Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

ఉద్యమ కెరటం మండేలా

జనక మోహనరావు దుంగ

జాతి వివక్షపై పోరాడిన యోధుడు మండేలా‘‘ప్రతి ఒక్కరూ తమ పరిస్థితులను అధిగమించి, వారుచేసే పనుల పట్ల అంకితభావంతో, మక్కువతో ఉంటే విజయం సాధించగలరు’’…. నెల్సన్‌ మండేలా.
వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్‌ మండేలా జయంతి సందర్భంగా నెల్సన్‌ మండేలా అంతర్జాతీయ దినోత్సవం 2010 సం. నుండి ప్రతి ఏటా జూలై 18న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 2019 నుండి 2028 వరకు ఉన్న కాలాన్ని నెల్సన్‌ మండేలా శాంతి దశాబ్దంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు, ప్రభుత్వం నెల్సన్‌ మండేలా చేసిన సమాజసేవకు గుర్తుగా ఆయన విలువలను గౌరవించే రోజు. స్వయంసేవకంగా సమాజసేవ ద్వారా ఆయన విలువలను గౌరవించే రోజు. ప్రపంచ పౌరులందరూ నెల్సన్‌ మండేలాను ఆదర్శంగా తీసుకుని మనం జీవిస్తున్న ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి, మార్చడానికి మనలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రతినబూనాలి.
20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఈయన ఒకరు. నల్లజాతి సూరీడని ప్రసిధ్ధి పొందారు. జాతి వివక్షతకు వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు, వర్ణ సమానతకు నెల్సన్‌ మండేలా ఒక సంకేతం. నెల్సన్‌ మండేలా ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు. సమానత్వంకోసం, న్యాయంకోసం దక్షిణాఫ్రికాలో శాంతిని స్థాపించిన పితామహుడు. నెల్సన్‌ మండేలా ఎప్పటికి ఈ భూమిపై జీవించిన అత్యంత స్ఫూర్తినిచ్చే వ్యక్తులలో ఒకరు. అతను ప్రపంచవ్యాప్తంగా వర్ణవివక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు నాయకత్వం వహించాడు. దక్షిణాఫ్రికా ప్రభుత్వ మొదటి అధ్యక్షుడిగా (1994-1999) పనిచేశాడు. అతను దక్షిణాఫ్రికాకు మొదటి నల్లజాతి అధ్యక్షుడు. దక్షిణాఫ్రికాకు పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యారు. అతను 1991 నుండి 1997 వరకు ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. నెల్సన్‌ మండేలా 1918 జూలై 18న దక్షిణాఫ్రికా యూనియన్‌లోని మెజోలోని థెంబు రాజ కుటుంబంలో జన్మించారు. అతను వృత్తిరీత్యా న్యాయవాది. దక్షిణాఫ్రికా మొట్టమొదటి నల్లజాతి న్యాయవాదులలో ఒకరిగా జోహన్నెస్‌బర్గ్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశాడు. యూనివర్శిటీ ఆఫ్‌ ఫోర్ట్‌ (ఈస్టర్న్‌ కేప్‌) హేర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ విట్వాటర్‌రాండ్‌ (జోహన్నెస్‌బర్గ్‌)లో తన న్యాయ విద్యను పూర్తి చేశాడు.1943లో ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లో చేరారు. 1944లో దాని యూత్‌ లీగ్‌ను స్థాపించారు. తద్వారా వలసవాద వ్యతిరేక కార్యకర్త అయ్యారు. నేషనలిస్ట్‌ పార్టీ తెల్లజాతి మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి వర్ణవివక్ష పాలనను ప్రవేశపెట్టింది. మండేలా ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నేషనలిస్ట్‌ పార్టీ పాలనను పడగొట్టడానికి జాతి వివక్ష, వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిజ్ఞ చేశారు. విజయం సాధించాలంటే సాయుధ పోరాటం అనివార్యమని విశ్వసించారు. అల్జీరియా, క్యూబాలో అనుసరించిన గెరిల్లా పోరాటం నుండి ప్రేరణ పొందిన మండేలా సైనిక ఉద్యమానికి నాయకత్వం వహించారు. వర్ణవివక్షకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఆయన పదేపదే అరెస్టులను ఎదుర్కొన్నాడు. చివరకు 1962లో రివోనియా విచారణలో అయన జీవిత ఖైదుకు దారితీసింది. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర పన్నాడని ఆరోపించి దోషిగా నిర్ధారించారు. 1964 నుండి 1982 వరకు 27 సంవత్సరాల జైలు జీవితం గడిపారు. ఆయన ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ ఖైదీ అయ్యాడు. ప్రపంచంమొత్తం అతని చుట్టూ చేరడం ప్రారంభించింది. నిరంతర ప్రపంచ ఒత్తిడికి లొంగి ప్రెసిడెంట్‌ క్లర్క్‌ 1990లో ఆయనను విడుదల చేశాడు. నెల్సన్‌ మండేలా ప్రెసిడెంట్‌ క్లర్క్‌ 1990లో వర్ణవివక్ష పాలనకు ముగింపు పలికారు. ఆ తర్వాత బహుళ జాతి ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగాయి. మండేలా ఈ ఎన్నికలలో ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించారు. 1994లో దక్షిణాఫ్రికాకు మొదటి నల్లజాతి అధ్యక్షుడయ్యారు. అధ్యక్షుడిగా ఆయన పదవీకాలంలో జాతి వివక్షను తొలగించి అన్ని జాతులను ఒకే సామాజిక స్రవంతిలోకి తీసుకురావడానికి కృషి చేశారు. మండేలా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తరువాత ప్రపంచ స్థాయి ఉన్నత స్థాయిని పొందారు. 1998 -1999 మధ్యకాలంలో అలీనోద్యమానికి 19వ సెక్రటరీ జనరల్‌గా పనిచేశారు. రాజనీతిజ్ఞుడిగా నెల్సన్‌ మండేలా ఫౌండేషన్‌ ద్వారా పేదరికం, ఎయిడ్స్‌ వంటి సామాజిక సమస్యలకోసం పోరాడేందుకు అధ్యక్షానంతర జీవితాన్ని అంకితం చేశాడు. వర్ణవివక్ష-వ్యతిరేక విప్లవకారుడిగా ప్రసిద్ధి. స్త్రీలు, పురుషులు, పిల్లలందరికీ సమానత్వం, స్వేచ్ఛను స్థాపించడంకోసం పోరాడారు. లింగ, జాతీయత, జాతితో సంబంధం లేకుండా మానవులందరి ప్రాథమిక హక్కులకోసం నిలబడ్డాడు. మండేలా 27 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించినప్పటికీ ఈ ఆదర్శాలను విశ్వసించారు. విడుదలైన తర్వాత వాటిని ఆచరణలో పెట్టడం కొనసాగించాడు. అల్లకల్లోలమైన సమయాల్లో, నెల్సన్‌ మండేలా అణచివేతను ఎదిరించే శక్తిని, అసమానతపై న్యాయాన్ని, అవమానంపై గౌరవాన్ని, ద్వేషంపై క్షమాపణను చూపారు. వర్ణవివక్ష పాలనను శాంతియుతంగా రద్దు చేయడం కోసం కొత్త ప్రజాస్వామ్య దక్షిణాఫ్రికాకు పునాదులు వేసినందుకు మండేలా, క్లెర్క్‌లకు 1993లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. యూరోపియన్‌ పార్లమెంట్‌ ద్వారా ఆలోచనా స్వేచ్ఛకు 1988లో సఖారోవ్‌ బహుమతి, 1990లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న, 1990లో ‘‘కామ్రేడ్స్‌ మధ్య శాంతిని బలోపేతంచేసిన వారికి అప్పటి సోవియట్‌ యూనియన్‌ అందించిన లెనిన్‌ శాంతి బహుమతి, 1992లో నిషాన్‌-ఎ-పాకిస్తాన్‌, ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ (1992) అందించే అత్యున్నత పౌర పురస్కారం, 2002లో అమెరికా అందించే అత్యున్నత పౌర పురస్కారం ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఫ్రీడం అవార్డులును పొందారు.మానవులందరూ స్వేచ్ఛగా, గౌరవంతో హక్కులలో సమానంగా జన్మించారు. సమానత్వం వివక్షతలేని హక్కులు మానవ హక్కుల చట్టానికి మూలస్తంభాలు. జాత్యహంకారం, అసహనం అన్ని సమాజాలలో ప్రబలంగా ఉన్న సమస్యలు. సమాజంలో వివక్షా పూరిత పద్ధతులు విస్తృతంగా ఉన్నాయి. వీటిని ఎదుర్కోవడానికి సహనం, చేరిక, ఏకత్వం, భిన్నత్వం పట్ల గౌరవాన్ని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మనందరం మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి. ‘‘నేను నివసించే పరిసరాలను మెరుగుపరచడానికి నేను ఏమి చేసాను? నేను చెత్తను వేస్తానా లేదా నా పరిసరాలను రక్షించుకుంటానా? నేను దొంగిలించబడిన వస్తువులను కొనుగోలు చేస్తున్నానా లేదా నేరాలను తగ్గించడంలో సహాయపడతానా’’ నెల్సన్‌ మండేలా, మహాత్మా గాంధీ వంటి ప్రపంచ ప్రముఖులు ప్రజా ఉద్యమశక్తిని మనలో నింపారు. మన చుట్టూ ఉన్న సమాజానికి మనం ఎంత చిన్న స్థాయిలోనైనా సహకరించేలా మండేలా మనందరికీ స్ఫూర్తినిస్తున్నారు.
సెల్‌: 247045230

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img