Friday, October 25, 2024
Friday, October 25, 2024

సత్సంగం

చింతపట్ల సుదర్శన్‌

‘‘జీవులను పదనాల్గు లక్షల చావుపుట్టుకలిక్కడా ఎవరు చేసిన పాప కర్మము వారనుభవించే దక్కడా’’ అంటూ పాడసాగింది డాంకీ. ఏమైంది డాంకీ నీకు శ్రోతలెవరూ కోరకుండానే పాట అందు కున్నావుపైగా సినిమా పాట కూడా కానట్టుంది అంది డాగీ. దీన్ని పాట అనరు ‘తత్వము’ అంటారు. మామూలు జీవులకు అర్థం కానిదే తత్వమన్నమాట. అవునా, అలాగుననా సరే ఈ తత్వానికి అర్థమేమిటో నాకు బోధపడలేదు కాని తమరు తెలియచేస్తారా స్వామీజీ. స్వామీజీ అని వెటకారం దేనికి గాని చెప్తా విను. ఈ లోకంలో పదునాలుగు లక్షల జీవులున్నారని వాళ్లు చేసిన పాపాలకు ఫలితం పై లోకంలో అనుభవిస్తారని దీని అర్థం. బానేఉంది. పాపాలకు కేర్‌ ఆఫ్‌్‌ అడ్రసు మనుషులు కదా వాళ్లనిపై లోకంలో కబాబుల్లా కాల్చనీ, వేడి నూనెలో వేయించనీ మనకెందుకు అంది డాగీ. అయితే నీకు తత్వం పూర్తిగా బోధపళ్లేదన్నమాటే. మనుషులే కాదు పద్నాలుగు లక్షల జీవుల్లో నువ్వూ నేనూ కూడా ఉన్నాం మన పాపాలకు కూడా శిక్ష అనుభవించాల్సిదే అంది డాంకీ.
మనామా పాపాలా? ఏం చెయ్యలేదా నువ్వు. మొరిగే కుక్క కరవదని ధీమాగా ఉన్నవాళ్ల పిక్కలు కొరకలేదూ. నీసాటి కుక్క నోట్లోంచి ఎముకు లాక్కున్న సందర్భాల్లేవూ. నికార్సయిన, నిప్పులాంటి మనుషుల్ని చూసి దొంగలని భావించి అరిచి గీ పెట్టలేదా. ఈవీఎమ్‌ మెషీన్లు పగలగొడితేనే చెయ్యిపెట్టి, నోట్లో దుమ్ము కొట్టడమే పాపం అని అనుకోకు. అలాగే సరే అలాగైతే నువ్వు ఎన్నిసార్లు ఎంతమందిని వెనక కాళ్లతో ‘కిక్కించావో’ నీ కర్ణ కఠోర స్వరార్చనలో ఎంతమంది చెవుల ‘డ్రమ్ము’ లు పగలేవో. అసలు నీ తత్వంలో నాకో విషయం మింగుడు పడ్డంలేదు. అన్ని జీవుల పాపాలకు పైన శిక్ష వేస్తారంటూవు సరే మరి, నడివీపున బట్టలుమోసి నువు కట్టుకున్న పుణ్యానికి ఏ ‘రిటర్ను గిఫ్టు’ ఉంటుందా ఉంటే గాడిదల స్వర్గం, కుక్కల స్వర్గం ఇలా ఏ జీవి కా జీవికి వేరువేరుగా నరకమూ వేరు వేరు స్వర్గమూ ఉంటాయా? లేక ఇక్కడ మనుషులకు నానాచాకిరీ చేసి కష్టాలుపడ్డ జీవులంతా వాళ్లతోపాటే స్వర్గనరకాలు అనుభవించాలా? అంది డాగీ. మొన్న ఎన్నికలప్పుడు సభల్లో, రోడ్‌షోలప్పుడు జనంలో నిలబడి ఉపన్యాసాలు విన్న అనుభవం బాగా పండినట్టుందే. నువ్వు మరీ లోతుగా అడిగితే జవాబుచెప్పేంత ‘జీనియస్‌’ గాడిదను కాను నేను. నువ్వడగాల్సిన ప్రశ్నలన్నిటికీ కాషాయ వస్త్రాలు కట్టుకున్న ‘కర్మ’ వస్తాదులు, ఒంటి నిండా నామాలు పెట్టుకున్న భక్త పరమాణువులు, మనుషుల్ని ఉద్ధరించటానికే పుట్టిపెరిగిన భాగవతోత్తములు సమాధానం చెప్పగలరేమో కాని నేను చెప్పలేను.
గాడిదల స్వర్గమంటూ వేరే ఉందో లేదో తెలీదుకాని ఈ గాడిద జన్మ నాకు, ఈ కుక్క జన్మ నీకూ లేకుండా ‘రిపీటు’ కాకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది. అవునా! మరి చెప్పవేం నాకు మళ్లీ జన్మలో మనిషిలాపుట్టి కుక్కలా అరవాలని ఉంది అంది డాగీ. అంటే రాజకీయ నాయకుడిగా పుట్టాలనే కదా. నాకూ మళ్లీ జన్మలో మనిషిలా పుట్టి గాడిదలా ఓండ్ర పెట్టాలని ఉంది అంది డాంకీ. అంటే మనిద్దరి ఆశయమూ ఒక్కటే నన్నమాట. ఇంతకీ మార్గమేదో ఉందన్నావు. ఆ అదే అదే మరో జన్మలో మనం అనుకున్న ‘ప్రొఫెషనల్స్‌’ గా పుట్టాలంటే, మన జన్మ తరించాలంటే ‘డోలేబాబా’ గారి దర్శనం చేసుకోవాలి. ఆయన సత్సంగాల్లో జనాన్ని పావనం చెయ్యడానికి వస్తున్నారని గోడల మీద ‘వాల్‌ పోస్టర్లు’ వేశారు. అది చదివినప్పటినుంచీ భక్తి యోగా మీద ధ్యాస కలిగింది. అందుకే ఆ తత్వం పాడిరది. ఎలాగైనా సరే ఆ బాబాను దూరం నుంచైనా కళ్లారా చూడాలని ఆశపడ్డాను కానీ వేలమంది రావాల్సినచోట లక్షలమంది రావడం మన మనుషులకున్న సుగుణం కదా. అందువల్ల ఆయన రూపాన్ని మదిలో తల్చుకుంటూ పాడుకుంటున్నా. అంత గొప్ప బాబాజీనా… అరెరే మిస్సయిపోయానే అంది డాగీ. మిస్సయిపోయావు గనక బ్రతికి పోయావనుకో అంటూ అరుగు ఎక్కాడు అబ్బాయి. అదేమిటి సోదరా ఆ డోలు బాబానా, డోలే బాబానా, ఆయనకు మహిమలు జాస్తిగా ఉన్నాయటగదా అంది డాగీ. ఆయన కాలిధూళి వేలి కంటితే చాలు, కోటీశ్వరులై పోతారట గదా. ఆయన కారు టైరు క్రింది మట్టివాసన చూస్తే చాలు స్వర్గం ప్రాప్తిస్తుందట కదా అంది డాంకీ. ప్రాప్తించింది ప్రాప్తించింది ఓ వందన్నర మందికి ‘తత్కాల్‌ స్వర్గం’ ప్రాప్తించింది మరి కొందరు ఆసుపత్రుల్లో వెయిటింగ్‌ లిస్టులో ఉన్నారు. పూర్వాశ్రమాల్లో చేయరాని నేరాలన్నీ చేసి, బాబాలుగా అవతారమెత్తిన వారెందరో, దేశం నిండా ఉన్నారు. మనుషులకు స్వర్గలోకపు ‘వీసా’లు మంజూరు చెయ్యడానికి. వీళ్ల ఆశ్రమాలకు, మఠాలకు ఏ బుల్‌డోజరూ తాకనుకూడా తాకలేవు అన్నాడు అబ్బాయి.
అయితే మరో జన్మలో మమ్మల్ని సెలిబ్రిటీల స్థాయి మనుషుల్నిచేసే బాబాలే లేరా, అని నిట్టూర్చింది డాగీ. సత్సంగం ఉద్ధరిస్తుందన్న ఆశలో మనుషులు ప్రాణాలు పోగొట్టుకుంటుంటే గాడిద నెవరడుగుతారు అంటూ మరో తత్వం అందుకుంది డాంకీ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img