Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

నిజం బతికే రోజులు రావాలి!!

డాక్టర్‌ దేవరాజు మహారాజు

అబద్దందర్జాగా బతికి ఏదో ఒక రోజు ఛస్తుంది. నిజం రోజూ ఛస్తూ, ఏదో ఒక రోజు బతికి భవిష్యత్తులో చరిత్రగా మారుతుంది. అటు తర్వాత అది, అనునిత్యం బతుకుతుంది! శాస్త్రీయ దృక్కోణంలోని సాహితీవేత్తలు, కళాకారులవల్ల సమాజానికి జరిగే మేలు కన్నా కీడే ఎక్కువ! ఒకప్పటి పురాణ రచయితల వల్ల ఆధునిక సమాజం కూడా ఎలా అతలాకుతలం అవుతుందో గమనించండి. ఎనిమిదివేల ఎనిమిది వందల శ్లోకాలతో వ్యాసుడు రాసిన ‘జయం’ అనే ఒక కట్టుకథను వైశంపాయనుడు ఇరవై నాలుగువేల శ్లోకాలకు పెంచాడు. దానికి ‘భారతం’ అని పేరు పెట్టాడు. కొంత కాలానికి దానికి మరో డెబ్బయి ఆరువేల శ్లోకాలు జోడిరచి,ఆ గ్రంధాన్ని లక్ష శ్లోకాలకు విస్తరించాడు. అప్పుడు దాన్ని ‘మహాభారతం’ అని అన్నారు. ఆ తర్వాత ఆ కథలో అనేక ప్రక్షిప్తాలు చేరిపొయ్యాయి. అందుకే మనం అర్థం చేసుకోవాల్సిందేమంటే ‘మహాభారతం’ చారిత్రక గ్రంధం కాదు కాలేదు. పైగా, పురాణాల ద్వారా హిందూ ధర్మం మనకు ఇచ్చిన వరాలు కొన్ని ఉన్నాయి. అవి బాల్య వివాహాలు, సతీ సహగమనం, వైధవ్యం, జోగినీ వ్యవస్థ, వరకట్నం వగైరా. ఇవి స్త్రీలను అణిచిపెట్టడానికి ఎంతగా ఉపకరించాయో అందరికీ తెలుసు. ఇక కుల వ్యవస్థ, అంటరానితనం, బలులు, కన్యాశుల్కం ఇతర మూఢ నమ్మకాలు ఎన్నో ఎన్నెన్నో. ఇవన్నీ గొప్పతనాలా? లేక మూఢనమ్మకాలా? ఇంగితజ్ఞానంతో ఎవరికి వారే ఆలోచించుకోవాలి! మారుతున్న కాలంలో జరుగుతున్న వైజ్ఞానిక ప్రగతిని గమనించకుండా పురాణాలకు అనుగుణంగా ఆధునిక సమాజం ఉండాలనుకోవడం బుద్ధితక్కువ. ఆధునికంగా జీవిస్తున్న వేల ఏళ్లనాటి విలువల్ని ప్రతిష్టించుకోవాల్సిన అవసరాన్ని కొందరు ‘చదువుకున్న నిరక్షరాస్యులు’ నొక్కి చెపుతుంటారు. ప్రజలు అలాంటి వారి నోళ్లు మూయించాలి!’ ‘చదువుకున్న అవివేకులు’ తమ ఇళ్లల్లో పెండ్లిళ్లు జరిగితే, సీతారాముల పెళ్లిలోని తలంబ్రాల ఘట్టం పెండ్లిపత్రికలో ముద్రించుకుంటారు. కొత్తజంటను సీతారాముల్లా వర్ధిల్లమని దీవిస్తుంటారు. బాజా భజంత్రీవాళ్లను సీతారామలు కళ్యాణం పాటలు వాయించమంటారు. ప్రేమకు, అన్యోన్యతకు ప్రతినిధులై సీతారాములు జంట ఉన్నట్లు రామాయణంలోనే లేదు. ‘అమ్మో సీత కష్టాలు’ అనేపదం ఈ నాటికీ వాడుకలో ఉంది. రాముడు సీతను అనుమానించి అగ్నిపరీక్ష కోరాడు. చివరకు అడవులపాలు చేసిన మహానుభావుడు! అతను ఎలా ఆదర్శమో ఆలోచించుకోవాలి! కొత్త జంటల్ని సీతారాముల్లా ఉండమని అభినందించడం, ఆశీర్వదించడం ఏమైనా తెలివిగల పనేనా? ఒక్కసారి ప్రజాకవి వేమన పద్యాలు తిరగేస్తే అసలు నిజాలు తెలుస్తాయి. కనక మృగము భువిని కద్దు లేదనకుండ తరుణి విడిచిపోయె దాశరథియు తెలివి లేనివాడు దేవుడెట్లాయెరా? విశ్వదాభి రామ వినుర వేమ వెర్రి కుక్కల వలె వేదములు చదివేరు అన్వయంబు నెరుగరయ్య వార్లు వేద విద్యలెల్ల వేశ్యల వంటివి ॥విశ్వ॥ తల్లితో రమించే తండ్రి యజ్ఞము చేసి తనయుడట్లె రంభ తనర గూడె తల్లిని రమింత్రు దబ్బుర విప్రులు ॥విశ్వ॥ వేదాలు, పురాణాలు, ఎంత సంస్కార హీనంగా రాశారన్నది వేమన కాలంలోనే కాదు, ఆయన తర్వాత కూడా హేతువాద రచయితలు ఎత్తి చూపుతూనే ఉన్నారు. దేవుడి పేరుతో, భక్తి పేరుతో గుడ్డిగా విశ్వసించేవారువారి విశ్వాసాల్లో వారు ఉండొచ్చు. కానీ, విశ్వాసాల్లో లేనివారిని, హేతుబద్ధంగా విశ్లేషించుకుని దృఢ మనస్కులై ఉన్నవారిని బూతులుతిట్టే అర్హత వారికి ఉండదు. వారి వాదనను వారు సంస్కారవంతంగా వినిపించొచ్చు. బూతులు తిడితే తాము సంస్కారహీనులమని తమకు తామే ఢంకా బజాయించుకున్నట్టు కాదా? మత బోధకులు ఏం చేశారూ? సహాయపడిన వారికి కృతజ్ఞతలు చెప్పడం కూడా నేర్పించలేదు. పైగా, మనుషుల్ని అవమానపరిచే పదం నేర్పారు. ‘దేవుడి దయ’ వల్ల అని అనమన్నారు. కృతజ్ఞతా భావం ఉంటే అది సహాయపడిన వారికి నేరుగా వ్యక్తం చేయాలి కదా? ‘దేవుడి దయ’ అనే పదం మనుషులైన వారిని అవమానపరిచేది. మనువాదులుమతవాదులు అంతే కదా? వారు మనుషుల్ని మనుషులుగా ఎప్పుడు గుర్తించారు గనక? అయినా సహాయపడ్డ వారికీ, సహాయం తీసుకున్న వారికీ మధ్య దేవుణ్ణి ఎందుకు జొప్పించారో దాని వెనక జరిగిన కుట్ర ఏమిటో అర్థం చేసుకుంటే మంచిది. అబద్దాన్ని నిలబెట్టాలనుకునే వారికినిజాల్ని ప్రకటించే వారికి పొసగదు. తటస్థంగా ఉండే వారంతా ఆలోచించుకోవాలి. దేన్ని ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి. అబద్దం వైపు, భ్రమల వైపు ఉన్నవారు కూడా ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది. అబద్దపు పవిత్ర గ్రంథాల ప్రభావం సమకాలీన సమాజంపై ఎలా పడుతూ ఉందో రోజూ వార్తలో చూస్తూనే ఉన్నాం. అక్రమ సంబంధాలతో రాసిన మత గ్రంథాల్ని అర్ధ నిమిలిత నేత్రాలతో విని పరవశించేవారే ఆలోచించాలి. అర్థరహితమైన వ్యాఖ్యలు చేయడంలో మత గురువులు ఎప్పుడూ ముందుంటారు. ‘‘బహిష్టు సమయంలో వంటచేసే మహిళ మరుజన్మలో వావి వరుసలులేని వ్యభిచారిగా పుడుతుంది’’ అని అన్నాడు స్వామి కృష్ణాస్వరూప్‌ దాస్‌. జీవశాస్త్రపరంగా బహిష్టు అంటే ఏమిటో అతను తెలుసుకోలేదు. మరుజన్మ గురించి అవగాహన లేదు. వ్యభిచారాన్ని ఎవరు పెంచి పోషించారో అవగాహన లేదు. పైగా ఎవరూ వ్యభిచారులుగా పుట్టరు. యుక్త వయసుకు వచ్చాక ఆ వృత్తిలోకి నెట్టివేయబడతారు. కనీసమైన ఇంగితజ్ఞానం లేకుండా నోరుంది కదావినే ‘బకరా’ లున్నారు కదా అని ఏదో ఒకటి వాగడం ఎంతవరకు సబబూ. ‘‘ఓరేయ్‌! నీ తల్లి బహిష్టు సమయంలో కూడా చిన్నప్పుడు నీకు పాలిచ్చింది రా మనువాదీ!’’ అని చెప్పాల్సిన వాళ్లు చెప్పాలి కదా? లేకపోతే అతను తన అజ్ఞానాన్నే గొప్ప జ్ఞానంగా భావిస్తూ ఉంటాడు. ఇలాంటి విషయం ఏదైనా చెప్పగానే ‘‘యేం? మీకు హిందూమతంలోని తప్పులే కనిపిస్తున్నాయా? ఇతర మతాల్ని, ఆ మత గ్రంథాల్ని, ఆ మత బోధకుల్ని విమర్శించరా? ఆ ధైర్యం మీకు లేదా?’’అని తమస్థాయిని తామే తగ్గించుకుని కొందరు మాట్లాడుతుంటారు. నిజానికి మానవ వాదులెవ్వరూ ఏ మతాన్నీ వెనకేసుకురారు. మతం అని అంటే, అది అన్ని మతాలగురించి చెప్పిన మాట? మత విశ్వాసకులు అంటే అది అన్ని మతాల విశ్వాసకులు అని అర్థం. ప్రతిసారీ ఒక్కొక్క మతాన్ని ఉటంకిస్తూ చెప్పడం కుదరదు. అల్లాను ప్రసన్నం చేసుకోవడం కోసం, ఆయన ప్రేమకు పాత్రురాలు కావడం కోసం, కేరళ పాలక్కడ్‌ జిల్లాలో గర్భవతి అయిన ముప్పయ్యేళ్ల తల్లి, తన ఆరేళ్ల కొడుకు గొంతుకోసి చంపేసింది. పాలకులే కాదు, మత విశ్వాసాలున్న ప్రజలు కూడా ఈ దేశాన్ని త్వరితగతిన పాతరాతి యుగంలోకి తీసుకు పోవడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. అందుకే, సమాజంలో హేతువాదాన్ని, మానవవాదాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది! మత విశ్వాసాలతో పరిపాలన సాగించిన బీజేపీ కేంద్రప్రభుత్వం అన్ని రంగాల్లో ఎంత ఘోరంగా విఫలమైందో ప్రత్యక్షంగా చూశాం. కోవిడ్‌ ఉధృతిలో జనం శవాల గుట్టలుగా పేరుకుపోతూ ఉంటేనాటి దేశ నాయకుడు మాత్రం ఎలక్షన్‌ ర్యాలీలు నిర్వహిస్తూనే వచ్చాడు. కుంభమేళాకు అనుమతి ఇచ్చి ముప్పయి లక్షల మందిని గంగానదిలో నగ్నంగా జలకాలాడిరచాడు. రవీంద్రనాథ్‌ఠాగూర్‌ వేషంతో బెంగాల్‌ వెళ్లాడు. బెంగాలీల మెప్పు కోసం బంగ్లా స్వాతంత్య్ర సమరంలో పాల్గొని జైలుకెళ్లానని అబద్ధం చెప్పాడు. కేరళ వెళ్లి బైబిల్‌ సూక్తులు వల్లించాడు. అన్ని చోట్లా అన్ని వేళలా మూర్తీభవించిన మత విశ్వాసకుడిలా రంగులు మార్చాడు. ‘‘కొందరికి దేవునిపై నమ్మకం ఉంటే ఉండొచ్చు. కానీ, దాని ఆధారంగా ఇతరులపై మతాన్ని రుద్దే హక్కు ఎవరికీ ఉండదు’’ అని అన్నారు ప్రపంచ ప్రసిద్ధురాలైన నర్స్‌ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌! ‘‘నా మానవత్వానికి మతం లేదు. నీ మతానికి మానవత్వం లేదు. అందుకే నీ మతం నాకు సమ్మతం కాదు’’ అని మానవవాదులు గట్టిగా చెపుతున్నారు. ఇందులోని నిజానిజాలు అందరూ సీరియస్‌గా ఆలోచించాలి. ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో దమ్‌తరి జిల్లాలో సంతానంలేని మహిళలు బోర్లాపడుకుంటే పూజారులు మంత్రగాళ్లమని చెప్పుకు తిరిగే కొందరు పురుషులు వారి వీపుపై నుంచి తొక్కుతూ వెళతారు. టెక్నాలజీ పెరుగుతోంది. కాని, జనంలో మూఢ నమ్మకాలు తగ్గడం లేదు. మనుధర్మశాస్త్ర రీత్యా స్త్రీలు కూడా శూద్రులేఅయితే స్త్రీ గర్భం నుంచి పుట్టిన అగ్రవర్ణం వారంతా శూద్రులు కాకుండా ఎలా ఉంటారూ? ఎవరూ సూటిగా సమాధానం చెప్పరు. నిచ్చెన మెట్ల సంస్కృతికి కాలం చెల్లింది. ‘‘తెలివితక్కువ తనం ఈజ్‌ ఈక్వల్‌ టు భగవంతుడు’’అనే ఫార్ములా ఇచ్చాడు రాహుల్‌ సాంకృత్యాయన్‌! అదెలాగంటే ‘‘నీ తెలివి తక్కువతనాన్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడిభగవంతుడు’’ అనే గౌరవనీయమైన పేరు పెట్టుకున్నావ్‌! అంటే తెలివి తక్కువతనంభగవంతుడితో సమానం అయినట్టే కదా?’’ అన్నది రాహుల్‌ సాంకృత్యాయన్‌ ఉద్దేశం.
` సుప్రసిద్ధ పాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img