Wednesday, October 30, 2024
Wednesday, October 30, 2024

జగన్‌పై హత్యాయత్నం కేసు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజద్రోహం చట్టం కింద తనను అరెస్టు చేసి వేధించారని ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు జగన్‌తో పాటు సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్‌కుమార్‌ తదితర అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఏ1గా పీవీ సునీల్‌కుమార్‌, ఏ2గా మాజీ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, ఏ3గా మాజీ ముఖ్యమంత్రి జగన్‌, ఏ4గా నాటి ఏఎస్పీ విజయ్‌పాల్‌, ఏ5గా గుంటూరు జీజీహెచ్‌ మాజీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి పేర్లు చేర్చారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రఘురామకృష్ణరాజు ఈమెయిల్‌ ద్వారా గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదయింది. మే 14, 2021లో హైదరాబాద్‌లోని తన ఇంటి వద్ద సీఐడీ అధికారులు తనను అక్రమంగా అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారని, ఆ సమయంలో ఎంపీగా ఉన్న తనకు వర్తించే నియమ నిబంధనలు పాటించలేదని, లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ నుంచి ఏపీ సీఐడీ కార్యాలయానికి తరలించి, విచారణ పేరుతో తనపై దాడి చేసి, హత్యాయత్నం చేశారని, ఆస్పత్రిలోనూ వైద్యులు తప్పుడు నివేదికలు ఇచ్చారన్న ఆరోపణలను ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలాఉండగా, రఘురామకృష్ణరాజును అడ్డుపెట్టుకుని జగన్‌పై కక్ష సాధింపు చర్యలతోనే కూటమి నేతలు కేసు నమోదు చేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
రఘురామకృష్ణరాజు అరెస్టుకు దారితీసిన పరిస్థితులు
నరసాపురం వైసీపీ ఎంపీగా రఘురామకృష్ణరాజు 2019 ఎన్నికల్లో గెలుపొందారు. గెలిచిన కొద్ది నెలలకే వైసీపీ అధినాయకత్వంతో ఆయనకు విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వ కాల పరిమితి ముగిసేంత వరకు ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. వైసీపీని విభేదించిన సమయం నుంచి రఘురామకృష్ణరాజు ఆ పార్టీ అధినేత జగన్‌, ముఖ్య నేతలు, కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల వేదికగా వ్యక్తిగత దూషణలకు దిగారు. దిల్లీ, హైదరాబాద్‌లో ఆయన ఉండి, రచ్చ బండ పేరుతో ఆయన కొన్ని టీడీపీ అనుకూల ఛానళ్ల ద్వారా వైసీపీ ప్రభుత్వ విధానాలపైన, జగన్‌పైన తీవ్రంగా దుమ్మెత్తిపోశారు. వైసీపీలోనే ఉంటూ… ప్రతిపక్ష టీడీపీ కంటే దూకుడుగా వ్యవహరించి మీడియాలోను, సోషల్‌ మీడియాలోను నిరంతరం వార్తల్లో నిలిచారు. దీంతో రఘురామకృష్ణరాజుపై ఏపీ సీఐడీ సుమోటోగా తీసుకుని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, రాజద్రోహం కేసు పెట్టింది. హైదరాబాద్‌లో ఉన్న రఘురామకృష్ణరాజును గుంటూరులోని ఏపీ సీఐడీ కార్యాలయానికి తరలించారు. కస్టడీ సమయంలోనే తనపై దాడి చేశారని, హత్యకు పాల్పడ్డారని ఆ సమయంలోనే రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. బెయిల్‌ పొందిన అనంతరం ఆయన దిల్లీకే పరిమితమయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీ సీటు ఆశించి భంగపాటుకు గురయ్యారు. అనంతరం ఆయన టీడీపీలో చేరి ఉండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెనువెంటనే రఘురామకృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్‌ స్పందించారు. నాడు ఇదే కేసు సుప్రీం కోర్టులో మూడేళ్లు నడిచిందని, సుప్రీం కోర్టు తిరస్కరించిన కేసుపై కొత్తగా ఎఫ్‌ఐఆర్‌ ఎలా నమోదు చేస్తారంటూ సునీల్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు. ఈ కేసు నమోదును వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. అటు సోషల్‌ మీడియాలో సునీల్‌ కుమార్‌ ఈ విధంగా పోస్టు పెట్టడాన్ని టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదుపై ఈ రకమైన పోస్టులు పెట్టడం ప్రభుత్వాన్ని ధిక్కరించడమేనని, ఇది ఆల్‌ ఇండియా కాండక్ట్‌ రూల్స్‌లోని రూల్‌ నంబరు 7ను ఉల్లంఘించడమేనని అంటున్నారు. సోషల్‌ మీడియాలో చేసిన పోస్టును పరిగణనలోకి తీసుకుని సునీల్‌కుమార్‌ను సస్పెండ్‌ చేయాలని టీడీపీ డిమాండ్‌ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img