Homeకరవుపై చర్చేది?

కరవుపై చర్చేది?

- Advertisement -

18 జిల్లాల్లో విలయతాండవం

  • కర్నూలును కరవు జిల్లాగా ప్రకటించాలి
  • సీమ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
  • కలెక్టరేట్ ముట్టడిలో ఈశ్వరయ్య
  • కదంతొక్కిన సీపీఐ శ్రేణులు

విశాలాంధ్ర బ్యూరో – కర్నూలు: కరవుతో అల్లాడుతున్న రాష్ట్రం గురించి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కరవుపై అసెంబ్లీలో ఎందుకు చర్చించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో 18 జిల్లాల్లో కరవు విలయతాండవం చేస్తోందని చెప్పారు. కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు చెల్లించాలని, రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, కరవు నివారణ చర్యలు చేపట్టి, తెలంగాణ తరహాలో రైతుల రుణాలు మాఫీ చేయాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. సీపీఐ, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం అధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం మంగళవారం జరిగింది. తొలుత జిల్లాపరిషత్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో అగ్రభాగాన ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి కళాకారుడు డపð మాణిక్యం వేసిన రైతు ఆత్మహత్య వేషధారణ ప్రజలను ఆలోచింప చేసింది. కలెక్టరేట్ వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో కరవు విలయతాండవం చేస్తుంటే పాలకులు మొద్దు నిద్రపోతున్నారని విమర్శించారు. రెండు నెలలుగా వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తక రైతులు ఇబ్బందులు పడుతుంటే… ఏ ఒక్క ప్రజాప్రతినిధి ఆ పొలాల వైపు చూడలేదని మండిపడ్డారు. కరవు వస్తే ఒక్క రైతుకే కాదు… దాని ప్రభావం అన్ని సంస్థలపై ఉంటుందన్నారు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ రాజకీయ అనుభవం గల చంద్రబాబునాయుడుకు రాయలసీమ సమస్యలు తెలియవా అని ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో వేదవతి, గుండ్రేవుల, ఆర్‌డీఎస్ ప్రాజెక్టులతోపాటు హంద్రీనీవా, సుజల స్రవంతి ప్రాజెక్టుకు అంతర్గత కాలువలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీమ ప్రాజెక్టులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, పెండింగ్ ప్రాజెక్టుల కోసం కూటమి ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో చెప్పాలన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు విమానాల్లో తిరగడం తప్ప… చేసిందేమీలేదన్నారు. చంద్రబాబు రాయలసీమకు ఏమి చేశారో చెప్పాలన్నారు. తుంగభద్ర నుండి ఏపీకి వస్తున్న నీటిని కర్నాటక వాసులు దోచుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతు రుణాలు మాఫీకి ముందుకు రాని పాలకులు…అదానీ, అంబానీలకు మాత్రం లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు మాఫీ చేస్తున్నారని ఈశ్వరయ్య విమర్శించారు. తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ చేసిందేమీ లేదన్నారు. విభజన హామీలు ఒక్కటీ అమలు చేయలేదని ఆరోపించారు. దేశంలో యువత ఉద్యమాలతో ప్రధాని మోదీ వెన్నులో వణుకు ప్రారంభమైందని, అందుకే దిమాగీ నకస్ల్స్‌ అంటూ కొత్త పల్లవి అందుకున్నారని ఎద్దేవా చేశారు. మోదీ హయాంలో కొత్తగా ఒక్క పరిశ్రమ ఏర్పాటు చేయలేదని, నీటి ప్రాజెక్టుల ఊసేలేదన్నారు. ఉద్యోగ కల్పనలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. రూపాయి విలువ మాత్రం భారీగా క్ష్మీణించిందన్నారు. బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి దేశవ్యాప్తంగా 4.50 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. చివరకు రాముడి పేరుతో దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని సహజ సంపద, ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోందన్నారు. మార్పు రావాలి… మార్పు కావాలి నినాదంతో సెప్టెంబరు 1న చలో దిల్లీ నిర్వహిస్తున్నామని, దీనిని జయప్రదం చేయాలని ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు కె.రామాంజనేయులు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో కరవు విలయతాండవం చేస్తోందన్నారు. జిల్లా మంత్రి, ప్రజాప్రతినిధులు సైతం రైతు సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి రెండుసార్లు జిల్లాకు వచ్చినా రైతు సమస్యలపై స్పందించ లేదన్నారు. జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించకపోతే ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శ ఆవుల శేఖర్, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగనన్నాధం ప్రసంగించారు. అనంతరం డీఆర్‌ఓ వెంకట నారాయణమ్మకు వినతిపత్రం అందచేశారు. అంతకుముందు సీపీఐ, రైతుసంఘం కార్యకర్తలు కలెక్టరేట్ గేట్లు ఎక్కి నిరసన తెలిపారు. సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు ఎస్.మునెప్ప, లెనిన్‌బాబు, రాజాసాహెబ్, రామకృష్ణారెడ్డి, మద్దిలేటి శెట్టి, రంగన్న, కారుమంచి, శ్రీనివాసులు, రాజు, భాస్కర్యాదవ్, విరూపాక్షి, సుదర్శన్, ఎస్.లలితమ్మ, నబీ రసూల్, నాగేంద్రయ్య, మనోహర్ మాణిక్య, క్రిష్ణయ్య, గిడ¦మ్మ, భారతి, తిమ్మయ్య, సోమన్న, షాబీర్ బాషా, వెంకట్రాముడు, నాగరాజు, సి.మహేశ్, ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు