Saturday, October 1, 2022
Saturday, October 1, 2022

బీజేపీపై తిరుగుబాటు బావుటా

ఆదివారం నాడు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌లో జరిగిన కిసాన్‌ మహాపంచాయత్‌ బీజేపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. ఈ తిరుగుబాటు కేవలం మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌ రాష్ట్రాలకు సంబంధించిందే కాదు. బీజేపీని గద్దె దించాలి అన్న నినాదం ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే పరిమితమైంది కాదు. 2024 సార్వత్రిక ఎన్నికలకు కూడా ఇది వర్తిస్తుంది. తొమ్మిది నెలలకు పైగా జరుగుతున్న రైతుల ఆందోళనను మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడం రైతులను ఆగ్రహో దగ్రులను చేస్తోంది. అందుకే మోదీ ‘‘దౌర్జన్యకారుడు’’ అనీ, విద్వేష పూరిత, ప్రజలను విభజించే రాజకీయాలు నడుపుతున్నారని రాకేశ్‌ తికైత్‌ నినదించవలసి వచ్చింది. ఈ సర్కారుకు ఓటు విఘాతం తగలవలసిందే అని రాకేశ్‌ తికైత్‌ అన్నారు. ‘‘పంటకు సరైన ధర లభించకపోతే ఓట్లూ దక్కబోవ’’ని ఈ కిసాన్‌ మహాపంచాయత్‌ స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలలో బీజేపీకి గుణపాఠం నేర్పాలని పిలుపు ఇచ్చింది. ఈ పోరాటం ఇంతటితో ఆగదని 2024 ఎన్నికల దాకా కొనసాగి తీరుతుందని కూడా ప్రకటించింది. ప్రధాన మీడియా రైతుల ఆందోళనను మొదటి నుంచీ అంతగా పట్టించుకోవడం లేదు. ఒక వేళ పట్టించుకున్నా దుష్ప్రచారం చేయడానికే పరిమితమైంది. అయినా రైతులు అలసి పోలేదు. పోరాట పటిమ ఏ మాత్రం సన్నగిల్లలేదు. ముజఫర్‌ నగర్‌ మహా కిసాన్‌ పంచాయత్‌ రైతులలో ఆత్మ విశ్వాసం నింపింది. ఈ మహా పంచాయత్‌లో ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించడంతో ఆగకుండా వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించడంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్న అంబానీ, అదానీల మీద కూడా విమర్శలు గుప్పించింది. పట్టించుకోకుండా ఉంటే రైతులు అలసి పోతారని, ఈ ఉద్యమం దానంతట అదే తగ్గుముఖం పడ్తుందన్న కేంద్ర ప్రభుత్వ అంచనాలను ముజఫర్‌ నగర్‌ కిసాన్‌ పంచాయత్‌ పటాపంచలు చేసింది. ఈ మహాపంచాయత్‌కు ప్రధానంగా ఆందోళన చేస్తున్న పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ రైతులు మాత్రమే కాకుండా సుదూర ప్రాంతంలో ఉన్న దక్షిణాదిలోని తమిళనాడు, కర్నాటక, తెలంగాణా రైతులు కూడా హాజరయ్యారు. ప్రభుత్వ ప్రచారం వీగిపోయింది. రైతుల ఉద్యమం ఇన్నాళ్ల నుంచి రాజకీయాలతో, రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండానే జరిగినప్పటికీ క్రమంగా రాజకీయ కోణం ఆవిష్కృతం అవుతోంది. ఉద్యమానికి రాజకీయ పార్టీలు నాయకత్వం వహించకపోవచ్చు. రైతుల డిమాండ్లకు రాజకీయ స్వరూపం కచ్చితంగా ఉంటుంది. మోదీ అనుసరిస్తున్న రాజకీయాలు ప్రజలను విడదీయడానికి అయితే తమ ఉద్యమం ప్రజలను సంఘటితం చేయడానికి, ఐక్యం చేయడానికి అని రాకేశ్‌ తికైత్‌, యోగేంద్ర యాదవ్‌ లాంటి వారు అరమరికలకు తావు లేకుండానే చెప్పారు. ఇది ‘‘మిషన్‌ ఉత్తరప్రదేశ్‌’’ కు నాందీ అని రాకేశ్‌ తికైత్‌ ప్రకటించడం అంటే ఎన్నికలు, ఓట్ల భాష మాత్రమే అర్థమయ్యే బీజేపీకి అదే భాషలో జవాబు చెప్పాలని పిలుపు ఇవ్వడమే.
ఈ ఉద్యమంలో మరో రెండు కోణాలు స్పష్టంగా వ్యక్తం అయినాయి. మొదటిది : మహా పంచాయత్‌కు వేదిక అయిన ముజఫర్‌ నగర్‌లో 2013లో భయంకరమైన మత కలహాలు జరిగాయి. ఇప్పుడు రైతుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారే అప్పుడు ముస్లింలపై దాడి చేశారు. కానీ ఆదివారం నాటి మహాపంచాయత్‌లో ఆ వైషమ్యాలను విడనాడి హిందువులు, ముస్లింలు, సిక్కులు అందరూ భుజం భుజం కలిపి పాల్గొన్నారు. రైతుల సమస్యలు అన్ని మతాల వారివి కనక ఉమ్మడిగా పోరాడాలన్న చైతన్యం ప్రధానమైన రెండు మతాల వారిలో ప్రస్ఫుటంగా వ్యక్తం అయింది. ముజఫర్‌ నగర్‌ వేదిక నుంచి మొట్టమొదటిసారి మోదీ సర్కారును గద్దె దించాలని పిలుపు ఇవ్వడం మారనున్న రాజకీయ చిత్రపటానికి నిదర్శనం. రెండవది : ఈ మహాపంచాయత్‌ బీజేపీ వ్యతిరేక భావాలను ప్రోది చేయడానికి శ్రీకారం చుట్టింది. రైతులు ఎప్పుడూ ఒక్కుమ్మడిగా ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగానో, వ్యతిరేకంగానో ఓటు వేసిన సందర్భం గతంలో లేదు కానీ ముజఫర్‌ నగర్‌ సమావేశం బీజేపీ వ్యతిరేక వాతావరణం ఏర్పరచడానికి తోడ్పడి తీరుతుంది. ఎన్నికలు జరగడానికి ఇంకా అయిదారు నెలల వ్యవధి ఉన్నందువల్ల యోగీ ప్రభుత్వం కూడా తాయిలాలు విసరవచ్చు. చెరకు ధర పెంచడం, విద్యుత్‌ ధరలు తగ్గించడం లాంటి చిట్కాలు యోగీ సర్కారు ప్రయోగించవచ్చు. కానీ ఇవేవీ రైతులను బీజేపీకి అనుకూలంగా మార్చే అవకాశం లేదు. ప్రభుత్వం తన అవసరం కోసం ప్రకటించేవి తాయిలాలే అయినా అవి పొందడం రైతుల హక్కు. ఈ వాస్తవాన్ని రైతులుగుర్తించారు. రైతుల బలాన్ని నిరూపించడంలో ఈ మహా పంచాయత్‌ అమోఘమైన విజయం సాధించింది. మహేంద్ర సింగ్‌ తికైత్‌, శరద్‌ జోషీ రైతుల ఉద్యమం నడిపినప్పుడూ భారీ ర్యాలీలు జరగకపోలేదు. కానీ ఆదివారం జరిగిన మహాపంచాయత్‌ వీటన్నింటికన్నా పెద్దది, విస్తృతమైంది. ఆ ప్రాంతంలో అంతర్జాల సదుపాయాలు నిలిపి వేయడం, రైళ్లను, బస్సులను ఆపడం లాంటివి ఏవీ రైతులను అడ్డగించలేక పోయాయి. ఇది ప్రజల మధ్య ఐక్యతకు రుజువు.
రైతులఉద్యమం కేవలం ఆ వర్గానికే పరిమితం అయిన వ్యవహారం కాదని నిరూపించడానికి ఒక్కో అడుగే ముందుకు పడుతోంది. ఇంతటి విస్తృతమైన ఐక్యతను ఏ రాజకీయ పార్టీ సాధించలేదు. ఇది సామాజిక, సాంస్కృతికఐక్యతకు ప్రతిరూపం. ప్రజాస్వామ్యసంస్కృతిని పెంపొందించే మహోద్యమం. ఇతర వర్గాల సమస్యలు కూడా ముజఫర్‌ నగర్‌లో వ్యక్తం అయినాయి. ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్షాలు చీలికలు, పేలికలు అయి ఉన్నాయి. రైతులు ప్రదర్శించిన ఐక్యత ప్రతిపక్షాలకు దిక్సూచి కావాలి. రైతుల ఉద్యమాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి మోదీ సర్కారు వేయని ఎత్తుగడ లేదు. సాక్షాత్తు ప్రధాన మంత్రి మోదీ పార్లమెంటు వేదిక మీంచి ఉద్యమాలు చేసే వారిని ఆందోళన జీవి, పరాన్న జీవి అని అపహాస్యం చేశారు. ఇది రైతుల ఉద్యమం కాదని, ప్రతిపక్షాలు రైతులను పెడదోవ పట్టిస్తున్నాయని, దిల్లీ పొలిమేరల్లో బైఠాయించిన వారు ఖాలిస్థానీలు, పాకిస్తానీలు, తీవ్రవాదులు అని దుమ్మెత్తి పోశారు. ఇది రైతుల మనసులను బాగా గాయపరచింది. రైతుల ఉద్యమాన్ని ప్రజాందోళనగా మార్చడానికి ప్రతిపక్షాలకు ఇది మహదవకాశం. రైతుల ఐక్యత ప్రతిపక్షాలకు ఆదర్శం కావాలి. ఈ ఉద్యమం నుంచి ప్రతిపక్షాలు స్ఫూర్తి పొందాలి. ఇది నూతన రాజకీయ సంస్కృతికి దారి తీయాలి. కడుపు కాలుతున్న ప్రజల సంకల్ప బలం ముందు ప్రభుత్వ దుశ్చర్యలు సాగవని నిరూపించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img