Free Porn manotobet takbet betcart betboro megapari mahbet betforward 1xbet Cialis Cialis Fiyat
Monday, June 17, 2024
Monday, June 17, 2024

కల్లోలం రేపిన ఉపకార వేతనాలు

ఆర్థిక వెసులుబాటు లేకపోవడంవల్ల పై చదువులు చదివే వారికి నిరోధకంగా ఉంటుంది. అల్పసంఖ్యాక వర్గాల వారిని ఈ వెనుకబాటుతనం మరింతగా బాధిస్తుంది. ఈ ఆటంకాన్ని తొలగించడానికి 2009లో అప్పటి యు.పి.ఎ ప్రభుత్వం మౌలానా ఆజాద్‌ జాతీయ ఫెలోషిప్‌ పేరిట ప్రత్యేక ఉపకారవేతనాలు ప్రవేశ పెట్టింది. వీటివల్ల లబ్ధి పొందుతున్నవారు ఇతర ఉపకారవేతనాలు కూడా అందుకుంటున్నారన్న నెపంతో మోదీ ప్రభుత్వం వీటిని ఈ మధ్య రద్దు చేసేసింది. తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా ఆజాద్‌ ముస్లిం కావడం, మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలలో సహజంగా ముస్లింలు అధికంగా ఉంటారు కనకే మోదీ ప్రభుత్వం వీటిని రద్దు చేసినట్టు కనిపిస్తోంది. దేశ జనాభాలో 14.2శాతం మంది ఉన్న ముస్లింల్లో కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో చేరే ముస్లిం విద్యార్థులు మాత్రం కేవలం 5.5శాతం ఉన్నారు. దేశ జనాభాలో 16.5శాతం ఉన్న షెడ్యూల్డ్‌ కులాలవారిలో ఉన్నతవిద్య అభ్యసిస్తున్న వారు 14.7శాతం ఉన్నారు. ఉన్నత విద్యకు సంబంధించి షెడ్యూల్డ్‌ తెగలవారి పరిస్థితి కూడా మెరుగ్గానే ఉంది. 2019లో ఉన్నత విద్య గురించి నిర్వహించిన సర్వేలో ఈ పరిస్థితి వెల్లడైంది. మౌలానా ఆజాద్‌ జాతీయ ఉపకార వేతనం నిజానికి మైనారిటీ వర్గాల వారందరికీ వర్తిస్తుంది. ఈ ప్రయోజనంపొందే వారిలో ముస్లింలే ఎక్కువగా ఉండడానికి కారణం ఇతర అల్ప సంఖ్యాక వర్గాలవారితో పోలిస్తే ముస్లింలు అధిక సంఖ్యాకులు కావడమే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2018-19లో మౌలానా ఆజాద్‌ పేరిట నెలకొల్పిన ఉపకార వేతనాల్లో వెయ్యి మంది వీటిని వినియోగించు కుంటే అందులో 733 మంది ముస్లింలే కావడం సహజంగానే మోదీ సర్కారుకు అభ్యంతరకరమై ఉండొచ్చు. ఈ ఉపకార వేతనాలను రద్దు చేసినందుకు విద్యాసంస్థల లోపల, వెలుపల తీవ్రనిరసన వ్యక్తం అవు తోంది. ప్రభుత్వ నిర్ణయం అల్పసంఖ్యాక వర్గాల, ముఖ్యంగా ముస్లింల విద్యావకాశాలను దెబ్బ తీయడానికేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పనిగట్టుకుని బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నిర్ధారణకు రావడానికి ప్రత్యేక పరిశోధన అనవసరం. గత 12వ తేదీన వందలాది మంది విద్యార్థులు దిల్లీలో విద్యాశాఖ ఎదుట నిరసన ప్రదర్శనలు చేశారు. పోలీసులు నిరసనను అనుమతించకుండా వారందరినీ పోలీసు వాహనాల లోకి ఎక్కించి దగ్గరలోఉన్న పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి కొన్ని గంటల తరవాత వదిలేశారు. ఈ ఉపకార వేతనాలరద్దు అంశాన్ని రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యుడు ఇమ్రాన్‌ ప్రతాప్‌ గఢీ, బహుజన సమాజ్‌ పార్టీకి చెందిన డానీష్‌ అలీ, మజ్లిస్‌కు చెందిన ఇంతియాజ్‌ జలీల్‌ లేవనెత్తారు.
అల్పసంఖ్యాక వర్గాలవారి వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి 2005లో అప్పటి యూపీఏప్రభుత్వం దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రాజీందర్‌ సచార్‌ కమిటీ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2006లో సమర్పించిన నివేదికలో ముస్లింలు, సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా ఇతర మతాలవారితో పోలిస్తే బాగా వెనుకబడి ఉన్నారని తేలింది. కొందరు ముస్లింల పరిస్థితి దళితుల కన్నా హీనంగా ఉందని సచార్‌ కమిటీ పేర్కొంది. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశజనాభాలో 20 ఏళ్లకు పైబడిన వారిలో 7శాతం ఉన్నతవిద్య అభ్యసిస్తూ ఉంటే ముస్లింలలో మాత్రం ఇది కేవలం నాలుగుశాతం మాత్రమే ఉందని సచార్‌ కమిటీ నివేదిక ఆందోళన వ్యక్తంచేసింది. అవకాశాలు తక్కువగా ఉన్న ఇతర వర్గాల వారితో పోల్చిచూసినా ముస్లింల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని సచార్‌ కమిటీ తెలియజేసింది. ఆ కమిటీ సిఫార్సు పర్యవసానంగానే మౌలానా ఆజాద్‌ జాతీయ ఉపకార వేతనాల పథకం అమలులోకి వచ్చింది. ఇది ముస్లింలకేకాక అల్పసంఖ్యాక మతాల వారందరికీ వర్తిస్తుంది. విద్యార్థులు ఒకటికన్నా ఎక్కువ ఉపకార వేతనాలు అందుకుంటున్నందువల్ల మౌలానా ఆజాద్‌ ఉపకార వేతన పథకాన్ని రద్దు చేస్తున్నామని గత ఎనిమిదవ తేదీన అల్పసంఖ్యాక వ్యవహారాలశాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారు. విద్యార్థులకు వివిధ పథకాల కింద ప్రయోజనంపొందే అవకాశంఉన్నా ఒక ఉపకార వేతనం మాత్రమే అందిస్తున్నారు. మౌలానా ఆజాద్‌ ఉపకార వేతన పథకాన్ని ఎక్కువగా వినియోగించుకుంటున్నది పి.హెచ్‌.డి పరిశోధక విద్యార్థులే. పరిశోధక విద్యార్థులకు జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ పథకాన్నీ వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే ఇది ప్రతిభ ఉన్నవారికే వర్తిస్తుంది. అంతగా ప్రతిభ లేనివారికి మౌలానా ఆజాద్‌ పథకం ఉపకరించేది. ఈ పథకం రద్దు చేశారు గనక ఇతర మైనారిటీవర్గాల వారు పరిశోధనలు కొనసాగించే అవకాశం మందగిస్తుంది. ఈ పథకం ఆసరాగానే అనేకమంది పరిశోధనలు చేయగలిగారు. పరిశోధన మీద ఆసక్తి ఉన్న వారికి ఉపకార వేతనాలు అందితే ఉద్యోగావకాశాలను కూడా వదులుకుని ఉన్నత విద్య కొనసాగించగలుగుతారు. ఆ అవకాశం లేకపోతే ఉన్నతవిద్య ఆర్థిక స్తోమత ఉన్నవారికే పరిమితం అవుతుంది. మౌలానా ఆజాద్‌ పథకం రద్దుచేయక ముందు కూడా ఈ పథకం కింద విశ్వ విద్యాలయాల నిధుల సంఘం(యు.జి.సి.) దరఖాస్తులు ఆహ్వానించడాన్ని మందగింపు చేసింది. ఈ పథకం కింద ఆఖరుసారి దరఖాస్తులు ఆహ్వానించింది 2018లోనే. దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారా అని 2020 మార్చిలో లోకసభలో ప్రశ్నఅడిగితే అప్పటి మైనారిటీ వ్యవహారాల శాఖమంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ దీనికోసం మార్గదర్శకాలు ఖరారు చేస్తున్నాం అని చెప్పి దరఖాస్తులు ఆహ్వానించడం లేదన్న వాస్తవం చెప్పకుండా తప్పించుకున్నారు. మార్గదర్శకాలంటే మౌలానా ఆజాద్‌ ఉపకార వేతనాల పథకాన్ని రద్దుచేయడమని ఇప్పుడు రుజువైంది. కచ్చితమైన ముస్లిం వ్యతిరేక వైఖరి అనుసరిస్తున్న మోదీసర్కారు ఇప్పుడు ఆ వర్గంపై మరో రకంగా దెబ్బ తీసింది. ముస్లింలమీద దాడులకు తోడు ఇప్పుడు పరోక్షంగా కూడా దాడులకు దిగారు. ‘‘జాతి నిర్మాణం’’, ‘‘జాతీయ భద్రత’’ పేర పౌరసత్వ సవరణ చట్టం(సి.ఏ.ఏ) లాంటివాటి ద్వారా ఇదివరకే ముస్లింలను అణగదొక్కడం కొనసాగుతూనే ఉంది. విద్యారంగంలో, ముఖ్యంగా ఉన్నత విద్యారంగంలో అనేక కారణాలవల్ల ముస్లింలు ఇప్పటికే షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతుల వారికన్నా ఎక్కువగా వెనుకబడి పోయారు. అలాంటప్పుడు ఉన్న పథకాలను కూడా రద్దుచేస్తుంటే ముస్లిం వెనుకబాటుతనం మరింత పెరుగక తప్పదు. కేవలం 2.76శాతం మంది ముస్లింలే ఉన్నత విద్య అభ్యసించగలుగుతున్నారు. ఇప్పటికే పరాయివారుగా మారిపోయిన ముస్లింలను మిగతా సమాజానికి మరింత దూరంచేసే ఉద్దేశంతోనే మోదీ ప్రభుత్వం అజాద్‌ ఉపకార వేతనాల పథకాన్ని రద్దు చేసినట్టుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img