Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

అంతులేని అమరావతి కథ

తెలుగు మాట్లాడే వారు రెండు రాష్ట్రాలుగా విదిపోయి 2022 జూన్‌ రెండు నాటికే ఎనిమిదేళ్లు దాటింది. విభజన చట్టం ప్రకారం రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌కు ఈ పాటికి నూతన రాజధాని ఏర్పడి ఉండవలసింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతే రాజధాని అన్న నిర్ణయానికి వచ్చారు. ఈ నిర్ణయం సకల విషయాలూ ఆలోచించి తీసుకున్నారా లేదా అన్న చర్చ అప్పుడూ జరిగింది. రాజధాని ఎక్కడైతే బాగుంటుందో సూచించడానికి శివరామ కృష్ణయ్య కమిటీ సిఫార్సును అప్పుడు చంద్రబాబు పట్టించుకోలేదు. అమరావతిలో రాజధాని నిర్మాణం అన్న చంద్రబాబు ప్రతిపాదన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌కు నచ్చలేదు. అంటే రాజధాని నిర్మాణం రాజకీయ నిర్ణయమే. చంద్రబాబు హయాంలో అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం రైతులు వ్యవసాయ భూములను ప్రభుత్వానికి అప్పగించారు. శాసనసభ, హైకోర్టు లాంటి కొన్ని వసతులూ ఏర్పడ్డాయి. అమరావతిలో రాజధాని నిర్మాణం ఎందుకు అనువు కాదు అన్న అభిప్రాయాలు అప్పుడే వ్యక్తమైనాయి. భూమి తీసేసుకోవడం, కొన్ని భవనాలు నిర్మించడం కూడా పూర్తి అయింది. రాజధాని నిర్మాణం పూర్తి అయితే అక్కడి ప్రజలకు దక్కుతాయను కున్న ప్రయోజనాలు ఇప్పటికీ దక్కనే లేదు. వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించిన రోజే రివర్స్‌ టెండర్ల ప్రస్తావన తేవడంతో అప్పటివరకు కొనసాగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకున్నట్ట యింది. 50 వేల కోట్ల రూపాయల పనులు స్తంభించాయి. ముఖ్యమంత్రి జగన్‌ 2019 డిసెంబర్‌ 17న మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు. అమరావతిలో శాసన రాజధాని అంటే చట్ట సభలుÑ విశాఖపట్టణంలో కార్యనిర్వహణ అంటే ప్రభుత్వ కార్యాలయాల్లాంటివిÑ కర్నూలులో న్యాయ రాజధాని అంటే హైకోర్టు మొదలైనవి ఉంటాయని జగన్‌ అన్నారు. అప్పటి నుంచి స్థానికుల్లో అలజడి బయలుదేరింది. సోమవారం నాటికి ఈ నిరసనకు వెయ్యి రోజులు పూర్తి అయ్యాయి. అయినా ఫలితం లేకపోవ డంతో సోమవారం నుంచి అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి దాకా రెండో దశ మహాపాద యాత్ర మొదలైంది. ఇది ప్రధానంగా ఆ ప్రాంత రైతులు నిర్వహిస్తున్నదే అయినా వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ మినహా మిగతా రాజకీయ పార్టీల మద్దతు ఉంది. ఈ యాత్రకు డీజీపి అనుమతించ లేదు. రైతులు హైకోర్టుకెక్కి అనుమతి సాధించుకోవలసి వచ్చింది. ఈ సుదీర్ఘ పోరాటం పొడవునా అరెస్టులు, కేసులు మోపడం, వేధింపులు, నిర్బంధాలు విచ్చలవిడిగా సాగాయి. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే హక్కు ప్రజలకు లేదు అన్నట్టుగా అత్యంత అప్రజాస్వామికంగా ప్రభుత్వం వ్యవహ రించింది. అయినా రైతులు రాజధాని రక్షణ, నిర్మాణమే లక్ష్యంగా ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. మధ్యలో హైకోర్టు కలగజేసుకుని అమరావతిలో అభివృద్ధి పనులు ఆరు నెలలలోగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఆ గడువూ ముగిసింది. ఉలుకూ లేదు. పలుకూ లేదు. రాజధానికోసం భూము లిచ్చారన్న భావన కూడా లేకుండా వారిని గౌరవించడానికి బదులు చితగ్గొట్టడం నిఖార్సైన దమన కాండే. 2019 డిసెంబర్‌ 20న రిలే నిరాహార దీక్షలు ప్రారంభమైనాయి. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఉద్యమంలో మహిళలు క్రియాశీల పాత్ర పోషించడం గమనించదగింది. ఇంకా విచిత్రం ఏమిటంటే 2021లోనే మూడు రాజధానుల ప్రతిపాదిన విరమిస్తున్నట్టు జగన్‌ ప్రకటించారు. అక్కడితో ఆగకుండా హైకోర్టులో ప్రమాణ పత్రం కూడా దాఖలు చేశారు. అదే రోజు ఈ మేరకు బిల్లు కూడా ఆమోదింప చేశారు. అయినా జగన్‌ మంత్రివర్గంలోని వారు ఇంకా మూడు రాజధానుల ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. ఇది రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది.
గత ఏడాది రైతులు హైకోర్టు నుంచి తిరుపతి దాకా పాద యాత్ర చేశారు. ఇది నాలుగు జిల్లాల ద్వారా సాగింది. వివిధ రాజకీయ పక్షాల వారు పాదయాత్ర చేస్తున్న వారికి సదుపాయాలు కల్పించడం, వారితో కలిసి నాలుగడుగులు వేయడం చూస్తే రైతుల ఉద్యమం నిష్కారణం కాదని పిస్తోంది. అసలు ఒక సమస్య పరిష్కరించుకోవడానికి మూడేళ్లకు పైగా ఆందోళన కొనసాగడమే అపూర్వం. న్యాయం చేస్తామని అప్పుడప్పుడూ ఏదో గుర్తొచ్చినట్టు ప్రభుత్వ పెద్దలు ప్రకటిస్తూనే ఉన్నారు. కాని ఆ న్యాయం రూపురేఖలు ఏమిటో, దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటో మాత్రం ఎవరూ చెప్పరు. హైకోర్టు కలగజేసుకోవడానికి ముందే మూడు రాజధానుల బిల్లును విరమించుకున్న తరవాత మళ్లీ మళ్లీ ఆ ప్రస్తావన ఎందుకో తెలి యదు. రాజధాని ఎక్కడ నిర్మించాలన్న నిర్ణయం తీసుకోవడం సవ్యంగా లేకపోవచ్చు. అనేక విమర్శలు తలెత్తి ఉండవచ్చు. అయినా రాజధాని నిర్మాణం పని కొంత మేర సాగింది. కానీ జగన్‌ అధికారంలోకి వచ్చిన తరవాత చంద్రబాబు నాయుడు నిర్మించుకున్న ఇంటికి దగ్గర్లోని ప్రజావేదిక కూల్చడంతో విధ్వంసం ప్రారంభమైంది. ఇప్పుడు అధికార పక్షానికి చెందిన కొందరు ఇదివరకు చర్చకొచ్చి, నలిగిపోయి, అపరిష్కృతంగా మిగిలిపోయిన అంశాలనే చర్విత చర్వణంగా ప్రస్తావిస్తున్నారు. ఒక సామాజికవర్గం ఆధి పత్యం కోసమే అమరావతి నిర్మించారని, చంద్రబాబు ఇన్సైడర్‌ ట్రేడిరగ్‌ కు పాల్పడ్డారని, ఆ ప్రాంతంలో భవన నిర్మాణ పనులు చాలా ఖర్చుతో కూడు కున్న వ్యవహారమనీ, ముక్కారు పంటలు పండే చోట రాజధాని నిర్మిస్తే ఆహార భద్రతకు లోటు వస్తుందని పాత వాదనలనే సరికొత్త రాగంతో ఆల పిస్తున్నారు. ఈ కారణాలన్ని సబబే అనుకుందాం. ఈ సమస్యలకు విరుగు డేమిటో చెప్పాల్సింది ప్రభుత్వమే కదా. కనీసం ఆ విషయం చర్చకైనా తీసుకురావాలిగదా! గతంలో జరిగింది తప్పు అనుకునేటట్టయితే ఒప్పు ఏమిటో చేసి చూపించాలిగా! మూడు రాజధానుల పేరుతో విశాఖ పట్టణం, కర్నూలు లాంటి ప్రాంతాలను మెరుగు పరిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. పరిపాలన వికేంద్రీకరణే ప్రభుత్వ లక్ష్యమైతే ఆ విషయం ప్రజలతో, నిపుణులతో, వివిధ రాజకీయ పక్షాలతో సంప్రదించవచ్చు. అలాంటి ప్రయత్నం ఒక్క సారైనా జరగలేదు. ప్రభుత్వ ఆలోచన జీర్ణమంగే సుభాషితం రీతిలో ఉంటే ఆందోళన ఆగుతుందా? పరిపాలన వికేంద్రీకరణ అవసరమే. అయితే అసలు రాజధానే లేకుండా తాత్సారం చేయడం, జరిగిన నిర్మాణ కార్యక్రమాన్ని కూడా పక్కన పడేయడంÑ విశాఖ, కర్నూలు నగరాల అభి వృద్ధికి ఏమీ చేయకపోవడం అయితే ప్రభుత్వ అసమర్థతైనా కావాలి లేదా మునుపటి ప్రభుత్వ నిర్ణయం మింగుడు పడకుండానైనా ఉండాలి. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడివడి కర్నూల్‌ రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎదురైన సమస్యలను పరిశీలించే వారే లేరా? ఉన్నట్టుండి ఆంధ్రులందరూ వెళ్లిపోండి అని అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి రాజాజీ మూడు రోజుల గడువు మాత్రమే ఇచ్చిన వైనాన్ని గుర్తు చేసేవారే కరువా? ప్రత్యామ్నాయం చూపకుండా నిశ్చేష్టంగా ఉండిపోవడం ఏ ప్రభుత్వానికైనా మంచిది కాదు. రైతుల యాత్రను అడ్డగిస్తే వారిని రెచ్చగొట్టినట్టే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img