Friday, October 25, 2024
Friday, October 25, 2024

నిజం బతికే రోజులు రావాలి

డాక్టర్‌ దేవరాజు మహారాజు

అబద్దందర్జాగా బతికి ఏదో ఒకరోజు చస్తుంది. నిజంరోజూ చస్తూ, ఏదో ఒకరోజు బతికి భవిష్యత్తులో చరిత్రగా మారుతుంది. అటు తర్వాత అది, అనునిత్యం బతుకుతుంది. శాస్త్రీయ దృక్కోణం లేని సాహితీవేత్తలు, కళాకారుల వల్ల సమాజానికి జరిగే మేలుకన్నా కీడే ఎక్కువ! ఒకప్పటి పురాణ రచయితల వల్ల ఆధునిక సమాజం కూడా ఎలా అతలాకుతలం అవుతుందో గమనించండి. ఎనిమిదివేల ఎనిమిది వందల శ్లోకాలతో వ్యాసుడు రాసిన ‘జయం’ అనే ఒక కట్టుకథను వైశంపాయనుడు ఇరవైనాలుగు వేల శ్లోకాలకు పెంచాడు. దానికి ‘భారతం’ అని పేరుపెట్టాడు. కొంత కాలానికి దానికి మరో డెబ్బయి ఆరువేల శ్లోకాలు జోడిరచి, ఆ గ్రంథాన్ని లక్ష శ్లోకాలకు విస్తరించాడు. అప్పుడు దాన్ని ‘మహాభారతం’ అని అన్నాడు. ఆ తర్వాత ఆ కథలో అనేక ప్రక్షిప్తాలు చేరిపొయ్యాయి. అందుకే మనం అర్థం చేసుకోవాల్సిందే మంటే ‘మహాభారతం’ చారిత్రక గ్రంథం కాదు, కాలేదు. పైగా పురాణాల ద్వారా హిందూ ధర్మం మనకు ఇచ్చిన వరాలు కొన్ని ఉన్నాయి. అవి బాల్య వివాహాలు, సతీ సహగమనం, వైధవ్యం, జోగినీ వ్యవస్థ, వరకట్నం వగైరా. ఇవి స్త్రీలను అణిచిపెట్టడానికి ఎంతగా ఉపకరించాయో అందరికీ తెలుసు. ఇక కుల వ్యవస్థ, అంటరానితనం, బలులు, కన్యాశుల్కం ఇతర మూఢ నమ్మకాలు ఎన్నో ఎన్నెన్నో. ఇవన్నీ గొప్పతనాలా? సంస్కృతీ సంప్రదాయాల పేరిట కొనసాగించిన వరాలా? శాపాలా? లేక మూఢ నమ్మకాలా? ఇంగిత జ్ఞానంతో ఎవరికి వారే ఆలోచించు కోవాలి! మారుతున్న కాలాన్ని జరుగుతున్న వైజ్ఞానిక ప్రగతిని గమనించకుండా పురాణాలకు అనుగుణంగా ఆధునిక సమాజం ఉండాలను కోవడం బుద్ధి తక్కువ. ఆధునికంగా జీవిస్తూ వేల ఏళ్ల నాటి విలువల్ని ప్రతిష్టించు కోవాల్సిన అవసరాన్ని కొందరు ‘చదువుకున్న నిరక్షరా స్యులు’ నొక్కి చెపుతుంటారు. ప్రజలు అలాంటి వారి నోళ్లు మూయించాలి! ‘చదువుకున్న అవివేకులు’ తమ ఇళ్లలో పెళ్ల్లిళ్లు జరిగితే, సీతారాముల పెళ్లిలోని తలంబ్రాల ఘట్టం పెండ్లి పత్రికలో ముద్రించుకుంటారు. కొత్త జంటను సీతారాముల్లా వర్థిల్లమని దీవిస్తుంటారు. బాజా భజంత్రీ వాళ్లను సీతారాముల కళ్యాణం పాటలు వాయించమం టారు. ‘అమ్మో! సీత కష్టాలు’ అనే పదం ఈనాటికీ వాడుకలో ఉంది. రాముడు సీతను అనుమానించి అగ్నిపరీక్ష కోరాడు. చివరకు అడవుల పాలు చేసిన మహానుభావుడు! అతను ఎలా ఆదర్శమో ఆలోచించు కోవాలి! కొత్త జంటల్ని సీతారాముల్లా ఉండమని అభినందించడం, ఆశీర్వదించడం ఏమైనా తెలివిగల పనేనా? ఒక్కసారి ప్రజాకవి వేమన పద్యాలు తిరగేస్తే అసలు నిజాలు తెలుస్తాయి. వేదాలు, పురాణాలు, ఎంత సంస్కారహీనంగా రాశారన్నదివేమన కాలంలోనే కాదు, ఆయన తర్వాత కూడా హేతువాద రచయితలు ఎత్తి చూపుతూనే ఉన్నారు. దేవుడి పేరుతో, భక్తి పేరుతో గుడ్డిగా విశ్వసించేవారు వారి విశ్వాసాల్లో వారు ఉండొచ్చు. కానీ, విశ్వాసాల్లో లేనివారిని, హేతుబద్ధంగా విశ్లేషించుకుని దృఢ మనస్కులై ఉన్నవారిని బూతులు తిట్టే అర్హత వారికి ఉండదు. బూతులు తిడితే తాము సంస్కార హీనులమని తమకు తామే ఢంకా బజాయించుకున్నట్టు కాదా? మత బోధకులు ఏం చేశారూ? సహాయపడిన వారికి కృతజ్ఞతలు చెప్పడంకూడా నేర్పించలేదు. పైగా, మనుషుల్ని అవమానపరిచే పదం నేర్పారు. ‘‘దేవుడి దయ వల్ల’’ అని అనమన్నారు. కృతజ్ఞతా భావం ఉంటే అది సహాయపడిన వారికి నేరుగా వ్యక్తం చేయాలి కదా? ‘దేవుడి దయ’అనే పదం మనుషులైన వారిని అవమానపరిచేది. మను వాదులు మతవాదులు అంతే కదా? వారు మనుషుల్ని మనుషులుగా ఎప్పుడు గుర్తించారు గనక? అయినా సహాయపడ్డ వారికీ, సహాయం తీసుకున్న వారికీ మధ్య దేవుణ్ణి ఎందుకు జొప్పించారోదాని వెనక జరిగిన కుట్ర ఏమిటో అర్థం చేసుకుంటే మంచిది. అబద్దాన్ని నిలబెట్టాల నుకునే వారికి నిజాల్ని ప్రకటించే వారికి పొసగదు. తటస్థంగా ఉండే వారంతా ఆలోచించుకోవాలి. దేన్ని ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి. అబద్దం వైపు, భ్రమల వైపు ఉన్నవారు కూడా ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది. అబద్దపు పవిత్ర గ్రంథాల ప్రభావం సమకాలీన సమాజంపై ఎలా పడుతూ ఉందో రోజూ వార్తలో చూస్తూనే ఉన్నాం. అక్రమ సంబంధాలతో రాసిన మత గ్రంధాల్ని అర్ధ నిమిళిత నేత్రాలతో విని పరవశించి పోయేవారే ఆలోచించాలి. ‘‘బహిష్టు సమయంలో వంటచేసే మహిళ మరుజన్మలో వావి వరుసలు లేని వ్యభిచారిగా పుడుతుంది.’’అని అన్నాడు స్వామి కృష్ణాస్వరూప్‌ దాస్‌. జీవశాస్త్ర పరంగా బహిష్టు అంటే ఏమిటో అతను తెలుసుకోలేదు. మరుజన్మ గురించి అవగాహన లేదు. వ్యభిచారాన్ని ఎవరు పెంచి పోషించారో అవగాహనలేదు. పైగా ఎవరూ వ్యభిచారులుగా పుట్టరు. యుక్త వయసుకు వచ్చాక ఆ వృత్తిలోకి నెట్టివేస్తారు. కనీసమైన ఇంగిత జ్ఞానం లేకుండా నోరుంది కదా వినే ‘బకరా’ లున్నారు కదా అని ఏదో ఒకటి వాగడం ఎంత వరకు సబబూ ‘‘ఒరేయ్‌! నీ తల్లి బహిష్టు సమ యంలో కూడా చిన్నప్పుడు నీకు పాలిచ్చిందిరా మనువాదీ!’’అని చెప్పాల్సిన వాళ్లు చెప్పాలి కదా? లేకపోతే అతను తన అజ్ఞానాన్నే గొప్ప జ్ఞానంగా భావిస్తూ ఉంటాడు. ఇలాంటి విషయం ఏదైనా చెప్పగానే ‘‘యేం? మీకు హిందూమతం లోని తప్పులే కనిపిస్తున్నాయా? ఇతర మతాల్ని, ఆ మత గ్రంథాల్ని, ఆ మత బోధకుల్ని విమర్శించరా? ఆ ధైర్యం మీకు లేదా?’’ అని తమస్థాయిని తామే తగ్గించుకుని కొందరు మాట్లాడు తుంటారు. మతంఅని అంటే, అది అన్ని మతాల విశ్వాసకులు అని అర్థం. ప్రతిసారీ ఒక్కొక్క మతాన్ని ఉటంకిస్తూ చెప్పడం కుదరదు. అల్లాను ప్రసన్నం చేసుకోవడం కోసం, ఆయన ప్రేమకు పాత్రురాలు కావడం కోసం, కేరళ పాలక్కడ్‌ జిల్లాలో గర్భవతి అయిన ముప్పయ్యేళ్ల తల్లి, తన ఆరేళ్ల కొడుకు గొంతుకోసి చంపేసింది. పాలకులే కాదు, మత విశ్వాసాలున్న ప్రజలు కూడా ఈ దేశాన్ని త్వరితగతిన పాత రాతియుగంలోకి తీసుకుపోవటానికి నిరంతరం కృషి చేస్తు న్నారు. అందుకే, సమాజంలో హేతువాదాన్ని, మానవ వాదాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది! మత విశ్వాసాలతో పరి పాలన సాగించిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఎంత ఘోరంగా విఫలమైందో ప్రత్యక్షంగా చూశాం. కోవిడ్‌ ఉధృతిలో జనం శవాల గుట్టలుగా పేరుకుపోతూ ఉంటే నాటి దేశ నాయకుడు మాత్రం ఎలక్షన్‌ ర్యాలీలు నిర్వహిస్తూనే వచ్చాడు. కుంభమేళాకు అనుమతి ఇచ్చి ముప్పయి లక్షల మందిని గంగానదిలో నగ్నంగా జలకాలాడిరచాడు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వేషంతో బెంగాల్‌ వెళ్లాడు. బెంగాలీల మెప్పు కోసం బంగ్లా స్వాతంత్య్ర సమరంలో పాల్గొని జైలుకెళ్లానని అబద్ధం చెప్పాడు. కేరళ వెళ్లి బైబిల్‌ సూక్తులు వల్లించాడు. అన్ని చోట్లా అన్ని వేళలా మూర్తీభవించిన మత విశ్వాసకుడిలా రంగులు మార్చాడు. ఇక, మరోవైపు సామాన్యుల్లో వైజ్ఞానిక స్పృహ, నిజాయితీ, నిబద్ధత పెంచడం ఎలాగని కొంతమంది రచయితలు, మేధావులు, సైన్సు సంస్థల కార్యకర్తలూ ‘తపన’ పడుతూనే ఉన్నారు. ‘‘కొందరికి దేవునిపై నమ్మకం ఉంటే ఉండొచ్చు. కానీ, దాని ఆధారంగా ఇతరులపై మతాన్ని రుద్దే హక్కు ఎవరికీ ఉండదు’’అని అన్నారు ప్రపంచ ప్రసిద్ధురాలైన నర్స్‌ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌!
`సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img