Wednesday, October 30, 2024
Wednesday, October 30, 2024

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే అలగనూరుకు గండి…!

-:వ్యవసాయం అంటే అర్థం తెలియని వ్యక్తి జగన్
-: కట్ట తెగిపోతే ఐదేళ్లలో కన్నెత్తి చూడని వైనం
-: అలగనూరు రిజర్వాయర్ ను పరిశీలించిన సిపిఐ బృందం
-: కట్టకు మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలి
-: నంద్యాల జిల్లా కలెక్టర్ చొరవ అభినందనీయం
-: సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు

విశాలాంధ్ర, మిడుతూరు-: రాష్ట్రంలో గత ఐదేళ్ల పరిపాలన సాగించిన వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అలగనూరు రిజర్వాయర్ కు గండి పడిందని
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా బుధవారం నంద్యాల జిల్లా నందికొట్కూర్ నియోజకవర్గం మిడుతూరు మండల పరిధిలోని అలగనూరు రిజర్వాయర్ ను సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు తోపాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే.రామాంజనేయులు , నంద్యాల జిల్లా సిపిఐ కార్యదర్శి ఎన్. రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, కార్యవర్గ సభ్యులు వి.రఘురాం మూర్తి , రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న , రమేష్ లు పరిశీలించారు. కట్ట తెగిన ప్రాంతాన్ని పరిశీలించి కట్ట మరమ్మత్తులు చేపట్టి రైతులకు సాగు,త్రాగునీరు అందించాలని ఆందోళన చేపట్టారు . ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ అలగనూరు రిజర్వాయర్ కు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శంకుస్థాపన చేశారని, అలగనూరు రిజర్వాయర్ కు 3,585ఎకరాల భూ సేకరణ చేసి 2.965 టీఎంసీల నీటి సామర్థ్యంతో రిజర్వాయర్ ను నిర్మించడం జరిగిందన్నారు. మూడు మండలాల రైతులకు గ్రామాల ప్రజలకు మరియు నందికొట్కూరు మున్సిపాలిటీ పట్టణానికి నీటి సరఫరా చేసే విధంగా నిర్మించారని తెలిపారు. కృష్ణా నది నుండి కేసీ కెనాల్ ద్వారా నీటిని రిజర్వాయర్ లో నింపడం జరుగుతుందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలంలో నిర్మించారు . వైయస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో ప్రారంభించారు . జగన్ పాలనలో కట్టతెగిపోయింది . నీరు లేకుండా ఎండిపోయిందని నాలుగు సంవత్సరాల నుండి ఇప్పటివరకు రిజర్వాయర్ కళ తప్పిపోయింది అన్నారు .అయితే దురదృష్టం ఏమిటంటే 1 లక్ష 845 ఎకరాలకు సాగునీరు అందించే అద్భుతమైన అలగనూరు రిజర్వాయర్ కు జగన్ చేతగానితనం మూలంగా బాధ్యత రహితం, రైతు ,వ్యవసాయం అనే పదాలకు అర్థం తెలియని వ్యక్తి జగన్ అన్నారు.2018 లో రిజర్వాయర్ ఆనకట్ట తెగిపోతే ఐదేళ్ల ప్రభుత్వ కాలంలో ఓడిపోయేదాకా అటువైపు కన్నెత్తి చూడని ఏకైక వ్యక్తి జగన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం రెండు లేదా మూడు కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి పనులు చేసి ఉండినట్లయితే రిజర్వాయర్ కింద లక్ష ఇరవై వేల ఎకరాల భూములు సాగులో ఉండేయన్నారు. అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రిజర్వాయర్ ఎండిపోయి పంటల సాగు ప్రశ్నార్థంగా మారింది అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టులకు పారిశ్రామీకరణకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తుందని తెలిపారు. అందులో భాగంగా అలగనూరు రిజర్వాయర్ కు కట్ట తెగిపోయిన ప్రాంతంలో నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య, తుంగభద్ర ప్రాజెక్టుల గేట్లు కొట్టుకపోయే పరిస్థితి ఏర్పడిందంటే జగన్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమన్నారు. బటన్ నొక్కుడు తప్ప రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు . ప్రాజెక్టు గేట్లు ఎలా కొట్టుకపోయావో అలాగే వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి కొట్టుకపోయిందని విమర్శించారు. అలగనూరు రిజర్వాయర్ పనులు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , రాష్ట్ర జలవనురుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ని నవంబర్ నెలలో కలిసి ప్రాజెక్టుల విషయాలపై చర్చించి పనులు పూర్తి చేయాలని కోరుతామన్నారు. లేనిపక్షంలో ఈ ప్రాంత రైతాంగాన్ని కూడగట్టి సిపిఐ ,రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం నంద్యాల జిల్లా సిపిఐ కార్యదర్శి ఎన్ .రంగనాయుడు మాట్లాడుతూ అలగనూరు రిజర్వాయర్ 2018-19 లో 500 మీటర్లు ఆనకట్ట తెగిపోతే జగన్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని రైతులు ఆందోళన చేసిన పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు . నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వమైన పూర్తిచేయాలనే లక్ష్యంతో సిపిఐ మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ముందుకెళ్తున్నామని ఉమ్మడి కర్నూలు జిల్లాలో హంద్రీనీవాను రాష్ట్ర పార్టీ కార్యదర్శి, రాష్ట్ర నాయకులు అంతా పరిశీలించడం జరిగిందన్నారు. నంద్యాల జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రధానమైన అలగనూరు రిజర్వాయర్ నిర్మాణ పనులు దీనిని పూర్తి చేయాలనే ఏకైక లక్ష్యంతో సిపిఐ నాయకులు ముందుకు వెళ్తున్నారు . అలగనూరు రిజర్వాయర్ దుస్థితిపై ఈ ప్రాంత రైతుల పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అలగనూరు రిజర్వాయర్ ను స్వయంగా పరిశీలించి తెగిపోయిన ఆనకట్ట మరమ్మతులకై ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం అభినందనీయమని సిపిఐ నాయకులు రైతులు సంతోషం వ్యక్తం చేశారు.కలెక్టర్ కృషికి ఆమెకు మద్దతుగా రిజర్వాయర్ నిర్మాణంపై రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి సిపిఐ బృందం తీసుకెళ్తామన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే.రామాంజనేయులు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హాయంలో నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణము , ఇతర మౌలిక సదుపాయాలపై ఏమాత్రం శ్రద్ధ చూపలేదు అన్నారు .తరతరాలుగా వెనకబాటుకు గురవుతున్న రాయలసీమ ప్రాంతాన్ని కృష్ణా ,తుంగభద్ర నీటితో ఎత్తిపోతల పథకాలు ఏర్పరిచి ఈ ప్రాంత ప్రజలకు సాగు ,త్రాగునీటిని అందించేందుకు ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసి కరువు సీమను సస్యశ్యామలం చేయాలన్నారు. అలగనూరు రిజర్వాయర్ పై ఆధారపడి రెండు వేల మత్స్యకార కుటుంబాలు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారన్నారు. ఐదు సంవత్సరాలుగా రిజర్వాయర్ ఆనకట్ట తెగిపోవడంతో ఒట్టిపోయిన రిజర్వాయర్ వల్ల మత్స్యకారుల జీవితాలు కూడా ఒట్టిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా తుంగభద్ర నీరు సముద్రం పాలు కాకుండా ఒడిసిపట్టి రాయలసీమ ప్రాంతంలో కరువు లేకుండా చూడాలన్నారు. సిపిఐ బృందం వెంట రైతు సంఘం నాయకులు సుబ్బారెడ్డి , పిక్కిలి వెంకటేశ్వర్లు మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి రజితమ్మ, ఏఐఎస్ఎఫ్ నాయకులు వినోద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img