Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

ప్రజాధనాన్ని దోచుకునే వారు ప్రజా ప్రతినిధులు కాకూడదు

అన్ని మత విశ్వాసాలను కమ్యూనిస్టులు గౌరవిస్తారు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి.కోటేశ్వరరావు
విజయవాడ: బ్యాంకులకు రూ.5,700 కోట్లు ఎగనామమం పెట్ట్టిన వారు…ఇళ్లు కట్టుకునే వారిని నుంచి డబ్బులు దండుకునే వారిని ప్రోత్సహిస్తూ ప్రజాధనాన్ని దోచుకునే వ్యక్తులు ప్రజాప్రతినిధులు కాకూడదని ఇండియా కూటమి బలపర్చిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి.కోటేశ్వరరావు అన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు కంచర్ల జయరాజ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ తాను 1981 నుంచి ఒకే జెండా, ఒకే అజెండాతో పని చేస్తున్నానని చెప్పారు. విద్యార్థి దశలో ఏఐఎస్‌ఎఫ్‌ నగర కార్యదర్శిగా అనంతరం రాష్ట్ర అధ్యక్షుడుగా ఎదిగానని చెప్పారు. కార్మిక ఉద్యమనేత శేఖర్‌బాబు మరణానంతరం తాను ఏఐటీయూసీ కార్మిక సంఘ నాయకుడుగా పని చేశానన్నారు. 2005లో నగరపాలక సంస్థ ఎన్నికల్లో 29వ డివిజన్‌ నుంచి కార్పోరేటర్‌గా ఎన్నికై అనేక అభివృద్ధి పనులు చేసిన్నట్లు తెలిపారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నిధులు రూ.24 కోట్లు తీసుకువచ్చి భవానీపురం, విద్యాధరపురం ప్రాంతాలను అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. తాను ప్రచారానికి వెళ్లినప్పుడు కమ్యూనిస్టులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని ప్రజలు స్వచ్ఛందంగా ఆలోచన చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. టి.వెంకటేశ్వరరావు, లంకా గోవిందరాజులు, ఐయితా రాములు మేయర్లుగా ఉన్న కాలంలో కొండ ప్రాంతంలో అభివృద్ధి చేయటం జరిగిందన్నారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఒకరు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఒకరు పోటీ చేస్తున్నారన్నారు. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ 2014 ఎన్నికల్లో సందర్భంగా ఇచ్చిన హామీలను నల్లధనాన్ని వెనక్కు తీసుకువచ్చి ప్రజల ఖాతాల్లో రూ.15లక్షలు జమ చేయటం, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామనటం వంటి అనేక హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ప్రభుత్వ రంగం సంస్థల్ని ప్రైవేటీకరిస్తున్నట్లు తెలిపారు. నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు వంటి చర్యలతో వ్యాపారాలు తిరోగమనంలో ఉన్నాయన్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌లతో అభివృద్ధి చేయటం కంటే అరాచకాలను పురిగొల్పటానికి దోహదపడుతుందన్నారు. మణిపూర్‌లో క్రైస్తవులపై దాడి చేసి 155 చర్చలను కూల్చేశారన్నారు. మహిళలను వివస్త్రలను చేసి వారి కళ్లముందే వారి తండ్రి, సోదరుడ్ని నరికి చంపేశారని చెప్పారు. ఈ విషయాలు ప్రపంచానికి తెలియకుండా దాచేందుకు ఇంటర్నేట్‌ను నిలిపేశారని తెలిపారు. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థి ముస్లిం రిజర్వేషన్‌ల రద్దు అంశంపై తన వైఖరి స్పష్టం చేయాలన్నారు. ప్రజలు కూడా ఆయన నుంచి హామీ పత్రం తీసుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం బీజేపీతో అంటకాగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కనీసం కౌన్సిలర్‌ కూడా లేని బీజేపీ కేంద్రంలో ప్రవేశపెట్టే ఎన్‌ఆర్‌సీ, సీఏఏ వంటి కీలక బిల్లులకు సైతం వైసీపీ, టీడీపీలు మద్దతు ఇస్తున్నాయన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన,వైసీపీలు ఒకరిపై ఒకరు విమర్శించుకుంటున్నా ఢల్లీిలో మోదీకి దాసోహం అంటున్నారని చెప్పారు. అంబేద్కర్‌ రాజ్యాంగం ద్వారా ప్రజలకు హక్కులు కల్పించారన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని చెప్పారు. దీని కోసం లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సి ఉందన్నారు. అందుకోసం ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలు నిత్యావసరాల ధరలు బాగా పెంచేశాయన్నారు. ప్రపంచ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు పెరగకపోయినా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిన కారణంగా దాని ప్రభావం నిత్యావసరలపై పడిరదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా,ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. దీంతో రాష్ట్రంలో ఆర్థికంగా దివాళా తీసిందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి అనేది ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ధరలు పెంచేశారని, బాదుడే..బాదుడు..అంటూ దీర్ఘాలు తీసి ప్రచారం చేసిన జగన్‌మోహన్‌ రెడ్డి ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్‌ చార్జీలు ఏడు సార్లు పెంచారని, ఆర్టీసీ చార్జీ పెంచారని చెప్పారు. విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల సందర్భంగా వైసీపీ అధికారంలోకి వస్తే పన్నుల భారం వేస్తారని తాము చెప్పితే కమ్యూనిస్టులు తప్పుడు ప్రచారం చేస్తారని వెలంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారని చెప్పారు. కార్పోరేషన్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 196, 197 జీవోలు ద్వారా ఇంటి పన్నులు పెంచారని గుర్తు చేశారు. ఒకే పన్ను వేయాలని ఉంటే పన్నులను విభజించి రకరకాలుగా వసూలు చేస్తున్నారన్నారు. ప్రతిఏటా 15శాతం పన్నులు పెంచుతున్నారని, చెత్తపన్ను వేస్తున్నారని చెప్పారు. ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి పన్నులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ స్వార్ధం కోసం బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారాలు వేస్తున్నాయన్నారు. చట్ట సభలలో ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగత విమర్శలు చేయటం. కుటుంబ సభ్యులు, మహిళలను కించపరుస్తున్నారని చెప్పారు. ప్రజల గొంతుకను చట్టసభల్లో వినిపించేందుకు ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తనకు ‘కంకికొడవలి’ గుర్తుపై ఓటు వేసి గెలిపంచాలని విజ్ఞప్తి చేశారు. లాగే విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థి సీహెచ్‌.బాబూరావుకు ‘సుత్తికొడవలినక్షత్రం’ గుర్తుపై, విజయవాడ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి నాంచారయ్యకు, విజయవాడ పార్లమెంటుకు కాంగ్రెస్‌ అభ్యర్థి వల్లూరు భార్గవ్‌కు ‘హస్తం’ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
తాను ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే పశ్చిమ నియోజకవర్గంలో కొండప్రాంతంలో, దిగువ ప్రాంతంలోని ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లకు కృషి చేస్తానన్నారు. డిపాజిట్లు చెల్లించిన టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు ఇళ్లు ఇప్పిస్తానన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణకై ప్రత్యామ్నా రోడ్లు అభివృద్ధికి చర్యలు చేపడతానని చెప్పారు. పంజా సెంటర్‌ నుంచి రైల్వే స్టేషన్‌ తూర్పువైపునకు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం,పాతబస్తీలో షేక్‌ రాజా ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయటం, ప్రయాణికులు సౌకర్యార్ధం విద్యాధరపురంలో బస్‌టెర్మినల్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. సయ్యద్‌ అప్పలస్వామి కాలేజీ నుంచి రథం సెంటర్‌ వరకు ఘాట్‌ రోడ్డు నిర్మాణం, కొండ ప్రాంతంలో జనాభాకు తగినట్లుగా వాటర్‌ పైపులైన్‌ పున:నిర్మాణం, ఎర్రకట్ట అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని వివరించారు.
అనంతరం విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ కమ్యూనిస్టులు మత విద్వేషాలు రెచ్చగొట్టి దాడులు చేయటాన్ని వ్యతిరేకిస్తారని, అన్ని మత విశ్వాసాలను గౌరవిస్తారని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు కార్పోరేషన్‌లో అధికారంలో ఉన్నప్పుడు అమ్మవారి గురి ఏరియా డివిజన్‌లలో వామపక్షాల అభ్యర్థులే కార్పోరేటర్లుగా ఉన్నారని చెప్పారు. కులాల మధ్య అంతర్గత విబేధాలు సృష్టించి ఓట్లు రాబట్టుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, ముఖ్యమంత్రి తాను పేదవాడ్ని అని ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు మాత్రమే కాదు జర్నలిస్టులకు ఇబ్బందులు వచ్చినా కమ్యూనిస్టులు వారి తరుపున పోరాటం చేస్తారని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో పర్యాటక అభివృద్ధి కృషి చేస్తానన్నారు. జన సంఖ్యలో బలహీనంగా ఉన్నా ప్రజల పక్షాన పోరాడే విషయంలో కమ్యూనిస్టులు బలంగా ఉన్నారని చెప్పారు. వైసీపీ కార్పోరేటర్ల అవినీతి ఎమ్మెల్యే అభ్యర్థికి శాపంగా మారే అవకాశం ఉందన్నారు.
ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే, విజయవాడ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో జి.కోటేశ్వరరావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్‌, అర్బన్‌ యూనిట్‌ అధ్యక్షుడు చావా రవి, ప్రెస్‌క్లబ్‌ కార్యదర్శి దాసరి నాగరాజు, ఐజేయూ నాయకులు ఎస్‌కే.బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img