Homeనిధులు వేల కోట్లు…ఖర్చు అరకొర

నిధులు వేల కోట్లు…ఖర్చు అరకొర

- Advertisement -

పీఎం కేర్స్‌ రెండేళ్ల వ్యయం రూ.16 కోట్లే
2023`25 ఆడిట్ నివేదికలు… పారదర్శకతపై ప్రశ్నలు

న్యూఢిల్లీ: కొవిడ్ సమయంలో అత్యవసర సహాయ నిధిగా ‘పీఎం కేర్స్‌ ఫండ్’ను ఏర్పాటైంది. రూ.వేల కోట్లు విరాళాలు వచ్చినప్పటికీ ఖర్చులపై పర్యవేక్షణ లేకపోవడంతో దీనిపై వివాదం కొనసాగుతోంది. పీఎంకేర్స్‌ ఫండ్ తాజా ఆడిట్ నివేదికలు వెలువడ్డాయి. వేల కోట్ల రూపాయలు ఉన్నాగానీ పరిమిత వినియోగం ప్రశ్నలకు తావిస్తోంది. 2025, మార్చి నాటికి పీఎం కేర్స్‌ నిధి రూ.8,452 కోట్లు మురిగిపోయినట్లు ఆడిట్‌తో తేలింది. 202324, 2024`25 ఆడిట్ వివరాలను పీఎం కేర్స్‌ ఫండ్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ప్రారంభమైనప్పటి నుంచే ఈ నిధుల సేకరణ, వినియోగం, పారదర్శకతపై చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే.
2023-25లో పీఎం కేర్స్‌కు రూ.1,162.92 కోట్ల విరాళాలు రాగా, అందులో ఖర్చు రూ.16.47 కోట్లు మాత్రమేనని ఆడిట్ నివేదిక తెలిపింది. 2024-25లో రూ.479.97 కోట్ల విరాళాలు రాగా, కొవిడ్-19 కారణంగా అనాధలైన పిల్లల కోసం రూ.87.85 లక్షలు మాత్రమే ఖర్చుచేశారు. 2023-24లో వచ్చిన రూ.682.94 కోట్ల నుంచి రూ.15.59 కోట్లు మాత్రమే ఖర్చు అయినట్లు నివేదిక పేర్కొంది. 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పీఎం కేర్స్‌ రిసిప్ట్స్‌ అండ్ పేమెంట్స్‌ అకౌంట్‌లో మొత్తం రూ.8,452.06 కోట్లు ఉన్నాయి. ఇందులో రూ.7,846.65 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లుగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 2020 మార్చిలో ఈ నిధిని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.14,766.95 కోట్లు సమకూరాయి. 2024-25 నాటికి రూ.8,133.29 కోట్లు ఖర్చు కాగా, అందులో అత్యధిక ఖర్చు కొవిడ్-19 కాలంలోనే జరిగిందని ఆడిట్ గణాంకాల ద్వారా వెల్లడైంది. కోవిడ్ సమయంలో అత్యవసర నిధిగా ఏర్పాటైన పీఎం కేర్స్‌ (ప్రధానమంత్రి పౌర అత్యవసర సహాయ నిధి)కి ఎక్స్-ఆఫిషియో చైర్మన్‌గా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారు.
2024-25 ఆడిట్ వివరాలు ఎట్టకేలకు వెలువడ్డాయని రూ.8,452 కోట్లకు పైగా మురిగిపోయాయని పారదర్శకత కార్యకర్త అంజలి భరద్వాజ్ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. నిధుల్లో 0.01 శాతమే వినియోగించారన్నారు. రూ.324 కోట్లు సంస్థలకు రీఫండ్ చేసినట్లు ఆమె చెప్పారు. అయితే ఏయే సంస్థలకు, ఎందుకు తిరిగి చెల్లించారన్న వివరాలు వెల్లడి కాలేదన్నారు. నాణ్యతా లోపాలు ఉన్న పరికరాల కొనుగోలుపై బాధ్యత తీసుకోకుండా ఉండేందుకు సంస్థలకు రీ ఫండ్ జరిగిందా అని అంజలి ప్రశ్నించారు. ఆడిట్ నివేదికకు అనుబంధ గమనికలను ఎందుకు అందుబాటులో ఉంచలేదంటూ ఈ నిధి పారదర్శకతపై అంజలి కొన్ని ప్రశ్నలు సంధించారు. విపత్తులప్పుడు ప్రజలకు సాయం చేయడానికి ఏర్పాటు చేసిన ఈ నిధిలో వేల కోట్ల రూపాయలు, విదేశీ వనరుల నుంచి వచ్చిన విరాళాలు ఉన్నప్పటికీ, వ్యవహారాలలో గోప్యత… ఆర్‌టీఐ చట్టం పరిధిలోకి తీసుకురాకపోవడాన్ని ప్రశ్నించారు. తద్వారా ప్రజా పరిశీలనను మోదీ ప్రభుత్వం తప్పించుకుంటున్నట్లు అంజలి భరద్వాజ్ విమర్శించారు.
పీఎం కేర్స్‌కు 2022-23లో రూ.912.21 కోట్లు అందగా, అందులో రూ.439.38 కోట్లు ఖర్చు అయ్యాయి కోవిడ్ సమయంలో తమ తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం రూ.346 కోట్లు, లక్ష ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల కొనుగోలుకు రూ.91.87 కోట్లు వినియోగించారు. అయితే ఆ తర్వాత విరాళాలు క్రమంగా తగ్గిపోయాయి. 2020-21లో అత్యధికంగా రూ.7,678.68 కోట్లు రాగా, అదే ఏడాది రూ.3,976.17 కోట్లు ఖర్చు చేశారు. 2021-22లో రూ.1,936.88 కోట్లకుగాను రూ.3,716.29 కోట్లు ఖర్చు అయినట్లు గణాంకాలు పేర్కొన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు