Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

కర్ణాటకలో వరద పరిస్థితి, నష్టాలపై ప్రధాని ఆరా

బెంగళూరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకి ఫోన్‌ చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితిపై ఆరా తీశారు. భారీ వర్షాల కారణంగా పంట నష్టం, ప్రాణనష్టంపై ప్రధాని తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో అవసరమైన సామం, సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ట్వీట్‌ చేసింది. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రధానికి రాష్ట్రప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలను వివరించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో అల్పపీడనం, వాయుగుండం కారణంగా కర్ణాటకలో ఈ నెలలో భారీ వర్షాలు కురిశాయి. నవంబర్‌ ఒకటి నుంచి 21 వరకు కురిసిన వర్షాలకు 24 మంది ప్రాణాలు కోల్పోగా, 658 ఇళ్లు పూర్తిగా, 8,495 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి, దాదాపు 200 జంతువులు మృతి చెందాయి. ఇటీవల కురిసిన వర్షాలకు 3,79,501 హెక్టార్లలో పంటలు, 30,114 హెక్టార్లలో సాగుచేసిన కూరగాయలు, పండ్లు దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా 2,203 కి.మీ రోడ్లు, 165 వంతెనలు, కల్వర్టులు, 1,225 పాఠశాలలు, 39 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దెబ్బతిన్నాయని కర్ణాటక రాష్ట్ర సహజ విపత్తు నిర్వహణ అథారిటీ (కేఎస్‌ఎన్‌డీఎంఎ) కమిషనర్‌ మనోజ్‌ రాజన్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img