Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

దేశాభివృద్ధికి మహాత్ముని ఆశయాలే శరణ్యం

సాకే శంకరాంజినేయులు
దేశ అభివృద్ధికి మహాత్మాగాంధీ ఆశయాలే శరణ్యం. మహాత్మా గాంధీ అంటే కరెన్సీ నోట్లు మీద కనిపించే బొమ్మ కాదు. మహాత్మా గాంధీ అంటే నడి రోడ్డు మీద కనిపించే విగ్రహం కాదు.మహాత్మా గాంధీ అంటే ప్రపంచ దేశాలకు ఆదర్శనీయులు. ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న ఒక శక్తి. ప్రపంచ దేశాలకు శాంతియుత జీవనం చూపిన మహోన్నత వ్యక్తి. ప్రతి భారతీయుని గుండెల్లో చిర స్థాయిగా నిలచిన ధీశాలి. ఆయన నమ్మిన సిద్ధాంతాలు, అహింస, సత్యాగ్రహాలకు మరణం లేదు, భావితరాలకు మార్గనిర్దేశం చేసిన మహానేత. అలాంటి మహనీయుడు కేవలం జయంతి, వర్థంతి, స్వతంత్ర దినోత్సవం రోజున మాత్రమే అందరికీ గుర్తుకు వస్తున్నారు. వారి ఆలోచనలు, సిద్ధాంతాలు గాలికి వదిలేసి జయంతి, వర్థంతి సభలకు పరిమితం కావడం శోచనీయం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆయన అడుగుజాడల్లో పయనిస్తున్నారు. మహాత్మా గాంధీ అంటే ఒక సత్యం, ఒక జీవనం, ఒక నైతిక సిద్ధాంతం. నేడు భారతదేశంలో గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలకు తిలోదకాలిస్తూ సత్యాన్ని విడనాడి అసత్యాలతో కపట నాటకాలతో నయవంచనతో నడుస్తున్నారు. గాంధీజీ వారసులమని చెప్పుకునే నాయకులకు, వారు అనుసరించే విధానాలకు చాలా తేడా కనిపిస్తోంది. ఆయన వారసత్వ సిద్ధాంతాలను వదిలి స్వార్థ ప్రయోజనాల కోసం పరిపాలన సాగిస్తున్నారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యం పేదల ఆర్థిక అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన నేటికీ సాధ్యం కాలేదు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశం అభివృద్ధి చెందుతోంది అని పాలకులు చెబుతున్నారు. సాంకేతికంగానూ అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపిస్తున్నాం అని చెప్పుకుంటున్నాం కానీ ప్రజలకు అవసరమైన అభివృద్ధి మాత్రం జరగడం లేదు. అభివృద్ధి పేరుతో పారిశ్రామికవేత్తలు కోట్లకు పడగలెత్తుతున్నారు కానీ పేదలకు ఒరిగేదేమీ కనిపించడం లేదు. దేశంలో ఎక్కడ చూసినా పేదరికం రాజ్యమేలుతోంది. మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు అనేకం. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఎక్కడా కనిపించడం లేదు. నేటికీ ఎన్నో గ్రామాలు విద్యుత్‌ కాంతులకు నోచుకోలేదు, రహదారులు లేవు, వైద్య సదుపాయాలు లేవు విద్యా సదుపాయాలు లేవు. గిరిజన గ్రామాల్లో అనారోగ్యానికి గురైతే మనుషులే వాహనాలుగా రోగులను సుదూర ప్రాంతాలకు మోసుకువెళ్లి చికిత్స చేయిస్తున్న సంఘటనలు కళ్ళముందే అనేకం కనిపిస్తున్నాయి. పేదలకు ఉచితంగా అందాల్సిన విద్య, వైద్యం అన్నీ వ్యాపారంగా మారిపోయాయి. పాలకులు అనుసరిస్తున్న విధానాల వలన పేదల జీవనం దయనీయంగా మారిపోయింది. పాలకులు అభివృద్ధిని వదిలి ఉచిత పథకాల పేరుతో ప్రజలను వంచిస్తున్నారు తప్ప అభివృద్ధి వైపు అడుగులు వేయడం లేదు.
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నేటికీ కనుచూపు మేరలో కనిపించలేదు. పల్లెలు కనుమరుగై పట్టణాలకు వలస వెళ్తున్నారు. వ్యవసాయ రంగ దేశమైన మనదేశంలో ఈ రంగం నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఏలికలు రైతు గోడును పట్టించుకోవడమే లేదు. వ్యవసాయం భారంగా మారి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా వారిని ఆదుకోకుండా వంచించే చట్టాలు చేసి వ్యవసాయ రంగాన్ని మరింత కుంగదీస్తున్నారు. విదేశీ పెట్టుబడి దారీ విధానంతో కార్మికులు, బడుగు, బలహీనర్గాలు, శ్రమ దోపిడీకి గురి అవుతున్నారు. మహాత్మా గాంధీ వ్యతిరేకించిన విదేశీ పెట్టుబడి దారీ విధానమే ఇప్పుడు భారతీయులను శాసిస్తోంది. ప్రపంచ బ్యాంక్‌ నిబంధనలతో కార్మిక రంగం చిన్నబోయింది. కొనుగోలు శక్తి క్షీణించింది. కార్మిక చట్టాలు సవరిస్తూ కార్మిక శ్రమను చౌకగా పారిశ్రామిక వేత్తలకు దోచి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగమే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారు. ధరలు పెంచి పన్నుల రూపంలో వెనక్కి తీసుకుంటున్నారు. మరోవైపు అవినీతి భారతదేశాన్ని పట్టి పీడిస్తోంది. దేశంలో గాంధీ సిద్ధాంతాలను వల్లించేవారు ఎక్కువ ఆచరణలో పెట్టేవారు తక్కువ. స్వాతంతానికి పూర్వం భారతీయులంతా ఒక్క మాట మీద ఉండి ఆంగ్లేయులను తరిమికొట్టారు. నేడు అందుకు భిన్నమైన పరిస్థితి కనపిస్తోంది. ప్రస్తుత పాలకుల కుతంత్రాల కారణంగా కులం, మతం, ప్రాంతీయ విభజనలతో ఒకరినొకరు శత్రువులుగా చూస్తున్నారు. ఈ కారణంగా పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలనూ అడ్డుకోలేని దుస్థితి. ప్రజలు ఏకమై సమస్యలపై పోరు బాట పట్టకపోతే మరింత ప్రమాదంలో కూరుకుపోతాం. రైతే రాజు అనే మాటకు విలువ ఇచ్చి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చెయ్యాలి, వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా చేసిన చట్టాలు రద్దు చేయాలి.
వ్యాస రచయిత సెల్‌ 8985337646.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img