Friday, October 25, 2024
Friday, October 25, 2024

డిఎస్‌సి వాయిదా?

డి. రమేష్‌ పట్నాయక్‌

ఆంధ్రప్రదేశ్‌ ఎన్‌డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే డి.ఎస్‌.సి ఫైలుపై సంతకం చేశారు. మంత్రివర్గం ఆమోదించింది. అయితే 16,347 పోస్టులను మాత్రమే ప్రకటించినప్పుడు దానిని మెగా డి.ఎస్‌.సి అనలేం. ఇప్పుడు దానిని వాయిదా వేయడానికి ప్రయత్నాలు జరగడం ఆందోళనకరం. గత సంవత్సరం పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖామంత్రి ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వరంగంలో అన్ని యాజమాన్యాల కింద ఉన్న పాఠశాలల్లో మొత్తంగా 50,677 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఉపాధ్యాయుల పదవీ విరమణ వయోపరిమితి పెంచినందుకు ఈ మధ్య కాలంలో పెద్దగా పదవీ విరమణలు జరగలేదు. ఇక దానిని కూడా వాయిదా వేయడం పంచపాండవుల కథ అయింది. తగినంతమంది ఉపాధ్యాయులు లేకుండా ప్రమాణాలు గల విద్య ఎలా సాధ్యమవుతుంది? తెలుగు రాష్ట్రాల్లో విచిత్రంగా ఉపాధ్యాయ నియామకాలు, లక్షలాది బాలబాలికలకు ప్రమాణాలుగల విద్య అందించే విషయంలో తీవ్ర నష్టం జరుగుతోంది.
పాఠశాల విద్యకు సంబంధించి 2022 జూన్‌లో ఇచ్చిన 117 జి.ఓ మరొక సమస్య. దానిని రద్దు చేస్తామని విద్యామంత్రి లోకేష్‌ ఎన్నికల ప్రచార సభల్ల్లో హామీ ఇచ్చాడు. విద్య అందుబాటు మొదటి సమస్యగా ముందుకు వస్తుంది. ఎ) అందుబాటులో పాఠశాల ఉండాలి, బి) పాఠశాలలో వసతులుండాలి సి) పాఠశాలకు వెళ్ళడానికి విద్యార్థికి విద్యార్థి కిట్‌, మధ్యాహ్న భోజనం, అవసరమైతే వసతి కల్పించాలి డి) తగినంతమంది ఉపాధ్యాయులుండాలి. పైన సూచించిన చర్యలు చేపడితేనే విద్య అందుబాటులో ఉన్నట్లు. జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పాఠశాలలకు వసతుల, విద్యార్ధులకు కిట్లు ఇవ్వడంలో, పౌష్టికాహార విషయంలో కృషి చేసింది. ఉపాధ్యాయులను నియమించకుండా ప్రమాణాలు గల విద్య ఎలాసాధ్యం అవుతుంది? అందుకే గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రమాణాలుగల విద్యసాధ్యం కాలేదు. గత ప్రభుత్వం 2022 జూన్‌లో జి.ఓ 117 తీసుకువచ్చి ప్రాథమిక పాఠశాలలను ముక్కలు చేయడం, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులను తగ్గించడం, అత్యధిక ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాధ్యాయ పోస్టు, పి.ఇ.టి పోస్టు రద్దు చేయడంపై పాఠశాల విద్యా ప్రమాణాలు మరింతగా పడిపోయాయి. లోకేష్‌ ప్రభుత్వరంగ పాఠశాలలపైన, ఉన్నత విద్యా సంస్థలపైన ఎంత శ్రద్ధపెడతారో చూడాలి.
తెలుగుదేశం తన గత ప్రభుత్వంలో తెచ్చిన జి.ఓ 29 (మే 2017), దాని సవరణ జి.ఓ 42 (జూన్‌ 2017) లను ఎందుకు విద్యావేత్తలు ఆహ్వానించారో, విద్యారంగ సంఘాలు ఆహ్వానించాయో, వై.ఎస్‌.ఆర్‌.సి.పి ప్రభుత్వంలో వచ్చిన జి.ఓలు 84, 85 (డిసెంబర్‌ 2021), జి.ఒ 117 (జూన్‌ 22)లపై విద్యావేత్తలనుంచి జన సామాన్యం వరకు ఎందుకు వ్యతిరేకత వచ్చిందో మంత్రి లోకేష్‌ స్వయంగా తెలుసుకోకుండా అధికారులపైన ఆధారపడి అదే ఒరవడిలో పాఠశాల విద్యను కొనసాగిస్తే ప్రభుత్వ పాఠశాల విద్య విధó్యంసం కావటానికి ఐదు సంవత్సరాలు కూడా అవసరంలేదు. అయితే విద్యాశాఖ కార్యదర్శిని మార్చడం శుభసూచకమే. టి.డి.పి ప్రభుత్వం 2017లో వై.ఎస్‌.ఆర్‌ సి.పి ప్రభుత్వం 2021/22లో తీసుకు వచ్చిన జిఓలను పూర్తిగా తులనాత్మక పరిశీలన చేయాలి. పరిశీలించాలి. కాని కొన్ని మౌలిక విషయాలను పైపైన చూడవచ్చు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన జి.ఓలు పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశ పెట్టాయి. అయితే పూర్వ ప్రాథమిక విద్య (-2) ఆచరణలో వైఫల్యం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అలాగే కొన్ని ఉన్నత పాఠశాలల్లో G2 కూడా ప్రవేశ పెట్టారు. ఆ కోర్సులు కూడా పూర్తిగా విఫలమయ్యాయి. రెండూ మంచి చర్యలే. అవసరమైన వసతులు, ఉపాధ్యాయులు లేకుండా ఈ కోర్సులు ప్రవేశపెట్టి ప్రచారానికి పరిమితం చేశారు. అవి పూర్తిగా వేరే విషయాలు. తరగతి 1 నుండి 10 వరకు విద్యను అందించే ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలల గురించి క్లుప్తంగా ఇక్కడ పరిశీలించవచ్చు.
జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 84, 85, 117 జి.ఓలు ప్రాథమిక పాఠశాలను రెండు ముక్కలు చేశాయి. 3, 4, 5 తరగతులను సొంత వాడల్లో, ఉప గ్రామాల్లో, గ్రామాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలనుండి తొలగించి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశాయి. దీనితో ప్రాథమిక పాఠశాలలు విధ్వంసం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఐదువేల గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు, వందలాది గ్రామాల్లో ప్రజలు రోడ్డు మీదకు వచ్చారు. కాని ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రజల అవసరాలు వారికంటే మాకే బాగా తెలుసన్నట్లు విద్యాశాఖ కార్యదర్శి, మంత్రి మాట్లాడారు. ఇక రెండవవైపు చూస్తే ఉన్నత పాఠశాలల్లో చిన్న బాలలు చేరడం వల్ల, స్థలం, ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల అవి గందరగోళానికి గురయ్యాయి. 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో చేర్చి 3వ తరగతి నుంచే సబ్జక్టు వారీ విద్య అని ప్రచారం చేసుకున్న గత ప్రభుత్వం 8వ తరగతి వరకు బోధించే అత్యధిక ప్రాథమికోన్నత పాఠశాలలకు సబ్జక్టు టీచర్లు లేకుండా ఎస్‌.జి.టి లను మాత్రమే కేటాయించింది. వందలాది ఉన్నత పాఠశాలలకు పి.ఇ.టిÑ హెచ్‌.ఎం పోస్టులను రద్దు చేసింది. ఉన్నత పాఠశాలల్లో తరగతి గదిలో విద్యార్ధుల గరిష్ట పరిమితిని, ఒక వారంలో ఉపాధ్యాయుల బోధనా పీరియడ్ల పరిమితిని అహేతుకంగా పెంచివేసింది. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు కలపాలనే పొరపాటు నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయం అమలు చేయడానికి అనేకమైన విధ్వంసాలు సృష్టించింది. ఇంగ్లీషుకు సమాంతరంగా ఉన్న తెలుగు, ఉర్దూ, ఇతర మాధ్యమాలను ఆచరణలో రద్దు చేసింది. ఇదంతా టీచర్‌ పోస్టులను మిగుల్చుకోవడం అనే లక్ష్యం చుట్టూ తిరిగింది. అందుకే 51 వేల పోస్టులు ఖాళీగా ఉంటే సంవత్సరాల తరబడి నాన్చి చివరికి ఆరు వేల పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇప్పుడు ఉద్యమ సంఘాల వేదిక ఫ్యాప్టోయే కాక తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం కూడా ఈ 84, 85, 117 జి.ఒలను రద్దు చేయాలని కొత్త విద్యాశాఖా మంత్రిని కోరుతున్నాయి. ‘జాతీయ విద్యా విధానం 2020’ 3,4,5 తరగతులను ఒక కరిక్యులర్‌ యూనిట్‌గా వ్యవహరించమని చెప్పిందే కాని వాటిని ప్రాథమిక పాఠశాలల నుండి విడగొట్టి ఉన్నత పాఠశాలల్లో పెట్టమని చెప్పలేదు (జాతీయ విద్యా విధానం 4.3). కాని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానం అమలు చేయడంలో భాగంగా తాము జి.ఓ 117 తీసుకు వచ్చామని చెప్పడం హాస్యాస్పదం. ఇంకా, ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 2011లో విద్యాహక్కు చట్టం అమలు విషయమై ఇచ్చిన నిబంధనల జి.ఓ 20/ మార్చి 2011ని కూడా వై.ఎస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం తుంగలో తొక్కింది.
2017లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రసన్న కుమార్‌ (రి ఐ.ఎ.ఎస్‌) ఛైర్మన్‌గా ప్రభుత్వ అధికారులతో పాటు ఉపాధ్యాయ సంఘాల నాయకులతోనూ, ఉపాధ్యాయ ఎమ్‌.ఎల్‌.సి. లతో ఒక కమిటీవేసి ఆ నివేదికను పాక్షికంగా అమలు చేసింది. ఆ క్రమంలోనే జి.ఓ 29 (మే 2017) వచ్చింది. బడుల మూసివేత మీద వ్యతిరేకత వస్తే జి.ఓ 29కు సవరణగా జి.ఓ 42 వచ్చింది. ఆ ప్రభుత్వ ఆదేశాలు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యలకు మంచి స్టాఫ్‌ పాటర్న్‌ ఇచ్చాయి. అయితే ప్రాథమిక పాఠశాలలకు పెద్దగా ప్రయోజనం చేకూర్చలేదు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కేటాయింపు విషయమై విద్యాహక్కు చట్టం పరిమితులకు మించి ఒక్క పోస్టు కూడా ఇవ్వడానికి ముందుకు రాకపోవడం వల్ల ప్రాథమిక విద్య దుస్థితి ఆనాటి నుంచి ఈ నాటి వరకు అలాగే కొనసాగింది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అప్పటి సమస్య పాఠశాలలకు తగిన వసతులు లేకపోవడం. స్టూడెంట్‌ కిట్స్‌ లేకపోవడం. సైకిళ్ళు అమ్మాయిలకు మాత్రమే పరిమితం చేయడం. ఇక జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాగానే ప్రజావేదికను కూల్చినట్లు తెలుగు దేశం గత ప్రభుత్వం బడులకు సుమారు 15వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన వసతులను కూల్చదని, స్టూడెంట్‌ కిట్లను రద్దుచేయదని, మధ్యాహ్న భోజన పథకం మెనూను తగ్గించదని నమ్ముదాం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అమ్మాయిలతో పాటు, అబ్బాయిలకు ఇతరులకు కూడా సైకిళ్ళు ఇవ్వడం చాలా అవసరం. పాఠశాల విద్యలో ఏ సంస్కరణ అయినా 2017నాటి 84, 85, 117 జి.ఓల రద్దుతో, 20/2011Ñ 29,42/2017 జి.ఓల పునరుద్ధరణలతో ప్రారంభం కావాలి. ముందు వెనుకలుగానైనా నిజంగా మెగా డి.ఎస్‌.సి వేసి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలి.
ఆంధ్రప్రదేశ్‌ విద్యా పరిరక్షణ కమిటి కన్వీనర్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img