అమెరికన్లను మధ్యపెట్టేందుకు ట్రంప్ పూర్వకాల వ్యూహాలు
కమ్యూనిజాన్ని రాజకీయ అస్త్రంగా మల్చుకున్న మాజీ అధ్యక్షుడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధీష్టించేందుకు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆత్రుతగా ఉన్నారు. నవంబరు 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల ప్రచారం హోరాహోరీగా సాగింది. డెమొక్రాట్ల తరపున కమలా హారిస్ జోరు మీద ఉన్నారు. ఇటు రిపబ్లికన్ల తరపున ట్రంప్ దూకుడు సాగిస్తున్నారు. దీంతో నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికలు జరగనున్నాయి.
ఈ పరిస్థితుల్లో మార్క్సిస్టులు, కమ్యూనిస్టులను అమెరికాకు శుత్రువులుగా ట్రంప్ ప్రచారం చేస్తున్నారు. ‘అంతర్గత శత్రువులు, ఫాసిస్టులు, మార్స్కిస్టులు, కమ్యూనిస్టులు… వీరు రష్యా, చైనా, ఇతరుల కంటే ప్రమాదకరం’ అని అక్టోబరులో జునియో, విస్కాన్సిస్ ర్యాలీలో ట్రంప్ ఉద్ఘాటించారు. డెమొక్రటిక్ పార్టీకి దీటుగా ప్రచారం చేసేందుకుగాను అమెరికా ఎదుర్కొనే సమస్యలన్నింటికీ మార్స్కిస్టులే కారణమన్నట్లుగా చెబుతున్నారు. కమలా హారిస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు, ఆమె వ్యాఖ్యలు, విమర్శలను తిప్పికొట్టేందుకు నిర్మాణాత్మక వ్యూహాలతో ముందుకెళ్లలేని పరిస్థితుల్లో మార్క్సిస్టులు, కమ్యూనిస్టులను బూచీగా చూపి పబ్బం గడుపుకోవాలని ట్రంప్ యత్నించారు. కమ్యూనిజాన్ని రాజకీయ అస్త్రంగా మల్చుకుంటున్నారు. అయితే ఈ వ్యూహాన్ని అనుసరించే క్రమంలో మాజీ అధ్యక్షుడి బృందం కొన్ని కీలక అంశాలను పట్టించుకోలేదు. అందులో మొదటిది… ఎరుపు రంగుతో జనాన్ని భయపెట్టే వ్యూహం డొనాల్డ్ ట్రంప్ అంత పాతది. కమ్యూనిజం ఏమీ బూచీ కాదని ప్రజలు గ్రహించారు. పేదరికం, దారిద్య్రం, బూర్జువ రాజ్యం నుంచి బయట పడేందుకు ఇదొక్కటే మార్గమని ఇప్పటికే అనేక దేశాలు గ్రహించాయి. ఆచరించి ఫలితాలు సాధించాయి. గ్రీస్‌లో కమ్యూనిస్టుల విజయం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. బూర్జువవాదంపై నమ్మకాన్ని ప్రజలు కోల్పోతున్నారు. శ్రామిక వర్గం జీవితాలను మెరుగుపరుస్తామన్న హామీని నిలబెట్టుకోవడంలో పెట్టుబడిదారీ వర్గం పూర్తి స్థాయిలో విఫలమవుతుండటంతో ప్రజలకు కనువిప్పు కలిగింది. కమ్యూనిజానికి ఆదరణ పెరిగింది. డొనాల్డ్ట్రంప్ వ్యాఖ్యలకు పొంతన ఉండదు. కమ్యూనిస్టులకు, ఫాసిస్టులకు మధ్య బేధాన్ని ఆయన గుర్తించలేరు. వలసవాద విధానానికిగాను డెమొక్రాట్లను ఫాసిస్టులుగా ముద్ర వేసిన ట్రంప్… ప్రతీకార, ప్రమాదక, ఫాసిస్టు సిద్ధాంతాలను అనుసరించే యూరప్‌లోని మతవాద పార్టీలనూ అదే కోవలో లెక్కగడుతుంటారు. పొంతనలేని వ్యాఖ్యలు చేయడంలో, అస్పష్ట ప్రకటనలు చేయడంలో తనకు తానే సాటి అంటూ అమెరికా ప్రజలకు ట్రంప్ నిరూపించారు.
రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ప్రస్తుతమున్న ప్రజాస్వామిక వ్యవస్థలు పనిచేస్తున్నాయని ట్రంప్, ఆయన మేధావి వర్గం చెబుతోంది. తమ కొత్త నిరంకుశ పాలనా విధానాలతో విభేదించే ఎవరినైనా అడ్డుతొలగించుకునేందుకు మానవహక్కులను అత్రికమించేందుకూ ట్రంప్ వర్గీయులు వెనుకాడరు. వీటిని ట్రంప్ ప్రతిఘటనగా సమర్థించుకుంటారు. శత్రువులు అంటూ ట్రంప్ చేసే వ్యాఖ్యలను తేలికగా తీసుకోరాదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తేగనుక అమెరికాలో పక్షాళన పర్వానికి అవకాశం ఉండటమే కాకుండా 1950 దశకంలో వామపక్ష ఉద్యమాల్లో మెక్ కార్తియిజంను గుర్తుచేసే పద్ధతులు ఉంటాయా అన్న ప్రశ్న తెరపైకొచ్చింది. అదే సమయంలో కమలా హారిస్ రక్షకురాలని చెప్పలేం. ఎవరు గెలిచినా అమెరికన్లకు అవసరమైన నిజమైన ప్రజాస్వామ్యాన్ని అందించలేరన్న సంకేతాలున్నాయి.