-క్రీడాకారులకు రూ.20వేలు నగదు అందించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
విశాలాంధ్ర-రామగిరి : గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడం అభినందనీయమని, జాతీయస్థాయి జూడో పోటీల్లో కూడా రాణించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత ఆకాంక్షించారు. గత రెండు రెండేళ్ల నుండి జాతీయ స్థాయి జూడో పోటీలలో పాల్గొన్న నసనకోట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులను ప్రోత్సహించడానికి ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ రూ. 20వేలు నగదును అందించి ఉదారతను చాటుకున్నారు. అదేవిదంగా జూడో మాట్స్, జూడో డ్రెస్ లను అందించేందుకు సహకరిస్తామని మాటివ్వగా హెచ్ఎం నాగరత్న, ఉపాధ్యాయులు, పీడీ చామంతి కృతజ్ఞతలు తెలిపారు. జాతీయస్థాయి జూడో పోటీలలో అక్టోబర్ 4నుండి 8వరకు గుజరాత్ లో జరిగిన ఖ/14స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలలో 25కేజీల విభాగంలో జయసింహ రజత పతకం, 40కేజీల విభాగంలో కావ్య నాల్గవ స్థానంలో నిలిచి నసనకోట పాఠశాల కీర్తిని జాతీయస్థాయిలో మారుమ్రోగేలా చేశారన్నారు. ఎస్.జి.ఎఫ్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో జరిగన అండర్-17 రాష్ట్రస్థాయి పోటీలలో 90కేజీల విభాగంలో ముద్దుకృష్ణ బంగారు పతకాన్ని సాధించి జాతీయస్థాయిలో జమ్మూ కాశ్మీర్ లో నవంబర్ 5నుండి 8వరకు జరిగే జూడో పోటీలలో పాల్గొనడం హర్షణీయమన్నారు. 73కేజీల విభాగంలో విజయరాజు వెండి పథకాన్ని సాధించాడు.
వీరితో పాటు గత రెండు సంవత్సరాల నుండి నసనకోట విద్యార్థులు తేజస్విని, మేనక, రఘురామ్ తదితరులు జాతీయస్థాయి జూడో పోటీలలో పాల్గొన్నారు.