Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

నాటో విస్తరణ ` క్షిపణుల మోహరింపు

బుడ్డిగ జమిందార్‌

నాటో మిలిటరీ కూటమి ఏర్పడి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా 32 సభ్యదేశాలు జులై 9 నుండి 11వరకు వాషింగ్టన్‌లో శిఖరాగ్ర సమావేశాన్ని జరుపుకున్నాయి. ఈ సందర్భంగా యుద్ధ ప్రేరేపణ దిశగా రష్యాకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ సంవత్సరం ఉక్రెయిన్‌కు 4000కోట్ల డాలర్లను ఆయుధరూపంలో పంపాలని నిర్ణయించాయి. ఉక్రెయిన్‌లో ఒక నాటో కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా జర్మనీలో ఒక కమాండును ఏర్పాటు చేయనున్నారు. 2026 సంవత్సరం నాటికి అమెరికా నుండి దీర్ఘశ్రేణి సామర్థ్యంకల్గిన టొమాహల్క్‌ క్రూయిజ్‌ క్షిపణులను రష్యా దేశంలోని వివిధ నగరాలకు ఎక్కుబెట్టే విధంగా జర్మనీలో స్థాపించటానికి ప్రధాన ఉద్దేశంగా నాటో శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. ఈ క్షిపణులు రెండువేల కిలో మీటర్లు దూరంగా ఉన్న రష్యా నగరాలపై నిమిషాల వ్యవధిలో దాడి చేయగలవు. బెర్లిన్‌మాస్కోల మధ్య దూరం 1600కిలో మీటర్లు మాత్రమే. వీరు జర్మనీలో దీర్ఘశ్రేణి హైపర్‌సోనిక్‌్‌ క్షిపణులను కూడా నాటో జర్మనీ కమాండ్‌ ద్వారా స్థాపిస్తారు. ఈ హైపర్‌సోనిక్‌ క్షిపణులు భూ వాతావరణానికి పై అంచున గంటకు 3,800 మైళ్లకు పైగా ప్రయాణించగలవు. ఈ క్షిపణులు ఎగిరేసమయాన క్షిపణుల రక్షణవ్యవస్థ పరిధికి మించి ఉంటాయి. మాస్కో, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లపైనే గాకుండా రష్యాలోని అన్ని పెద్ద నగరాలతోపాటుగా యూరో ఆసియా దేశాలపై కూడా గురిపెట్టగలవు. జర్మనీ ఛాన్సలర్‌ షోల్జ్‌ దీన్ని మాత్రం జర్మనీ రక్షణ వ్యవస్థను పటిష్టపర్చుకోటానికేనని సమర్థించుకున్నాడు. 2023 సంవత్సరంలో యూరప్‌, కెనడా, అమెరికాలోని నాటో దేశాలు 8శాతం రక్షణవ్యయం పెంచాయి. 2024నాటికి ఈ వ్యయం 18శాతం పెరుగుతుందని అంచనా. రానున్న 5సంవత్సరాలలో నాటో మిత్రదేశాలు 650 ఐదవతరం(జనరేషన్‌) ఎఫ్‌35 యుద్ధ విమానాలను, 1000కిపైగా వాయు రక్షణ వ్యవస్థలను, దాదాపు 50యుద్ధ నౌకలతోపాటు జలాంతర్గాములను, 1200 యుద్ధ ట్యాంకులు, 11,300 యుద్ధవాహనాలతోపాటుగా దాదాపు 2వేల ఫిరంగి వ్యవస్థలను అదనంగా సమకూర్చుకుంటాయి. వీటన్నింటికి అవసరమయ్యే వేల కోట్ల డాలర్ల వ్యయాన్ని సామాన్యులపై పన్నులరూపంలో భారం మోపనున్నారు. తద్వార యుద్ధరంగ పరిశ్రమలు వందలాదికోట్ల డాలర్లను తమ లాభాల ఖజానాలో జమ వేసుకోవాలి. ఇప్పటికే నాటో దేశాలు రష్యాపై వైమానికదాడి చేయడానికి ఈ వేసవిలో 100వరకూ ఎఫ్‌16 యుద్ధ విమానాల్ని పంపించుటకు సన్నాహాలు చేస్తున్నాయి. లోగడ అబ్రహాం, లియోపార్ట్‌ యుద్ధ ట్యాంకర్లతో రష్యాపై దాడిచేసి రష్యాను ఓడిస్తామని ప్రగల్బాలు పలకగా రణక్షేత్రంలో తుప్పు డబ్బాలుగా రష్యా వాటన్నిటినీ మార్చి నాటో, ఉక్రెయిన్‌లకు ఘోరపరాభవాన్ని చవిచూపింది. రష్యాకు వ్యతిరేకంగా నాటో ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థవంతంగా తిప్పికొడతామని, మాస్కో నిశితంగా పరిస్థితులను విశ్లేషించి నాటోకు తగిన గుణపాఠం చెబుతామని రష్యా విదేశాంగ డిప్యూటీ మంత్రి సెర్గీ ర్యాబ్కోన్‌ అన్నారు. రష్యా నుండి ముప్పు వాటిల్లుతుందని తరచూ ప్రచారంచేసే నాటో దేశాలు తమ బలాబలాలు గురించి ప్రజలకు చెప్పాలన్నారు. రష్యా సైనికులు 13లక్షలు ఉండగా, నాటో దేశాల బలం 33లక్షల సైనికులతో 90కోట్ల నాటో ప్రజల జనాభా ఎక్కడ, 14.4కోట్ల రష్యా జనాభా ఎక్కడ అని ప్రపంచ సోషలిస్టు వెబ్‌సైట్‌ రాసింది. రష్యా సరిహద్దు చుట్టూ నాటో దేశాల ట్రూపులు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు మోహరించి ఉన్నాయిగానీ, రష్యా మిలిటరీ నాటో దేశాల సరిహద్దులకు వెళ్లలేదని అనేక సందర్భాలలో పుతిన్‌ హెచ్చరించారు. మరొకవైపు ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో చైనాఉత్తరకొరియా రష్యాలకు వ్యతిరేకంగా నాటో కూటమిని విస్తరించే యోచనలో అమెరికా ఉంది. అందుకోసం, దక్షిణకొరియా, జపాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఫిలిప్పైన్స్‌, వియత్నాం దేశాలు కలిసివస్తాయని అమెరికా ఆశిస్తుంది.మన దేశాన్ని కూడా బుజ్జగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్‌లతో కలిసి అమెరికా క్వాడ్రిలేటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌ (క్యుఎస్‌డీ) మిలిటరీ సహకార కూటమిని స్థాపించింది.
నాటో యుద్ధకూటమి చైనాను కూడా లక్ష్యంగా చేసుకొని 75వ శిఖరాగ్ర సమావేశంలో చైనా ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో రష్యాకు సహకరించిందని ఆరోపించింది. ఈ ఆరోపణలకు మద్దతుగా ఆసియాపసిపిక్‌లో యుద్ధవాతావరణాన్ని సృష్టించడానికి తద్వారా నాటోను అక్కడ వ్యాప్తిచేయడానికి ప్రణాళికలను రచిస్తున్నది. ‘ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ప్రచ్ఛన్న యుద్ధ వాంఛనలను ఆచరణలో ఉంచటానికి ప్రయత్నించకండి’ అని తీవ్ర స్వరంలో అమెరికాను చైనా హెచ్చరించింది. నాటో మొదటి జనరల్‌ సెక్రటరీ లార్డ్‌ హేస్టింగ్స్‌ చెప్పినట్లుగా ‘అసలు నాటో కూటమి సోవియట్‌ యూనియన్‌ను దూరంగా ఉంచటానికి’ 1949లో సృష్టించారు. 1991 సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత నాటో కూటమిని రద్దుచేసి ఉండాలి. కానీ ఆ తర్వాత తూర్పు యూరప్‌కు, (ఒకప్పటి సోషలిస్టు దేశాలకు) నాటో విస్తరించింది. తూర్పువైపునకు ఒక్క అంగుళం కూడా విస్తరించనని అమెరికా ఒప్పుకొని జంటిల్‌మెన్‌ ఒప్పందాల్ని ఉల్లంఘించింది. అమెరికా సామ్రాజ్యవాదం ఇప్పుడు ‘నార్త్‌ అట్లాంటిక్‌’కు దూరంగా విస్తరిస్తూ క్షిపణులను మోహరిస్తూ, యుద్ధాలను చేస్తూ, ప్రోత్సహిస్తూ ఆయుధ వ్యాపారకోసం ప్రపంచశాంతిని పణంగా పెడుతుంది. పెట్టుబడిదారీ ఆర్థికవ్యవస్థకు లాభార్జన ముఖ్యం! ప్రజల ప్రాణాలు, పర్యావరణ రక్షణ కానేకాదు. ఉక్రెయిన్‌ శాంతి చర్చలకు పూనుకోదు, గాజాలో మారణకాండను ఆపదు. కానీ ప్రపంచశాంతికోసం సామ్రాజ్యవాదం కట్టుకథలు వల్లిస్తుంది. ప్రచ్ఛన్నప్రత్యక్ష యుద్ధాల్ని ప్రేరేపిస్తుంది.

ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం
సెల్‌: 9849491969

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img