. వ్యవసాయమంత్రిగా అచ్చెన్నాయుడు బాధ్యతల స్వీకరణ
. ఆరు కీలక ఫైళ్లపై తొలి సంతకం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర జనాభాలో 62 శాతం పైగా ఉన్న రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు, రాష్ట్ర జీడీపీలో 35 శాతం వాటా అందజేసే వ్యవసాయ అనుబంధ రంగాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 23 నుండి ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమం అనంతరం రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యత చేపట్టిన వెంటనే వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన ఆరు ఫైళ్లపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతుల పట్ల పూర్తిస్థాయిలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిందని, కనీసం భూసార పరీక్షలు కూడా నిర్వహించకుండా వ్యవసాయ శాఖకు తాళాలు వేసిందని విమర్శించారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన ఐదారు మాసాలకు కూడా డబ్బులు చెల్లించ లేని దుస్థితిలో గత ప్రభుత్వం ఉందన్నారు. కౌలు రైతులకు కార్డులు జారీచేసి రుణాలు అందజేయడమేకాకుండా… వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ప్రతి ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో నాలుగు మాసాల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణకు అవసరమైన అన్ని రకాల వ్యక్తిగత వ్యవసాయ పరికరాలను, పనిముట్లను రైతులకు అందజేస్తామన్నారు. మత్స్యకారులకు జీవనాధారమైన చేపల చెరువులు లాక్కునేందుకు గత ప్రభుత్వం జారీచేసిన జీఓలు 144, 217లను రద్దుచేస్తూ సంతకం చేశానన్నారు.