Thursday, October 24, 2024
Thursday, October 24, 2024

చీప్‌ లిక్కర్‌ వచ్చేసింది !

మందుబాబులకు పండగే

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మందుబాబులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రూ.99కే చీప్‌ లిక్కర్‌ను బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల్లోకి అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఒక్కో మద్యం దుకాణానికి 3 నుంచి 8 కేసులు మాత్రమే సరఫరా చేస్తున్నారు. మంగళవారం రాత్రికే మద్యం దుకాణాలకు రూ.99కే చీప్‌ లిక్కర్‌ దుకాణాలు చేరుకున్నట్లు యాజమానులు చెబుతున్నారు.షార్ట్స్‌ పేరుతో బ్రాందీ, విస్కీ విక్రయాలు చేపడుతున్నారు. పూర్తిస్థాయి సరుకు వచ్చేంత వరకు వాటిని కొంత వరకే విక్రయించనున్నారు. నూతన మద్యం పాలసీని ఇటీవల ప్రభుత్వం ప్రారంభించింది. నాణ్యమైన మద్యం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో భాగంగా గతంలో ఉన్న బ్రాండ్లను తీసుకొచ్చింది. గత ప్రభుత్వ హయాంలో నాసిరకం బ్రాండ్ల విక్రయం, అధిక ధరలకు విక్రయించారన్న విమర్శలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వ మద్యం దుకాణాలు తొలగించి, వాటి స్థానంలో ప్రైవేట్‌ దుకాణాలు ఏర్పాటు చేసింది. ఈనెల 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 3936 దుకాణాల్లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో చీప్‌ లిక్కర్‌ అందుబాటులోకి రాలేదు. వారం రోజుల తర్వాత దానిని ప్రవేశపెట్టడంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో క్వార్టర్‌ బాటిల్‌ రూ.200 నుంచి రూ.250 వరకు ఖర్చు చేయాల్సి వచ్చేదని, రోజు వారీ సంపాదనలో సగం దానికే ఖర్చు చేయాల్సి వచ్చేదని, ఇప్పుడు రూ.99కే క్వార్టర్‌ బాటిల్‌ రావడంతో సంతోషంగా ఉందన్నారు. కొంత చీప్‌ లిక్కర్‌కు కేటాయించి… మిగిలిన సొమ్ము ఇంట్లో ఇచ్చేందుకు అవకాశముంటుందని చెబుతున్నారు. గతంలో తాగిన మద్యంతో అనేకమంది అనారోగ్యాలకు గురై చనిపోయినట్లు పేర్కొంటున్నారు. మద్యం దుకాణాల్లోకి పాత బ్రాండ్లు రావడం, తక్కువ ధరకే చీప్‌ లిక్కర్‌ ప్రవేశపెట్టడంతో మందుబాబులు ఊరట చెందుతున్నారు. చీప్‌ లిక్కర్‌ మినహా మిగిలిన మద్యం బ్రాండ్ల ధరల్లో ఏ మాత్రం మార్పులేదు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న ధరలతోనే దాదాపుగా విక్రయిస్తున్నారు. కేవలం చీప్‌ లిక్కర్‌నే రూ.99కి విక్రయించి… నాణ్యమైన బ్రాండ్ల ధరలు యథాతథంగా ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్ల మద్యం ధరలు ఎక్కడ తగ్గించినట్లని మందుబాబులు ప్రశ్నిస్తున్నారు. మద్యం దుకాణాలను ప్రైవేట్‌కు అప్పగించింది. టెండర్ల ద్వారానే దాదాపు రూ.1800 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. పాత బ్రాండ్ల ధరలతో అమ్మకపు పన్ను రూపేనా ప్రభుత్వానికి భారీగా ఆదాయం రానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img