Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

ప్రజల మధ్యకు వెళ్లండి`ప్రజాసంఘాలు నిర్మించండి

సీపీఐ రాష్ట్రసమితి సమావేశాల్లో దిశ`దశ

పార్టీ సభ్యులను రాజకీయంగా చైతన్యం చేయాలి. వారికి ఆర్థిక పోరాటాలే కాకుండా మన కార్మికవర్గ దృక్పథాన్ని అలవర్చాలి. మన పార్టీ చాలా మంచి నిర్ణయాలు చేస్తుంది. అయితే వాటిని అమలు జరపడంలో విఫలమవుతోంది. పార్టీ నిర్మాణాన్ని సరిదిద్దే కార్యక్రమం పైనుంచి కిందవరకు జరగాలి. మననిర్మాణ సూత్రాలను అమలు పరచటంలో కార్యకర్తలు ముందుకు రావాలి. సమస్యలపై ప్రజాపోరాటాలు నిర్మిస్తూ మరొక పక్క విప్లవకర పార్టీ నిర్మాణాన్ని తీసుకు వెళ్లాలని విశాఖలో జరిగిన పార్టీ రాష్ట్రసమితి నిర్ణయించింది.

రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఈ నెల 13 తేదీల్లో భారత కమ్యూనిస్టుపార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యవర్గం, సమితి సమావేశాలు జరిగాయి. కార్యవర్గ సమావేశానికి బాలేపల్లి రమణ, సమితి సమావేశానికి పైడి రాజు అధ్యక్షత వహించారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి సమితి సభ్యులకు మంచి ఏర్పాటు చేశారు. పార్టీ జాతీయ కార్యదర్శి డా.కె. నారాయణ తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు, బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ విధానాలపై మాట్లాడారు. రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు, సీపీఐకు వచ్చిన ఓట్లుపార్టీ నిర్మాణంపై నివేదిక ప్రవేశపెట్టారు. రానున్న కాలంలో పార్టీని ఎలా విస్తరించాలి, పార్టీ నిర్మాణంలో ఉన్న లోపాలు, పార్టీ సభ్యత్వం, పార్టీ శాఖ పనివిధానంపై రామకృష్ణ కూలంకషంగా మాట్లాడారు. ఈ అంశాలపై సమితిసభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం, కార్యవర్గం తరతమ భేదాలు లేకుండా నిర్మోహమాటంగా చర్చించారు. చివరకు సమితి సభ్యులందరు కలిసి విప్లవకర సమరశీల పార్టీ నిర్మాణమే తక్షణ కర్తవ్యమన్న నిర్ధారణకు వచ్చారు. కామ్రేడ్‌ లెనిన్‌ చెప్పినట్లు ప్రజల మధ్య నివసించటం, ప్రజల భావాలు తెలుసుకోవడం, ప్రజలను అర్థం చేసుకోవడం సంపూర్ణ ప్రజావిశ్వాసాన్ని చూరగొనటం పార్టీ కార్యకర్తలు అలవర్చుకోవాలని సమితి నిర్ణయించింది. ప్రతి గ్రామంలో పార్టీ శాఖను నిర్మించాలి. యువకులను, విద్యార్థులను, కార్యకర్తలను, వ్యవసాయ కార్మికులను, పేద రైతాంగాన్ని పార్టీ సభ్యులుగా చేర్చుకోవాలి ముఖ్యంగా మహిళలపై దృష్టి కేంద్రీకరించి పార్టీ నిర్మాణంవైపుగా కదిలించాలి.
ప్రతి నెలా శాఖ సమావేశం జరపాలి. శాఖ సమావేశాల్లో ప్రజా సమస్యలపై నివేదికలు ఇవ్వాలి. సమస్యలను చర్చించేందుకు ఆయా పార్టీ బాధ్యులు సహాయపడాలి. ప్రతి గ్రామంలో కార్మికరంగం, వ్యవసాయ కార్మికసంఘం, రైతుసంఘం తప్పనిసరిగా నిర్మాణం ఉండేలా చూడాలి. తప్పనిసరిగా కమ్యూనిజం పత్రికను తెప్పించాలి. పార్టీ శాఖను నిర్మాణం వైపునకు తీసుకు వెళ్లాలంటే అంత సులభంకాదు. దీనిపై విరామ మెరుగని శ్రమ చేయాలి. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను మనం నిరంతరం కలిగి ఉండాలంటే శాఖ నిర్మాణం తప్పవేరే గత్యంతరం లేదు.
లెనిన్‌ మాటల్లో చెప్పాలంటే ‘‘బూర్జువా పార్టీలకు డబ్బు, అధికారం, ప్రతి ఒకటి ఉన్నాయి. వారికిలేనిది మనకు ఉన్నది పార్టీ నిర్మాణం, రాజకీయ చైతన్యం’’ అత్యవసరం. సిద్ధాంతం, రాజకీయాలు, నిర్మాణం ఇవి మన పార్టీకి కీలకమైన అంశాలు. ఇది జరగాలంటే పార్టీ సభ్యులను, నాయకత్వాన్ని అంటే శాఖ కార్యదర్శి, మండల, నియోజకవర్గ, పట్టణ కార్యదర్శులను నిరంతరం సిద్ధాంత రీత్యా, రాజకీయంగాను అభివృద్ధి పరచాలి. చైతన్య వంతులను చేయాలి. పార్టీ పోరాటాలతో కదిలించాలి. ఇది నిరంతర ప్రక్రియగా జరగాలి. దీనికి రాష్ట్ర కార్యదర్శి వర్గం, కార్యవర్గం బాధ్యత వహిస్తుంది.
పార్టీ హోల్‌టైమర్స్‌పై రాష్ట్ర సమితి చర్చించింది. విప్లవకర కమ్యూనిస్టు పార్టీకి హోల్‌టైమర్స్‌ గుండెకాయలాంటివారు. హోల్‌టైమర్స్‌ లేని పార్టీ విప్లవకర పార్టీ కాజాలదు. హోల్‌టైమర్స్‌ విత్తనం లాంటి వారని కె.నారాయణ అన్నారు. వారికి ఒక రంగంలో బాధ్యతనిస్తే అక్కడ ప్రజాసమస్యలపై పోరాటం, ప్రజాపునాది, నిర్మాణం తీసుకురావాలి. అదేవిధంగా నిధి సేకరించే స్థాయి రావాలి.
విద్యార్థి, యువజన రంగాలపై దృష్టిపెట్టాలని కె.రామకృష్ణ నొక్కిచెప్పారు. యువ కామ్రేడ్లను గుర్తించాలి. శిక్షణ ఇవ్వాలి. నాయకత్వం వారిని ప్రోత్సహించాలి. అనువైన సమయంలో ప్రమోట్‌ చెయ్యాలి. వారి కనీస ఆర్థిక అవసరాలు మనం తీర్చాలి. యువ క్యాడర్‌ను కాపాడుకోవడం, శిక్షణ ఇవ్వటం పార్టీకి అత్యంత కీలకం.
పార్టీనిధి అంశంపై కూడా సమితి చర్చించింది. పార్టీ నిధి సమీకరణ పార్టీ నిర్మాణ కర్తవ్యాలలో ఒక ముఖ్యభాగం. ప్రతిపార్టీ సభ్యుడు క్రమం తప్పకుండా ఒక రోజు వేతనం అందించాలి. నిధి వసూలులో పార్టీ ఆయా నాయకత్వం కార్పొరేట్‌ వ్యక్తుల మీద ఆధార పడకూడదు. ప్రజలకు పార్టీ గురించి చెప్పి నిధి వసూలు చేయాలి. ఇంటింటికి విరాళ కార్యక్రమం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చేయాలి. రాష్ట్ర కార్యదర్శి వర్గం, కార్యవర్గం నిధి వసూలలో ఉండాలి.
చివరిగా గత ఐదు సంవత్సరాలుగా జగన్‌ ప్రభుత్వంపై అనేక పోరాటాలు నిర్వహించాం. వివిధ ప్రచారాందోళనలు చేశాం. కాని మన ఓట్లు శాతం తగ్గింది. మన ముందున్న లక్ష్యం పార్టీ సభ్యత్వంపై సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించాలి. పార్టీ సభ్యులను రాజకీయంగా చైతన్యం చేయాలి. వారికి ఆర్థిక పోరాటాలే కాకుండా మన కార్మికవర్గ దృక్పథాన్ని అలవర్చాలి. మన పార్టీ చాలా మంచి నిర్ణయాలు చేస్తుంది. అయితే వాటిని అమలు జరపడంలో విఫలమవుతోంది. పార్టీ నిర్మాణాన్ని సరిదిద్దే కార్యక్రమం పైనుంచి కిందవరకు జరగాలి. మననిర్మాణ సూత్రాలను అమలు పరచటంలో కార్యకర్తలు ముందుకు రావాలి. సమస్యలపై ప్రజాపోరాటాలు నిర్మిస్తూ మరొక పక్క విప్లవకర పార్టీ నిర్మాణాన్ని తీసుకు వెళ్లాలని విశాఖలో జరిగిన పార్టీ రాష్ట్రసమితి నిర్ణయించింది. అందుకే జులై మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా జనరల్‌బాడీలు నిర్వహించి పార్టీ సభ్యులలో ఆలోచన తీసుకురావాలని రాష్ర ్టపార్టీ నిర్ణయించింది.
సీపీఐ జాతీయ సమితి సభ్యులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img