Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

బీజేపీకి ఎదురుగాలి

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నాల్గవ విడత పోలింగ్‌ 96 నియోజకవర్గాలలో సోమవారం సాయంత్రం ముగిసింది. బెంగాల్‌లో కొంతమేర గొడవలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగినట్టే. సోమవారం పోలింగ్‌ జరిగిన 96 స్థానాలు తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం వున్నాయి. ఈ విడతతో దక్షిణాదిలో పోలింగ్‌ సంపూర్ణమైంది. సాయంత్రం అయిదు గంటలకు అందిన సమాచారం ప్రకారం పోలింగ్‌ జరిగిన 96 నియోజకవర్గాలలో 62.31 శాతం పోలింగ్‌ నమోదైంది. ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రాత్రి 10 గంటల వరకు పోలింగ్‌ జరుగుతూనే ఉంది. అందువల్ల పోలింగ్‌ శాతంపై మంగళ వారం మధ్యాహ్నానికి గాని స్పష్టత రాదు. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 75.66 శాతం, మధ్యప్రదేశ్‌లో 68.01 శాతం, జార్ఖండ్‌లో 63.14 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 56.35 శాతం, బీహార్‌లో 54.14 శాతం పోలింగ్‌ నమోదైంది. జమ్మూ కశ్మీర్‌ లోని శ్రీనగర్‌ లోక్‌సభ నియోజక వర్గానికి సోమవారం పోలింగ్‌ జరిగింది. 2019 ఆగస్టు అయిదున కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన తరవాత శ్రీనగర్‌లో జరిగిన ఎన్నికే మొట్ట మొదటిది. మధ్యాహ్నం మూడు గంటల వరకు అందిన సమాచారం ప్రకారం కేవలం 35.75 శాతం ఓట్లు మాత్రమే పోలైనాయి. ఇది అక్కడి ప్రజల నిరాసక్తతకు సంకేతం. శ్రీనగర్‌ పట్టణంలో కేవలం 14.43 శాతం ఓట్లు మాత్రమే పోలైనాయి. ఆంధ్ర ప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు, 175 స్థానాలున్న అసెంబ్లీ, తెలంగాణ లోని 17 లోక్‌సభ సీట్లకు కూడా సోమవారమే పోలింగ్‌ జరిగింది. ఒడిశా శాసనసభలోని 28 సీట్లకు కూడా సోమవారమే పోలింగ్‌ జరిగింది. ఉత్తర ప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, బెంగాల్‌, మధ్యప్రదేశ్‌లో చెరి 8, బీహార్‌లో అయిదు, జార్ఖండ్‌, ఒడిశా రాష్ట్రాలలో నాలుగేసి స్థానాలకు పోలింగ్‌ జరిగింది. నాలగవ విడత పోలింగ్‌తో 379 స్థానాలకు పోలింగ్‌ పూర్తి అయింది. నాలగవ విడత పోలింగ్‌ సరళి గురించి నిర్దిష్టమైన సమాచారం అందనప్పటికీ మొదటి మూడు విడతల పోలింగ్‌లో జనం అనాసక్తితో పాటు మోదీ నాయకత్వంలోని బీజేపీపై విముఖత ప్రముఖంగా వ్యక్తం అయింది. నాలుగో విడత పరిస్థితి కూడా అంతకన్నా భిన్నంగా ఏమీ లేదు. కనౌజ్‌ నుంచి పోటీ చేస్తున్న సమాజ్‌వాది పార్టీ నాయకుడు అఖిలేశ్‌ యాదవ్‌, బెంగాల్‌లోని కృష్ణనగర్‌ నుంచి పోటీ చేస్తున్న మహువా మొయిత్ర, బీహార్‌లోని బెగూసరాయ్‌ నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌, బెంగాల్‌లోని బర్హంపూర్‌ నుంచి పోటీ చేస్తున్న లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరి, కడప నుంచి పోటీ చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వై.ఎస్‌. షర్మిల, బెంగాల్‌ లోని అసన్‌సోల్‌ నుంచి పోటీ చేస్తున్న సినీ నటుడు శతృఘ్న సిన్‌ హా, తెలంగాణలోని హైదరాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మజ్లిస్‌ నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ భవిష్యత్తు నాల్గో దశ పోలింగ్‌లోనే తేలనుంది.
2019 ఎన్నికలలో సోమవారం పోలింగ్‌ జరిగిన 96 స్థానాల ఫలితాలను చూస్తే బీజేపీ 42 సీట్లు, కాంగ్రెస్‌ ఆరు సీట్లు గెలుచు కున్నాయి. స్థూలంగా మోదీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఎ.కు అనుకూలంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఎన్‌.డి.ఎ.లో భాగస్వామ్యం లేని వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ 2019లో 22 సీట్లు సంపాదించింది. ఈసారి బిజూ జనతాదళ్‌తో పొత్తు పెట్టుకోవాలన్న మోదీ ప్రయత్నం నెరవేర లేదు. మొదటి నుంచి బీజేపీని ఎదుర్కొంటున్న మమతా బెనర్జీ నాయకత్వం లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనలో భాగస్వామి. సోమవారం పోలింగ్‌ జరిగిన నియోజకవర్గాలను పరిశీలిస్తే ప్రాంతీ యంగా బలంగా ఉన్న పార్టీల బలాబలాలు ఏమిటో తేలిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి నాయకత్వం లోని వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ ఎన్‌.డి.ఎ.లో భాగస్వామి కానప్పటికీ పార్లమెంటులో బీజేపీకే మద్దతు ఇస్తూ వచ్చింది. మరో వేపు జగన్‌తో తలపడుతున్న చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం, పవన్‌ కళ్యాణ్‌ నాయకత్వంలోని జనసేన బీజేపీతో పొత్తు కూడాయి. అంటే ఆంధ్ర ప్రదేశ్‌లోని అధికార, ప్రతిపక్షాలు అంతిమంగా బీజేపీని సమర్థించేవే. సోమవారం 96 సీట్లకు పోలింగ్‌ జరిగితే బీజేపీ 70 స్థానాలకు, బీజేపీతో పొత్తు పెట్టుకున్న తెలుగు దేశం 17 సీట్లకు, జనసేన రెండు సీట్లకు, మహారాష్ట్రలో బీజేపీకి అనుకూలమైన షిండే నాయకత్వంలోని శివసేన మూడు స్థానాలకు పోటీ చేస్తున్నాయి. ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనలోని పక్షాలలో కాంగ్రెస్‌ 61 స్థానాలకు, సమాజ్‌వాదీ పార్టీ 19 చోట్ల, ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ చెరి నాలుగు సీట్లకు పోటీ చేస్తున్నాయి. ఈ దశ పోలింగ్‌ జరిగిన స్థానాలను బట్టి చూస్తే ఎన్‌.డి.ఎ.తో గానీ, ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనకు గానీ సంబంధం లేని వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ 22 సీట్లు, బిజూ జనతాదళ్‌ 2 స్థానాలు, కె.చంద్రశేఖరరావు నాయకత్వంలోని బి.ఆర్‌.ఎస్‌.కు 9 సీట్లు 2019లో దక్కాయి. ఇటీవల తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. బి.ఆర్‌.ఎస్‌. కుదేలైంది. గత పక్షం రోజులుగా కె.చంద్రశేఖరరావు ఎంత శ్రమపడ్డా పెద్దగా ఫలితం ఉండదన్నది పరిశీలకుల అంచనా. తృణమూల్‌ కాంగ్రెస్‌ ‘‘ఇండియా’’ సంఘటనలో భాగస్వామి అయిన ప్పటికీ అక్కడ కాంగ్రెస్‌ తో ఎలాంటి పొత్తూ పెట్టుకోలేదు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాక ముందు ఒడిశాలో అధికారంలో ఉన్న నవీన్‌ పట్నాయక్‌ నాయకత్వం లోని బిజూ జనతాదళ్‌కు, బీజేపీకి మధ్య పొత్తు కుదురుతుందన్న అంచనాలు తారు మారయ్యాయి. పొత్తు కుదరనందుకు మోదీ ఒడిశా ముఖ్య మంత్రి నవీన్‌ పట్నాయక్‌పై ఒంటి కాలి మీద లేస్తున్నా, ఆయనను కించపరిచే రీతిలో మాట్లాడుతున్నా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలపడ్తుం దన్న భయంతోనే బిజూ జనతాదళ్‌తో బీజేపీ పొత్తు పెట్టుకో లేదనిపి స్తోంది. పొత్తు లేకపోయినా బిజూ జనతాదళ్‌ అధికారికంగా ఎన్‌.డి.ఎ.లో భాగస్వామి కాకపోయినా ఆచరణలో ఎటూ బీజేపీకే మద్దతు పలకడం ఖాయం. తెలంగాణలో బి.ఆర్‌.ఎస్‌. బలహీన పడినందువల్ల కాంగ్రెస్‌తో ముఖాముఖి తలపడాలని బీజేపీ భావిం చింది. కానీ బీజేపీకి అంత అవకాశం లేదు. జార్ఖండ్‌ మాజీ ముఖ్య మంత్రి హేమంత్‌ సొరేన్‌ అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్నారు. ఆయన నాయకత్వంలోని జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జె.ఎం.ఎం.) ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనలో భాగస్వామి. హేమంత్‌ సొరేన్‌ను అరెస్టు చేసినందుకు ఆయన మీద ఉన్న సానుభూతి ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనకు తోడ్పడవచ్చు. మొదటి మూడు విడతల్లో లాగే నాల్గో విడతలోనూ బీజేపీకి ఎదురుగాలే కనిపించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img