జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
విశాలాంధ్ర – అనంతపురం : నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చిన్నారి క్రిస్టినా సియారా పేరు నమోదు చేయడం జిల్లాకు ఎంతో గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా, గుంతకల్లు పట్టణం మోదీనాబాద్ కు చెందిన రైల్వే ఉద్యోగి (ఎలక్ట్రికల్ శాఖ) పి.సుధాకర్, సింధుల దంపతులకు 4 నెలల చిన్నారి క్రిస్టినా సియారా ఫ్లాష్ కార్డ్‌లను ( ఆల్ఫాబిట్స్, అనిమల్స్, ఫ్రూట్స్, బర్డ్స్ లాంటివి) గుర్తించడంలో అతి చిన్న వయస్సు కలదిగా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసింది. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ చాంబర్లో చిన్నారి క్రిస్టినా సియారాతో కలిసి తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ ని కలిశారు. చిన్నారిని వెరీ గుడ్ అంటూ జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… చిన్నారిని సాధారణ అమ్మాయిలా పెంచాలని తల్లిదండ్రులకు సూచించారు. చిన్నారికి ఎంతో ప్రతిభ ఉందని, భవిష్యత్తులో కూడా చిన్నారికి ప్రోత్సాహం అందించాలన్నారు. చిన్నారి తల్లితండ్రులు మాట్లాడుతూ 149 ఫ్లాష్ కార్డ్‌లను గుర్తించి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చిన్నారి క్రిస్టినా సియారా పేరు నమోదు చేసిందన్నారు. ఇంతకుముందు కర్ణాటక కు చెందిన పాప 125 ఫ్లాష్ కార్డ్‌లను గుర్తించిందని, ఆ పాప రికార్డును చిన్నారి బ్రేక్ చేసిందని తెలిపారు. ఈనెల 7వ తేదీన చిన్నారి 3 నెలల 15 రోజుల వయస్సులో వరల్డ్ రికార్డ్ నెలకొల్పిందని నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికేషన్ రావడం జరిగిందన్నారు. తమ చిన్నారిని అభినందించడం పట్ల జిల్లా కలెక్టర్ కి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, గుంతకల్లు ఆర్డీవో శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు.