Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

లక్షల ఎకరాలు సస్యశ్యామలం చేసిన కాటన్‌ దొర

‘‘నీటివనరులె జాతి సిరులని, జనుల కొరకే మనిన
కారణజన్ముడవు నీవు, ఇది నీవు పెట్టిన దీపమే!’’
సర్‌ అర్థర్‌ కాటన్‌ ఈ పేరు తెలియని తెలుగు వారుండరు. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసి గోదావరి జిల్లాలు దేశానికే అన్నపూర్ణగా పేరు తెచ్చుకునేందుకు ఆ మహనీయుడి దూరదృష్టి, చలువే కారణం. గోదావరి జిల్లాలలోని చాలా గ్రామాల్లో ఇతర దేశ నాయకుల విగ్రహాలున్నా, లేకపోయినా తప్పనిసరిగా కన్పించే విగ్రహం గుర్రం మీద స్వారీచేస్తున్న కాటన్‌ దొర. బ్రిటీషు వారు మన దేశాన్ని వదిలిపెట్టి పోయినా.. ధవళేశ్వరం బ్యారేజి నిర్మించి 170 ఏళ్లు గడిచినా గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో కాటన్‌ దొర ఇంకా చిరంజీవిగా ఉన్నారంటే ఆ కృషి ఎలాంటిదో అర్థమవుతోంది. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి రైతులకు సాగునీరు అందించడంతో పాటు జల రవాణా కోసం కాటన్‌ ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాలుగు పాయలపై ఐదేళ్లపాటు శ్రమించి సుమారు నాలుగు కిలోమీటర్లు పొడవు గల ఆనకట్ట అయిదేళ్ళలో నిర్మాణం పూర్తిచేశారు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ జయంతి సందర్భంగా ఆయన్ని ఒక్కసారి స్మరించుకుందాం.
కాటన్‌ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్‌ సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 1803 మే 15వ తేదీ ఆక్స్‌ఫర్డ్‌లో హెన్రీ కాల్వెలీ కాటన్‌, దంపతులకు పదవ కుమారునిగా జన్మించాడు. వివిధ వృత్తులలో స్థిరపడి జీవనం సాగించిన పదకొండు మంది సోదరులలో కాటన్‌ ఒకడు. బ్రిటీషు సైన్యంలో నీటిపారుదల ఇంజనీరుగా పని చేశారు. 15 సంవత్సరాల వయసులో కాటన్‌ 1818లో మిలటరీలో క్యాడెట్‌ గా చేరి అడ్డిస్కాంబ్‌ వద్ద ఈస్టిండియా కంపెనీ ఆర్టిలరీ ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్‌ ఇంజనీర్స్‌ దళంలో సెకండ్‌ లెఫ్టెనెంట్‌గా నియమితుడై అదే సంవత్సరం మద్రాసు ఇంజనీర్స్‌ దళంలో చేరి మొదటి బర్మా యుద్ధంలో పాల్గొన్నాడు. 1861లో కాటన్‌ సర్‌ బిరుదాంకితుడయ్యాడు. కాటన్‌ 1836-38 సంవత్సరాలలో కొలెరూన్‌ నదిపై ఆనకట్టను నిర్మించాడు. దానితో తంజావూరు జిల్లా మద్రాసు రాష్ట్రంలోనే కాక, యావద్భారత దేశంలోనే ధనధాన్య సమృద్ధికి ప్రథమ స్థానం పొంది ఖ్యాతి చెందింది. గోదావరి జీవనదికి ఇరువైపుల ఉన్న ఉభయ (గోదావరి) జిల్లాలు 18 వ శతాబ్ది వరకు అతివృష్టి వలన వరద ముంపుకు లోనవుతూ, అనావృష్టి వలన కరువుకాటకాలతో విలవిలలాడాయి. 1831-32 లో అతివృష్టి, తుపానులకు లోనయ్యింది. 1833లో అనావృష్టి వలన కలిగిన కరువు వలన 2 లక్షల ప్రజలు మృత్యువు పాలయ్యారు. అలాగే 1839 లో ఉప్పెన-కరువు మరింత మందిని పొట్టన పెట్టుకొంది
ఆ తర్వాత 1847-52 సంవత్సరాలలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేశాడు. కాటన్‌ కృషి చేసి విజయాన్ని సాధించిన ప్రాజెక్టులలో గోదావరి కాలువల నిర్మాణం మొదటిదిగా చెప్పవచ్చు. ఈ కాలువల విభజన, అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు వ్యవసాయంలో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరివాహక జిల్లాలను అత్యంత అభివృద్ది, అధిక వ్యవసాయ దిగుబడుల జిల్లాలుగా మార్చేశాయి. జిల్లాలలోని రైతుల, ప్రజల ఆర్థిక, జీవనగతులను మార్చివేసింది. ఆ ప్రాంతం భారతావనికి అన్నపూర్ణగా ఖ్యాతి నొందింది. క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కళకళలాడిరది. తగ్గిపోతున్న జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది. ఈ మహత్కార్యాన్ని ఆయన కేవలం అయిదేళ్ళలో పూర్తి చేశాడు. కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్టకు ప్రోద్బలం కూడా కాటన్‌దే. ఇంతేకాక ఆయన బెంగాల్‌, ఒడిసా, బిహారు మొదలైన ప్రాంతాల నదులను మానవోపయోగ్యం చేయడానికి ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేశాడు. తెలుగు వారేకాదు తమిళులు, ఒరియాలు, బెంగాలీలు, బిహారీలు… మొత్తం భారతీయులే ఆయనకు శాశ్వత ఋణగ్రస్తులు. గోదావరీ నదికి ఆనకట్ట కట్టి ఆంద్ర దేశానికి ‘అన్నదాత’ గా ప్రసిద్ధి చెందిన కాటన్‌ దొర పాలరాతి విగ్రహాన్ని ఆ నదీ తీరాన్నే ప్రతిష్టించారు. ఆ మహనీయుడు, 1899 జులై 25న బ్రిటన్‌, డోర్కింగ్‌లో మరణించారు. కొన్నేళ్ళ క్రితం కాటన్‌ దొర మునిమనుమడు అయిన రాబర్ట్‌ కాటన్‌, ఆంధ్రదేశానికి వచ్చి, గోదావరీ తీరాన్ని మొత్తం తనివితీరా పరిశీలించి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, కాటన్‌ దొరని స్మరించుకుంటున్న తీరుని చూసి ఆనందబాష్పాలు కార్చారు. ఈ ప్రాంతపు ప్రజల గుండెలలో 170 సంవత్సరాలు గడిచినా నిలచి ఉన్న చిరంజీవి కాటన్‌ దొర. తమ పాలిట దుఖఃదాయినిగా ఉన్న గోదావరిని, ప్రాణహితగా మార్చిన భగీరథుడుగా ఈ రెండు జిల్లాల ప్రజల గుండెల్లో దేవునిలా నిలచి పోయాడు. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానంతరం, పండితులు గోదావరిలో స్నానమాచరించి, ఇలా సంకల్పం చెప్పుకున్నారు.
నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః!
స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం!!
(మాకు గోదావరి నదీ స్నాన పుణ్యాన్ని కలిగించిన అపర భగీరధుడు, ఆంగ్ల దేశీయుడైన కాటన్‌ దొరను ప్రతినిత్యం స్మరించి తరిస్తున్నాము. అని అర్ధం.)

  • నందిరాజు రాధాకృష్ణ, 9848128215

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img