Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

మోదీ ఎందుకు ఓడిపోవాలంటే…?

డాక్టర్‌ సిఎస్‌ క్షేత్రపాల్‌ రెడ్డి

భారత దేశ చరిత్రలో అన్ని రంగాల్లో విఫలమైనది మోదీ సర్కారే. దేశ భవితను నిర్దేశించే అన్ని విషయాల్లో తీసుకున్న అస్తవ్యస్త, అనాలోచిత నిర్ణయాలవల్ల దేశ ప్రజలు కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. డాలర్‌తో పోల్చిచూస్తే చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి బలహీనపడిరది. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఇప్పుడున్నంత నిరుద్యోగుల సంఖ్య గత 45ఏళ్లలో ఎన్నడూ లేదు. పేదరికంలో నైజీరియా కంటే దిగువకు భారత్‌ పడిపోయింది. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. ప్రజాస్వామ్య సూచీ, పత్రికా స్వేచ్ఛ, సంతోషసూచీ, పేదరిక సూచీ, అంతర్గత శాంతి సూచీలోనూ దిగజారడం వరకు అన్నింటిలో భారతదేశం వెనక్కువెళ్లింది. మేక్‌ ఇన్‌ ఇండియా, వంద స్మార్ట్‌ సిటీల నిర్మాణం, స్వచ్ఛ భారత్‌, స్కిల్‌ ఇండియా, బేటీ బచావ్‌` బేటీ పఢావ్‌, అచ్చేదిన్‌, ఆత్మనిర్భర్‌ భారత్‌, అమృత్‌కాల్‌ వంటి నినాదాలు ఇస్తూ దేశ ప్రజల్ని మోసగిస్తూనే వచ్చారు. నిరంకుశంగా చేసిన పెద్దనోట్ల రద్దు జీఎస్టీతో భారత ఆర్థికవ్యవస్థ చతికిలపడిరది. కోట్ల మంది ఉపాధితోపాటు, వందలమంది ప్రాణాలను కోల్పోయారు. నోట్ల రద్దుతో నాలుగు లక్షల కోట్ల నల్లధనం వెలికి తీస్తామన్న మోదీ మాటలు అసత్యాలేనని తేలిపోయాయి. కొత్త నోట్ల ముద్రణకే ఆర్‌బీఐ రూ.17 వేల కోట్లకు పైగా ఖర్చుచేసింది. జీఎస్టీ చిన్న, మధ్య తరగతి పరిశ్రమల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నది. చేనేత వస్త్రాలపై చదువుకునే చిన్నారులు వాడే పెన్సిళ్ల నుంచి ఆసుపత్రుల్లో చికిత్సపొందే రోగులు వినియోగించే బ్రెడ్‌లపైనా పన్నులు వేసింది. చివరికి అంత్యక్రియలకు కూడా పన్నులువేస్తూ ప్రజలను దోచుకుంటోంది.
బీజేపీకి ముందున్న ప్రభుత్వంలో పెట్రో పన్నుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన ఆదాయం వచ్చేది. ఇప్పుడు పెట్రో ఉత్పత్తులపై సెస్సులు భారీగాపెంచి కేంద్రమే రెండున్నర రెట్లు దోచుకుంటోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరల పెరుగుదలకు హద్దులేదు. అయితే ఓట్ల కోసం వీటి రేట్లు కొంత తగ్గించారు. ఆర్థిక వ్యవహారాల్లో మోదీ అనాలోచిత నిర్ణయాలను భరించలేక రఘురామ్‌ రాజన్‌, ఉర్జిత్‌ పటేల్‌ సహా అనేకమంది ఆర్థికవేత్తలు, ప్రభుత్వ అధికారులు ఆర్‌బీఐ నుంచి వెళ్లిపోయారు. భారీ కార్పొరేట్‌ కంపెనీలకు ప్రయోజనాలు చేకూర్చేలా ఆశ్రిత పెట్టుబడీదారీ వ్యవస్థ బాటలు వేసింది.
2014 ఎన్నికలకు ముందు యువతకు ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలను హామీ ఇచ్చి పదేళ్లు గడచినా ఆ ఊసే ఎత్తడంలేదు. నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరికి 15 లక్షలు పంచుతానన్న హామీ హామీగానే మిగిలింది. రక్షణరంగంలో సంస్కరణల పేరుతో అగ్నివీర్‌ వంటి పథకాన్ని తెచ్చి యువత ఆగ్రహానికి గురైంది. పుల్వామా ఉగ్రదాడి విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడమే కాకుండా వీర సైనికుల మరణాలను తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు వాడుకుందని బీజేపీ నేత, జమ్మూకాశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ చేసిన వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది. మహిళల రక్షణకు భద్రత లేకుండా పోయింది. హత్రాస్‌, ఉన్నావ్‌ ఘటనలే ఇందుకు నిదర్శనం. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మీడియా గొంతునొక్కుతున్నారు. విద్య కాషాయీ కరణ అయ్యింది. చరిత్ర వక్రీకరణకు గురైంది. సినీ రంగం మతతత్వ బీజాలు పెంచి పోషిస్తున్నారు. దూరదర్శన్‌ కాషాయీకరణకు గురైంది. కరోనా విపత్తును ఎదుర్కొనడంలో మోదీ తీవ్రంగా విఫలమయ్యారు. గంగానదీ తీర ప్రాంతంలో వేలకొద్ది కరోనా మృత దేహాలు తేలియాడడమే ఇందుకు సాక్ష్యం. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు నిత్యం ద్వేషపూరిత ప్రసంగాలతో కాలం గడపడం సాధారణమైంది. దళితులు, మైనారిటీలపై మూకదాడులు, కొట్టి చంపడాలు, అల్లర్లు నిత్యకృత్యమయ్యాయి. గాంధీని హత్య చేసిన ఉగ్రవాది గాడ్సేను బహిరంగంగా ఆరాధించడం మొదలైంది. లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలవడం, ఆందోళన చేస్తోన్న మహిళా రెజ్లర్లను అవమానించడం మరిచిపోలేని ఘటనలే. వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, పండిరచే పంటకు చట్టబద్దమైన కనీస మద్దతుధర సాధన కోసం దిల్లీని చుట్టుముట్టిన అన్నదాతల విషయంలో నిరంకుశంగా వ్యవహరించింది. రెండోసారి జరిగిన అన్నదాతల ఉద్యమాన్ని కాల్పులతో రక్తసిక్తం చేసింది.
అవినీతి మరకలే తమకు లేవని నిత్యం ఢంకా బజాయించే మోదీ సర్కారు అవినీతి పరులందరినీ తమ పార్టీలోకి చేర్చుకుంది. శారదా కుంభకోణం నిందితులు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, బెంగాల్‌కు చెందిన సువేందు అధికారి, ఆర్థిక నేరాల ఆరోపణలున్న ప్రపుల్ల పటేల్‌, అజిత్‌ పవార్‌, గాలి జనార్థన రెడ్డి, ఏపీకి చెందిన సుజనా చౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేశ్‌ వంటి వందల మంది అవినీతి పరులన్న ఆరోపణలున్నాయి. ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారాన్ని నీతి ఆయోగ్‌, ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక వ్యవహారాల సలహాదారులు వ్యతిరేకించినా మోదీ ప్రభుత్వం లెక్కచేయలేదు. ఈ విషయంతో ఏకీభవించని ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఎలక్టోరల్‌ బాండ్ల పేరుతో బీజేపీ తీవ్రమైన అవినీతికి పాల్పడినట్లు సుప్రీంకోర్టు చర్యల ద్వారా బహిర్గతమైంది. నిత్యం గోవు సంరక్షణ గురించి ఉపన్యాసాలిచ్చే బీజేపీ అందుకు విరుద్ధంగా గో మాంసం ఎగుమతి దారుల నుంచి ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రూ.250 కోట్లు విరాళాలు స్వీకరించి తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది. మోదీ ప్రభుత్వంలోకి వచ్చిన నాటి నుంచి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేయలేకపోగా ఇప్పటికే ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు చూస్తోంది.
కార్మిక వర్గాన్ని, వారి హక్కులను నిర్వీర్యం చేసేలా కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తూ నాలుగు లేబర్‌ కోడ్‌లను రూపొందించింది. ఎక్కడ ఎన్నికలు వచ్చినా మతతత్వాన్ని రెచ్చగొట్టాలని చూస్తోంది. మైనారిటీలే లక్ష్యంగా ఆర్టికల్‌ 370 రద్దు, సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌, తాజాగా ఉమ్మడి పౌరస్మృతి వంటి వివాదాస్పద అంశాలను ముందుకు తెస్తోంది. తమకు గిట్టని పార్టీలను, నేతలను ఈడీ, సీబీఐ, ఐటీ తదితర సంస్థల చేత బెదిరించాలని చూస్తున్నది. తమ మాట వినని నేతలను అక్రమ కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపుతున్నది. జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌, డిల్లీ సీఎం కేజ్రీవాల్‌, మంత్రులు జైలుపాలు కావడమే ఇందుకు తాజా ఉదాహరణ. ఈ నేపథ్యంలోనే దేశం అధోగతి పాలవ్వడానికి కారణమైన బీజేపీ ఓడిపోవాలని దేశం కోరుకుంటోంది. గాంధేయవాదులు, అంబేద్కర్‌వాదులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. రాజ్యాంగ ప్రేమికులు, లౌకికవాదులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఎస్‌సీలు, ఎస్‌టీలు, ఓబీసీలు, ఆదివాసీలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. మెజారిటీ హిందూ సమాజంతో పాటు సిక్కులు, క్రైస్తవులు, ముస్లింలు, పౌర, ప్రజాసంఘాలు అన్ని బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు.

సెల్‌: 9059837847

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img