Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

గజగజలాడుతున్న బాబా రాం దేవ్‌

అధికారవర్గాల మద్దతు ఉందనుకున్న వారు తాము చట్టానికి అతీతులం అనుకుంటారు. కానీ సుప్రీంకోర్టు అప్పుడప్పుడైనా తన సత్తా ప్రదర్శిస్తూ ఉంటుంది. రాం దేవ్‌ విషయంలో మంగళవారం ఇదే జరిగింది. కరోనా విలయ తాండవం చేసినప్పుడు బాబా రాం దేవ్‌ తాము తయారు చేసే ఔషధాలు అద్భుతమైనవని చెప్పడంతో ఊరుకోకుండా ఆధునిక వైద్య విధానంతో సహా ఇతర వైద్య విధానాలను కించ పరిచే రీతిలో వ్యాపార ప్రకటనలు జారీ చేస్తూ వచ్చారు. సుప్రీంకోర్టు నివారించినా ఆయన తన మునుపటి ధోరణి మానలేదు. భారత వైద్య విధాన సంఘం ఈ అంశాన్ని సుప్రీంకోర్టుకు నివేదించింది. ఆ కేసు మీద విచారణ జరుగుతున్న సమయంలోనూ పెడదారి పట్టించే వ్యాపార ప్రకటనలు జారీ అవుతూనే ఉన్నాయి. దీనితో బాబా రాం దేవ్‌, పతంజలి ఆయుర్వేద్‌ కంపెనీ ప్రధాన కార్యనిర్వహణాధికారి మీద కోర్టు ధిక్కార కేసు నడుపుతామని న్యాయమూర్తులు హిమా కోహ్లీ, ఎహసానుద్దీన్‌ అమానుల్లా హెచ్చరించారు. దీనితో బాబా రాందేవ్‌ గజగజలాడి పోతున్నారు. బాబా రాందేవ్‌కు కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వారి అండదండలుండడమే కాక ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందే తాను అన్న భ్రమ పతంజలిని ఆవహిస్తూ వచ్చింది. సుప్రీంకోర్టులో ఆయన, ఆచార్య బాలకృష్ణ దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో తప్పుల తడకగా ఉండడమే కాదు అందులో వారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. అందుకే గత రెండు మూడు నెలలుగా సుప్రీంకోర్టు ఆయనను ఆక్షేపించడమే కాదు మందలిస్తోంది. అందుకే పతంజలి ఆయుర్వేద కంపెనీ నిర్వాహకులు బాబా రాందేవ్‌, ఆయన అనుచరుడు ఆచార్య బాలకృష్ణకు మంగళవారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. చేతులు జోడిరచి క్షమాపణ వేడుకున్నా అత్యున్నత న్యాయ స్థానం అంగీకరించకుండా కోర్టు ధిక్కార కేసు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని హెచ్చరించాల్సి వచ్చింది. కరోనా వీర విహారం చేస్తున్న దశలో బాబా రాం దేవ్‌ రంగ ప్రవేశం చేసి తమ దగ్గర ఆ జబ్బును నయం చేసే మందు ఉందని ప్రచారం చేసుకోవడంతో ఆగకుండా ఇతర వైద్య విధానాలను, ముఖ్యంగా కేవలం శాస్త్ర విజ్ఞానం మీదే ఆధారపడ్డ అలోపతి వైద్య విధానాన్ని ఎద్దేవా చేయడం మొదలు పెట్టారు. అలోపతి వైద్యం కరోనాను నయం చేయడంలో ఎందుకు కొరగాదని భారీ ఎత్తున ప్రచారం చేశారు. ఆ ప్రచారానికి వాణిజ్య ప్రకటనలు జారీ చేయడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారు. గత ఫిబ్రవరి 27వ తేదీ నుంచి కేసు విచారణ ఊపందుకుంది. విచారణ గత సంవత్సరం నవంబర్‌లో మొదలైంది. గత ఏడాది నవంబర్‌ 21న ఈ కేసులో విచారణ జరిగినప్పుడు పతంజలి ఆయుర్వేద కంపెనీ తరఫు న్యాయవాది ఇక మీదట ఇతర వైద్య విధానాలను కించపరచబోమని హామీ పడేశారు. ఆ తరవాత కూడా ఇతర వైద్య విధానాలను కించపరచడం మానలేదు. అందుకని గత నెల 27వ తేదీన విచారణ జరిగినప్పుడు బాబా రాం దేవ్‌, ఆయన సహచరుడు లేదా పతంజలి ఆయుర్వేద ప్రధాన కార్యనిర్వహణాధికారి బాలకృష్ణ స్వయంగా కోర్టుకు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఇతర వైద్య విధానాలను కించపరచబోమని ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. రాందేవ్‌ బాబా ప్రమాణ పత్రం అయితే అంద జేశారు. కానీ ఉండవలసిన రీతిలో లేదు. అది అసత్యాలతో నిండి ఉంది. అందుకని మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హిమా కోహ్లి, అమనుల్లాతో కూడిన బెంచి ఈ ప్రమాణ పత్రంలోని లొసుగుల్ని ఎత్తి చూపుడంతో ఆగకుండా తదుపరి విచారణకు బాబా రాం దేవ్‌, ఆచార్య బాలకృష్ణ హాజరు కావాలని ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం బాబా రాం దేవ్‌, ఆచార్య బాలకృష్ణను ఆక్షేపించడం గత మూడు నెలల కాలంలో ఇది రెండవ సారి. తప్పుడు వ్యాపార ప్రకటనలు జారీ చేయడం, ఇతర వైద్య విధానాలను కించపరచడం ఔషధాలు, చికిత్సల చట్టంలోని 3వ 4వ సెక్షన్‌ ప్రకారం అపరాధం. కానీ కోర్టు వద్దన్న పనినే పదే పదే చేస్తున్నా చట్టాన్ని ఉల్లంఘించినా రాం దేవ్‌ మీద చర్య తీసుకోవడానికి ప్రభుత్వం ఏ పనీ చేయలేదు. అందుకని ఆయుష్‌ మంత్రిత్వ శాఖనూ సుప్రీంకోర్టు ఆక్షేపించవలసి వచ్చింది. పెడదారి పట్టించే ప్రమాణ పత్రం జారీ చేయడం ఎంత పొరపాటో, చట్టాలను ఉల్లంఘించే వారి మీద చర్య తీసుకోకుండా ప్రభుత్వం మిన్నకుండడం కూడా అంతే తప్పు. న్యాయమూర్తులు పతంజలి తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహ్తగీని న్యాయమూర్తులు తప్పుపట్టారు. తాను బాబా రాందేవ్‌తో మాట్లాడి ప్రమాణ పత్రాన్ని సవరింప చేస్తామని రోహ్తగి అన్నప్పుడు ‘‘ఆ పని మేం చూసుకుంటాం లెండి’’ అని న్యాయమూర్తులు హిమా కోహ్లీ, అమానుల్లా ఒకింత కటువుగానే చెప్పాల్సి వచ్చింది.
తమ కంపెనీలో మీడియా వ్యవహారాలు చూసే సిబ్బందికి కోర్టు ఉత్తర్వు గురించి తెలియదన్న వాదనను న్యాయమూర్తులు తోసి పుచ్చారు. పతంజలి కంపెనీలో ఔషధాలు తయారు చేసే కార్మికులకు కోర్టు ఉత్తర్వుల గురించి తెలియదంటే కొంతవరకైనా నమ్మొచ్చు. కానీ మీడియా విభాగానికే తెలియదనడం కేవలం బుకాయింపే. అందువల్ల రాం దేవ్‌, ఆచార్య బాలకృష్ణ క్షమాపణలను స్వీకరించడానికి న్యాయమూర్తులు నిరాకరించారు. ఇన్నాళ్లూ బాబా రాం దేవ్‌ వ్యవహార సరళిలో లెక్కలేనితనం స్పష్టంగా కనిపించింది. ఏలిన వారి మద్దతు ఉండడమే దీనికి కారణం అనుకోవాలి. ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదించిన సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ‘‘ప్రమాణ పత్రం సమర్పించడంలో పొరపాటు జరిగి ఉండకూడదు’’ అని ఒప్పేసుకున్నారు. వైద్యం ఒకప్పుడు అనుభవసారం కావొచ్చు. ఇప్పుడు ఆధునిక వైద్యం సంపూర్ణంగా శాస్త్ర ఆధారితమే. ‘‘మానింది మందు’’ కనక తమకు జబ్బు నయమైతే ఏ విధానాన్ని అయినా జనం అనుసరిస్తారు. ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఉపశమనం కలిగించేదే పరమౌషధం. చికిత్స, ఔషధాల మీద ఎంత నమ్మకం ఉంటుందో వైద్యుడి మీద కూడా అంతే నమ్మకం ఉంటుంది. ఈ అంశాలన్నీ వాదోపవాదాలకు, చర్చలకు, సంవాదాలకు పరిమితం అయితే పెద్ద బాధ లేదు. ప్రపంచ వ్యాప్తంగా అనేక వైద్య విధానాలు ఉన్నాయి. వాటిలో కొన్ని అంతరించిపోయి ఉండవచ్చు. అలోపతి వైద్యం నిత్య పరిశోధనా ఫలితం. ఆయుర్వేదం గొప్ప వైద్యమే కావచ్చు. ఆధునిక శాస్త్ర ప్రమాణాలకు తగిన పరిశోధనలు ఆ వైద్య విధానంలో ఇప్పటికీ తక్కువే. అలాంటి వైద్య విధానాలను అనుసరించేటప్పుడు యుక్తా యుక్త విచక్షణా జ్ఞానం ఉంటే మేలు. ఇక్కడే వైద్యంతో ఏ మాత్రం సంబంధం లేని వారు వైద్యులై కూర్చుంటారు. బాబా రాం దేవ్‌ యోగ నేర్పుతారు. ఆయన ఆయుర్వేద వైద్య అభ్యసించిన దాఖలాలు లేవు. అత్యున్నత న్యాయస్థానం కన్నెర్ర చేసేటప్పటికి గజగజలాడిపోతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img