పిల్లలు లేరన్న విమర్శలపై హారిస్ దీటైన సమాధానం
వాషింగ్టన్: అర్కాన్సాస్ గవర్నర్ సారా హుకాబీ శాండర్స్ విమర్శలపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తీవ్రంగా స్పందించారు. ఇది 1950ల నాటి కాలం కాదని, కుటుంబం అనేది రకరకాలుగా ఏర్పడుతుందని అమెరికా అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ వ్యాఖ్యానించారు. ఉన్న ఇద్దరు పిల్లలను తాను చనిపోయేవరకు ప్రేమిస్తూనే ఉంటానని అన్నారు. హారిస్‌కు పిల్లలు లేరని, అందుకే ఆమె అణకువగా ఉండరని గవర్నర్ సారా హుకాబీ శాండర్స్ విమర్శించారు. దీనిపై కమల తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఈ మేరకు ‘కాల్ హర్ డాడీ’ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. గతంలోనూ కమల ఈ తరహా వ్యక్తిగత విమర్శలు ఎదుర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘పిల్లలు లేని మహిళల దైనందిన జీవితం దయనీయంగా ఉంది. వారు దేశాన్ని కూడా అలాగే దయనీయంగా మార్చాలని అనుకుంటారు. ఇది వాస్తవం. కమలా హారిస్‌నే చూడండి. డెమోక్రాట్ల భవిష్యత్తును పిల్లలు లేని వ్యక్తులు నియంత్రిస్తున్నారు. దేశానికి సంబంధించి ప్రత్యక్ష వాటా లేని ఇలాంటి వ్యక్తుల చేతిలో అధికారం పెట్టడంలో అర్థం లేదు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆమెకు కొంతమంది మద్దతుగా స్పందించారు. ఆమె సవతి కుమార్తె… వాన్స్‌కు దీటుగా బదులిచ్చారు. కమలాహారిస్ భర్త పేరు డగ్లస్ ఎంహాఫ్. డగ్లస్, కెర్స్టిన్కు జన్మించిన పిల్లలే కోలె, ఎల్లా. వారికి కమలతో అనుబంధం ఉంది. దానిని ఉద్దేశించి ఎల్లా స్పందించారు. ‘కోలె, నేను ఉండగా మీరు పిల్లలు లేనివారు ఎలా అవుతారు? నా ముగ్గురు తల్లిదండ్రులను నేను ప్రేమిస్తున్నాను’ అని ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చారు. ఎల్లా తల్లి కెర్స్టిన్ కూడా వాన్స్ వ్యాఖ్యలను ఖండిరచారు. ‘గత పదేళ్లుగా నా పిల్లలు టీనేజ్ వయసులో ఉన్నప్పటినుంచి మాతో పాటు కమల కూడా వారి బాధ్యతలు చూస్తున్నారు. వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఈ కుటుంబంలో ఆమె కూడా ఉన్నందుకు సంతోషంగా ఉంది’ అని గతంలో హారిస్‌కు మద్దతు తెలిపారు.