London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

విలువల పునాదిపై ప్రభవించిన విశాలాంధ్ర

తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధి, సోషలిస్టు భావజాల ప్రచారం రెండు కళ్లుగా ముందుకు సాగుతోంది. ఆధునిక తెలుగు జాతి చరిత్రలో ఎన్నెన్నో ముఖ్య ఘట్టాల్లో తన సైద్ధాంతిక, జనబలంతో తనదైన చారిత్రక పాత్ర పోషించింది. శ్రామిక జనవాణిగా, సామ్యవాద సాధన వేదికగా ప్రజల పక్షాన నిలిచి అక్షరాక్షరంలో అభ్యుదయాన్ని రంగరించుకుని ప్రజా చైతన్యాన్ని ప్రోది చేసేందుకు తపిస్తున్నది, పరిశ్రమిస్తున్నది. ఈ దినపత్రికతో అనుబంధం ఉన్న ప్రముఖులు ఎందరెందరో ఉన్నారు. దీని ద్వారా ఎందరో ప్రముఖులుగా గుర్తింపు పొందారు. తన ప్రస్థానంలో ఎన్నో ఒడుదొడుకులను ఒడుపుగా ఎదుర్కొంటూనే రజతోత్సవ, స్వర్ణోత్సవ, వజ్రోత్సవాలు పూర్తి చేసుకొని నేటికి 72 వసంతాలు నింపుకున్నది. ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ కొందరు ప్రముఖులు విశాలాంధ్రతో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.

డీవీవీఎస్‌ వర్మ

1952లో కమ్యూనిస్టు పార్టీ దిన పత్రికగా విశాలాంధ్ర ప్రస్థానం మొదలైంది. తెలుగు దినపత్రికలలో నిరంతరాయంగా 72 సంవత్సరాలు పూర్తి చేసుకుని కొనసాగుతూ వయస్సు పరంగా పెద్దరికపు చరిత్రను తన సొంతం చేసుకుంది. అంతకు మించి ప్రత్యామ్నాయ జర్నలిజానికి అంకురార్పణ చేసిన ఘనత విశాలాంధ్రకే దక్కింది. కమ్యూనిస్టు పార్టీ నిత్య కార్యకలాపాల ప్రచారానికే పరిమితం కాకుండా తెలుగు ప్రజలకు ఒక అంతర్జాతీయ దృక్పథాన్నీ, సామ్రాజ్యవాద వ్యతిరేక స్ఫూర్తిని అందించింది, దేశ స్వావలంబన సాధనకూ, సకల శ్రామిక ప్రజల పోరాటాలకూ వెన్నుదన్నుగా నిలిచిన చరిత్రా విశాలాంధ్ర దక్కించుకుంది. తెలుగు ప్రజల సాంఘిక, సాంస్కృతిక జీవనంలో శాస్త్రీయ దృష్టినీ , అభ్యుదయ సాహిత్యాభిరుచులను పంచిందీ విశాలాంధ్రే. దీనికి దోహదం చేసిన విశిష్ట పునాదులను నెమరు వేసుకుని ముందుకు సాగడానికి ఈ వార్షికోత్సవాలు ప్రేరణగా నిలవాలి
స్వాతంత్య్రోద్యమ కాలంలో తెలుగు పత్రికలు విస్తరించాయి. ఒక ఆదర్శం కోసం, ఒక సంస్కరణ కోసం వచ్చిన ఈ పత్రికలు అన్నీ దాదాపుగా సంపాదకుల పత్రికలే. వీటికి లాభాపేక్ష లేదు. సమాజానికి మంచి జరగాలన్న తాపత్రయం ప్రధానం. స్వాతంత్య్రానంతరం పత్రికా రంగంలో కొత్త శక్తులు ప్రవేశించాయి. పత్రికా రంగంలోకి పెట్టుబడి దిగింది. లాభాపేక్ష గల వ్యాపారంగా క్రమేణా రూపాంతరం చెందింది. ఇక్కడ పత్రికాధిపతులు వేరు, సంపాదకులు వేరు అన్న విభజన ప్రారంభమైంది. యజమానికి లాభాల వేట ప్రధానం. అధికార పార్టీల ప్రాపకం అవసరం. అడ్వర్‌టైజ్‌మెంట్లు ఆదాయం ప్రధానం. దానికి అనుగుణంగానే వార్తల సేకరణ, ప్రచురణ సాగుతున్నది. చివరికి ‘‘నగదుకు వార్త’’ వరకు విస్తరించింది. చాలా పత్రికలకు యజమానులే ఎడిటర్‌లు అయ్యారు. ఎక్కడైనా ఎడిటర్లు వున్నా మార్కెటింగ్‌ మేనేజర్లే వార్తల ప్రాధాన్యత నిర్ణయించే వారయ్యారు. ఇక్కడ పత్రికా రంగం విలువలన్నీ వ్యాపార విలువలుగా మారాయి. ‘పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన విష పుత్రిక’లంటూ శ్రీశ్రీ వీటికి నామకరణం చేశాడు. ఈ పత్రికలు లాభాల వేటలో చిన్న పత్రికలను స్వాతాపి జీర్ణం చేసుకున్నాయి. ఇంతటి లాభాల పోటీలో, విలువల పతనంలో ఇంతటి దుర్నీతి జర్నలిజం జడలు విప్పిన కాలంలో వీటికి ఎదురొడ్డి నిలబడిన పత్రికగా విశాలాంధ్ర, మరికొన్ని వామపక్ష పత్రికలు మనకు కనిపిస్తాయి. విశ్వ మానవ విలువలను పునాది చేసుకుని నిలబడగలిగాయి.
స్వాతంత్య్రోద్యమ కాలంలోనే కమ్యూనిస్టు పార్టీ పత్రికలు పుట్టుకొచ్చాయి. 1937లో నవశక్తి ఆ తర్వాత స్వతంత్ర భారత్‌, 1942 తర్వాత ప్రజాశక్తి పత్రికలు నడిచాయి. నిర్బంధాలతో ప్రజాశక్తిని మూసివేయాల్సి వచ్చింది. తిరిగి స్వాతంత్య్రానంతరం 1952లో కమ్యూనిస్టు పార్టీ దినపత్రికగా విశాలాంధ్ర ప్రారంభమైంది. అసలు విషయం ఏమిటంటే పైన పేర్కొన్న కమ్యూనిస్టు పత్రికలన్నింటికి మద్దుకూరి చంద్రశేఖరరావు గారే సంపాదకులు. చంద్రంగారు స్వాతంత్య్ర సమరయోధులు. ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ నిర్మాతలలో ప్రముఖులు. అంతకుమించి తెలుగు సాహిత్యం మీద, సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాల మీద అవగాహన, ముందు చూపు గల అపురూపమైన నాయకుడు. చంద్రం గారి సారథ్యంలో కమ్యూనిస్టు పత్రికలు కేవలం పార్టీ కార్యకలాపాల ప్రచార సాధనాలుగా మాత్రమే కాకుండా విశ్వ జననీ విలువల పునాదుల మీద వాటిని నడిపించారు. సామ్రాజ్యవాద కుట్రలను ప్రతిఘటించడం, ప్రపంచ శాంతికి వర్ధమాన దేశాల స్వావలంబన పోరాటాలకు వేదికను చేసి ఒక అంతర్జాయతీయ విలువను సంతరింపజేశారు. కార్మిక వర్గ పక్షపాతిగా శ్రమజీవుల సమస్యలకు గొంతుకగా, వారు సాగించే ఉద్యమాలకు ఊపిరిగా ప్రజల పక్షాన నిలబడే పత్రికగా నిబద్దతకు మరొక విలువగా పాటించారు. జన జీవనాన్ని సంస్కారవంతం, సారవంతం చేసే సాంస్కృతిక, సాహిత్య ఉద్యమాలను సంఘ సంస్కరణ ఉద్యమాలను పత్రికా రచనలో అంతర్భాగం చేసి మరో విలువను జతచేశారు. ప్రత్యామ్నాయ ప్రజా జర్నలిజానికి విశాలాంధ్రను ప్రతీకగా రూపొందించారు. విశాలాంధ్ర కమ్యూనిస్టు పార్టీ పత్రికే అయినా రాష్ట్రంలో రచయితల్ని, మేధావుల్ని, మధ్య తరగతి వర్గాలను విశేషంగా ఆకర్షించేలా చేశారు.
విశాలాంధ్ర ఆదివారం సాహిత్య పేజీలో రాష్ట్రంలో లబ్ధ ప్రతిష్టులైన రచయితలు, కవులు వ్యాసాలు, సాహిత్య విమర్శలు, ప్రత్యేక కాలమ్‌లు రాశారు. విశాలాంధ్ర ఆదివారం సంచిక ఎంతటి ప్రాచుర్యం పొందిందంటే ఒక్క ఆదివారం సంచిక కోసం ప్రత్యేక చందాతో పత్రికను అందించే పద్ధతి ప్రవేశ పెట్టవలసి వచ్చింది. స్థానిక ప్రజా సమస్యలకు, గ్రామీణ వార్తలకు దినపత్రికలో విశేష స్థానం కల్పించిన తొలి పత్రిక విశాలాంధ్రే. ఇతర పత్రికలకు గ్రామీణ విలేకరులు లేరు. ఆ పత్రికలకు పంపిణీ ఏజంట్లు మాత్రమే వుండేవారు. వారు తమ పత్రికలో ప్రకటనలకు అవసరమైన ఒకటి రెండు వార్తలు నెలలో పంపే పద్ధతి వుండేది. కాని విశాలాంధ్రకు రాష్ట్రం అంతటా విస్తరించిన కమ్యూనిస్టు పార్టీ స్థానిక నాయకులందరూ వార్తలు సేకరించి పంపే విలేకరులు కావడంతో గ్రామీణ వార్తల ప్రచురణకు శ్రీకారం చుట్టిన ఘనత విశాలాంధ్రకే దక్కుతుంది. కార్మిక సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు సాగించే కార్యకలాపాలకు ఉద్యమాలకు విశాలాంధ్రలో ఎంతో ప్రాధాన్యతతో చోటు దక్కేది. విశాలాంధ్ర మహిళా రంగం, రైతు రంగం, యువజన రంగం వగైరాలకు ప్రత్యేక కాలమ్స్‌ నిర్వహించి ఆయా రంగాల సమస్యల మీద అవగాహన కల్పించడమే కాకుండా సామాన్యుల రచనలకు, అభిప్రాయాలకు అవకాశాలు కల్పించారు. నేను నా మొదటి చిరు వ్యాసం విద్యార్థిగా వుండగా ‘తరుణ జగతి’ పేజీకి రాశాను ఆ తర్వాత కొన్ని కాలమ్స్‌, వ్యాసాలు రాసే వరకు ప్రోత్సహించింది విశాలాంధ్రే. చంద్రం గారి తర్వాత రాజకీయ సాహితీ రంగాలలో నిష్ణాతులైన వారు సంపాదకులుగా వచ్చారు. దీర్ఘకాలంపాటు బహుముఖ ప్రజ్ఞాశాలి చక్రవర్తుల రాఘవాచారి సంపాదకులుగా ‘విశాలాంధ్ర రాఘవాచారి’గా పేరు పొందారు.
విశాలాంధ్ర, ఇతర వామపక్ష పత్రికలు లేకపోతే సామ్రాజ్యవాదాన్ని ప్రపంచీకరణనీ ప్రశ్నించే, నిలదీసే శక్తి ఉండేది కాదు. శ్రమ జీవుల సమస్యల్ని, వారి పోరాటాలను ప్రచారం చేసే సాధనం వుండేది కాదు. మూఢ నమ్మకాలను సాంఘిక దురాచారాలను, మహిళా వేధింపులకు వార్తలలో ప్రాధాన్యత ఉండేది కాదు. సాహిత్య సాంస్కృతి రంగాల వికాసానికి తగిన ప్రాధాన్యత లభించేది కాదు. మరో పక్క విశాలాంధ్ర పత్రికతోపాటు 1953లో విశాలాంధ్ర ప్రచురణాలయం కూడా ఏర్పడిరది. సాహిత్య సాంస్కృతిక రంగాలలో దానికి అదే సాటి అన్న రీతిలో పుస్తకాలను ప్రచురించింది. విశాలాంధ్ర ప్రచురణాలయం ద్వారానే కందుకూరి, గురజాడ, గిడుగు రచనలు పూర్తిగా వెలుగు చూశాయి. శ్రీశ్రీ, కుటుంబరావు, తిలక్‌ రచనలతోపాటు రాహుల్‌ సాంకృత్యాన్‌ సాహిత్యాన్నీ, బొల్లిముంత, రాంభట్ల, ఆర్వీయార్‌ వంటి ఉద్దండుల రచనలను అందుబాటులోకి తెచ్చింది. మార్క్స్‌ కాపిటల్‌ మూడు భాగాలను, ఆంధ్రప్రదేశ్‌ దర్శిని పేరుతో రాష్ట్ర ఆర్థిక రాజకీయ సామాజిక అంశాలపై ప్రామాణికమైన వ్యాసాలతో తెచ్చిన సంకలనాలు విశాలాంధ్రకు పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టాయి. విశాలాంధ్ర వార్షికోత్సవం సందర్భంగా ఇవి కొన్ని జ్ఞాపకాలు మాత్రమే. చిన్న వ్యాసంలో రాసిన దానికంటే విస్మరించినవే ఎక్కువగా వుండడం సహజం. విశాలాంధ్ర కేవలం ఒక దినపత్రిక, ఒక ప్రచురణ సంస్థ మాత్రమే కాదు తెలుగు ప్రజలను విశేషంగా ప్రభావితం చేసిన ఒక కాంతి పుంజం.
దారి దీపం సంపాదకులు, 8500678977

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img