Friday, June 14, 2024
Friday, June 14, 2024

జిల్లాకు భారీ వర్ష సూచన.. అధికారులంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి

. ఆయా శాఖల పరిధిలో కార్యాచరణ ప్రణాళిక అమలు చేసి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి
. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర – అనంతపురం : రాబోయే మూడు, నాలుగు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని విధాల సిద్ధంగా ఉంటూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి (ఐఏఎస్) ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో వచ్చే 3, 4 రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, ఏర్పాట్లపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలు వస్తే ఏం చేయాలి అనే దానిపై ఆయా శాఖల పరిధిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. తహసిల్దార్లు, వీఆర్వోలు, వీఆర్ఏలు వర్షాలు వస్తున్నవేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలియజేయాలని, చెరువులు, వాగులు, వంకల్లో నీటి ప్రవాహ స్థాయిలను తెలపాలని, నిత్యవసరాలను, పాలు, నీళ్లు విలువ ఉంచుకునేలా చూడాలన్నారు. ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలన్నారు. ఆర్డీవో, తహసిల్దార్ కార్యాలయాల్లో రేడియో సౌకర్యం కల్పించాలన్నారు. వ్యవసాయ శాఖ పరిధిలో వరి, మొక్కజొన్న పంటలు కోత సమయంలో ఉండడంతో నీరు నిల్వంచకుండా రైతాంగం చూసుకోవాలని, రైతులకు అవసరమైన టార్ఫాలిన్ లను అందించాలన్నారు. గ్రామ, మండల స్థాయిలో నాయకులతో సమావేశాలు నిర్వహించుకుని వర్షాలపై, జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. వర్షాలపై కమాండ్ కంట్రోల్ నుంచి మానిటర్ చేయాలన్నారు. పశువులు చనిపోకుండా షెడ్డులో పెట్టుకునేలా రైతులను అప్రమత్తం చేయాలని, ఆర్టీసీ బస్సులు కల్వర్టులు, కాజ్వేలలో వెళ్లకుండా డ్రైవర్ లకు అవగాహన కల్పించడం చేయాలని ఆదేశించారు. భారీ వర్షం వల్ల విద్యుత్ పోల్స్ పడిపోయినా త్వరితగతిన మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో ఒక టీం ఏర్పాటు చేసి ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనం సిద్ధంగా ఉంచుకొని ఇబ్బంది వస్తే వెంటనే రెస్పాన్స్ అవ్వాలని, డ్రైనేజీ పూడిక, పడిపోయిన చెట్ల తొలగింపు ఎప్పటికప్పుడు చేయాలన్నారు. నీటి ప్రవాహం ఎక్కువైనప్పుడు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉందని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. రెవెన్యూ అధికారులు పోలీసు వారితో ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ లో ఉండాలని, వారికి అవసరమైన సహకారం అందించాలన్నారు. వచ్చే 48 గంటల్లోపు జిల్లాలోని ఎఫ్.పి షాపులకు రేషన్ సరఫరా చేయడం పూర్తి చేయాలన్నారు. గతంలో నీటి ప్రవాహాలకు గురైన లోతట్టు ప్రాంతాల్లో తహసిల్దార్లు సమావేశం నిర్వహించి భారీ వర్షాలపై ప్రజలకు తెలియజేయాలని, గుత్తిలో భారీ వర్షం పై అవగాహన పెంచాలన్నారు. జిల్లా అధికారులంతా వారి శాఖ పరిధిలో వల్నరబుల్ ప్రాంతాలను గుర్తించి పర్యటించాలని, అర్బన్ ప్రాంతాల్లో డ్రైనేజీలను శుభ్రం చేయించాలన్నారు. వర్షాల వల్ల కల్వర్టులు వెంటనే తెగిపోయే అవకాశం ఉందని, రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన మట్టి, కంకర సిద్ధంగా పెట్టుకోవాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో చేతిపంపుల మరమ్మతులు పూర్తి చేయాలని, ఉపాధి హామీ కింద హెచ్.ఎల్.సి కాలువలో డీసిల్టింగ్ పనులు చేపట్టాలన్నారు. వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, జిల్లా అధికారులు కార్యచరణ ప్రణాళిక ప్రకారం పని చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, అడిషనల్ ఎస్పీ విజయభాస్కర్ రెడ్డి, ఆర్డీఓలు రాణిసుస్మిత, వి.శ్రీనివాసులు రెడ్డి, జి.వెంకటేష్, డిపిఎం ఆనంద్, డిప్యూటీ కలెక్టర్లు వసంతబాబు, వెన్నెల శ్రీను, కరుణ కుమారి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, సిపిఓ అశోక్ కుమార్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ జెడి సుబ్రహ్మణ్యం, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం సుమంత్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేంద్ర, సివిల్ సప్లై డిఎం రమేష్ రెడ్డి, డిఎస్ఓ శోభారాణి, డిఆర్డిఏ పిడి నరసింహారెడ్డి, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, డీఈఓ వరలక్ష్మి, ఇంచార్జ్ డిఎంహెచ్వో డా.సుజాత, డిసిహెచ్ఎస్ పాల్ రవికుమార్, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ దేశేనాయక్, హెచ్ఎల్సి ఎస్ఈ రాజశేఖర్, హార్టికల్చర్ డిడి నరసింహారావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్డి పివిఎస్ఎన్ మూర్తి, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, మెప్మా పీడీ విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img