాద: బౌద్ధంలో ముఖ్యమైన శాఖ) వైజ్ఞానిక రంగంలో ఏ సాంకేతిక పదం కనిపించినా దాని మూలం ఇటాలియన్‌, లాటిన్‌, గ్రీకు అని చెపుతుంటారు కదా? చాలా కాలానికి ముందు ఈ ‘ధేర్‌’ అనుయాయులే ఈజిప్టులో ‘ధేరాపుటి’ అని పిలిచేవారు. వీరు చికిత్సకులు. వీరి వల్లనే థెరపి/ థియరీ వంటి పదాలు విశ్వవ్యాప్తమయ్యాయి. వైదిక మతస్థులు సృష్టించుకున్న ముప్పయి మూడుకోట్ల దేవీ దేవతల్లో ఏ ఒక్కరూ సజీవంగా పుట్టి మనిషికి దిశా నిర్దేశం చేసినవారు లేరు. ఇతర మతాలలో కూడా అదే పరిస్థితి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మత గురువులు ఉన్నారే గానీ, అసలు ‘దైవం’ వంటి వారు ఎవరూ లేరు. కనీసం ఏదో ఓ కాలంలో ఉండి అంతరించి పోయారన్న ఆధారాలు కూడా లేవు. ఈ తేడాను గమనించి అర్థం చేసుకోగల స్థోమత గలవారికి మాత్రమే విషయం అర్థమవుతుంది. ఏదో ఒక మత విశ్వాసంలో బలంగా పాతుకుపోయిన వారికి బహుశా ఈ విషయాలు నచ్చకపోవచ్చు. అబద్దాల్లో సుఖాల్ని వెతుక్కునే వారికి నిజాలు ఇబ్బందిగానే ఉంటాయి. సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img