-గతంలో సైకో ఎమ్మెల్యే వలన మంజూరైన రోడ్లు కూడా నిర్మించలేకపోయారు
-ఎమ్మెల్యే పరిటాల సునీత
విశాలాంధ్ర, కనగానపల్లి : గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకంతో ఎవరైనా ఏపీకి రావాలంటే రోడ్లు చూసి భయపడే వారని, ఈ పరిస్థితిలో మార్పు రావాలని సీఎం చంద్రబాబు మిషన్ పాత్ హోల్స్ (రోడ్లపై గుంతలు పూడ్చే) ఫ్రీ ఏపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. కనగానపల్లి సమీపంలోని పండమేరు వంక వద్ద రోడ్లు పూడ్చే కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గుంతల వల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారన్నారు. రోడ్లపై ఒక గంప మట్టి వేసి పూడ్చాలని విజ్ఞప్తులు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాష్ట్రం అంతా ఒక ఎత్తైతే.. రాప్తాడులో మాత్రం ఎమ్మెల్యేగా పని చేసిన సైకో ప్రకాష్ రెడ్డి మంజూరైన రోడ్లను కూడా వేయకుండా అడ్డుకున్నారన్నారు. ఇలాంటి పరిస్థితులన్నీ గమనించి.. ఏపీలో ప్రయాణీకులు పడుతున్న నరకయాతన నుంచి విముక్తి కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా పింఛన్లను పెంచారని.. దీపావళి సందర్భంగా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించారన్నారు. ఎన్నికల హామీల్లో లేకపోయినా.. రాప్తాడు నియోజకవర్గంలో 11 రోడ్లకు రూ.2 కోట్ల 84 లక్షల, 50 వేలు మంజూరు చేశారన్నారు. మొత్తం ఆర్.అండ్.బి పరిధిలో 318 కిలోమీటర్ల పొడవైన రహదారి ఉండగా.. 125.35కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. ప్రస్తుతం 94.2 కిలోమీటర్ల మేర మరమ్మతు పనులను చేపట్టడానికి ప్రభుత్వం రూ.2.5కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. మిగిలిన 31.15 కిలోమీటర్ల దెబ్బతిన్న రోడ్లకు కోటిన్నరతో ప్రతిపాదనలు పంపగా.. కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. వచ్చే సంక్రాంతి నాటికి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో నెట్టెం వెంకటేష్, కన్వీనర్ యాతం పోతులయ్య, తగరకుంట సర్పంచ్ మాధవరాజు తదితరులు పాల్గొన్నారు.