Friday, February 3, 2023
Friday, February 3, 2023

రిషి కొండపై పర్యావరణ విధ్వంసం

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం తీవ్రంగా కలుషితమై మానవాళి మనుగడే ప్రశ్నార్థకమవుతున్నందున ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకొని పర్యావరణం పరిరక్షించవలసిన బాధ్యత పాలకులు, ప్రజల మీద ఎంతైనా ఉంది. దాదాపు అర్ద్థ శతాబ్దికి పైగా పర్యావరణ శాస్త్రవేత్తలు అధ్యయనంచేసి హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ఐరాస ఆధ్వర్యంలో అనేక సదస్సులు సమావేశమై కాలుష్యాన్ని, భూతాపాన్ని తగ్గించి భూమాతను, మానవాళిని కాపాడుకోవాలని నిర్ణయాలు చేశాయి. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకొని అవసరమైనన్ని చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా ప్రకృతి విపత్తులు, అపరిమితంగా అకాలంలో వర్షాలు, వరదలు, భూమండలం వేడెక్కడం జరుగుతోంది. ఈ శతాబ్ది చివరి నాటికి 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి భూమి వేడెక్కితే మహాప్రళయం ఉంటుందని పర్యావరణ శాస్త్రవేత్తల అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. నగరాలు అపరిమిత కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి. నగరాల్లో పచ్చని వాతావరణం ఉండవలసిన అవసరం ఎంతైనాఉంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో పచ్చని వాతావరణం ఉన్న రిషికొండను తవ్వితే అది వాతావరణం నాశనం కావడానికి మరింతగా దోహదం చేస్తుంది. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? తెలిసి కూడా మరేదో కారణంతో కొండ చుట్టూ తొలిచి అక్కడ భవనాలను, విలాసవంతమైన విల్లాలు, ఫంక్షన్‌ హాళ్లు, రెస్టారెంట్లు ఎందుకు నిర్మిస్తున్నట్టు? ఇంతవరకు రాష్ట్ర ప్రజలకు, విశాఖపట్నం, ఈ ప్రాంతంలో పట్టణాలు, గ్రామాలు ప్రజలకు తెలియదు. కారణం తెలియకుండా పారదర్శకత లేకుండా అక్కడ పనులు చేపట్టవలసిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ ప్రభుత్వానికి అవసరమైన నిర్మాణాలు చేపట్టాలంటే ప్రత్యామ్నాయం లేదా? కార్య నిర్వాహకవర్గ రాజధానిగా విశాఖపట్నం ఎంచుకోవడం వల్ల లక్షల ప్రజలు నగరానికి చేరుకోవచ్చు. అప్పుడు నీటి సమస్య, మురుగు పారుదల పెరిగి మరింత సమస్య అవుతుంది. ఎక్కడెక్కడి మురుగు నీరంతా సముద్రంలోకిచేరి సముద్రం ఇప్పటికే ఎక్కువ కలుషితమైంది. ఇప్పటికే కాలుష్యం పెరిగి అనేక నగరాల ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి లేకుండా పోయింది. వ్యాధులు అపరిమితమవుతున్నాయి. గతంలో రిషికిండ సానువుల వరకు వచ్చి కొండ అంచును తాకే సముద్రం ఇప్పుడు దూరంగా జరిగింది. గతంలో ప్రజలు బీచ్‌ నుంచి దాదాపు కిలోమీటరు వరకు నీటిలో వెళ్లగలిగే వాళ్లు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఇసుక సముద్రంలోకి జరిగిపోయి నౌకలను సైతం నిలపడానికి సమస్యలు ఎదురవుతున్నాయి. నగరాలను మరింతగా పెంచడానికే పాలకులు అభివృద్ధి పేరిట మరింత విధ్వంసకర కార్యక్రమాలను చేపడుతున్నారు. కాలుష్యం తగ్గించి భూతాపం పెరుగుదలను అరికట్టడానికి ప్రజలను చైతన్యపరిచి, కాలుష్యం తగ్గింపులో భాగస్వాములను చేయవలసిన కర్తవ్యం ఉంది. స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు తప్పనిసరిగా కాలుష్యం తగ్గింపు చర్యలను చేపట్టవలసిన పాలకులు అలాంటి ఆలోచన చేయకుండా కాలుష్యంపెంచే కార్యకలాపాలు నిర్వహించడం ముందు చూపులేని చర్య అవుతుంది.
పూర్వం రిషికొండ, తొట్లకొండ, బావికొండ ఉండేవి. తొట్లకొండ, బావికొండలపైన బౌద్ద ఆరామాలు, చైత్యాలే ఉండేవి. కాలక్రమంలో బౌద్ద ఆరామాలు, చైత్యాలను కూలగొట్టి విధ్వంసానికి కారకులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రిషికొండ చుట్టూ తవ్వడం ప్రారంభమైంది. దీనివల్ల పర్యావరణం విధ్వంసమవుతుందని సీపీఐ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. ఇతర పార్టీలుకూడా ఈ తవ్వకాన్ని వ్యతిరేకించాయి. తవ్వకాలను నిలిపివేయించాలని కోరుతూ తెలుగుదేశం, జనసేన నాయకులు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు విచారణ జరిపి రిషికొండపై టూరిజంశాఖ చేపట్టిన నిర్మాణాలను కొనసాగించవచ్చునని కోర్టు అనుమతించింది. టూరిస్టు శాఖ సముద్రానికి దగ్గరలో రిసార్టు నిర్మించింది. ఆ తర్వాత భవనాలు, హోటళ్ల కోసం నిర్మాణాలు చేపట్టింది. కోర్టు అనుమతించిన తరువాత నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే రిషికొండ మీద ఈ నిర్మాణాలను ఎందుకు చేపట్టామనేది ప్రభుత్వం ప్రకటించలేదు. పైగా కొండపైకి ఎవరూ వెళ్లరాదని ఆంక్షలు విధించింది. పోలీసులను కాపలా పెట్టింది. ఇదేమీ నిషేధిత ప్రాంతం కాదు. సైనిక బరాక్స్‌ లేవు. పైగా ప్రజాప్రయోజనం కోసం చేపడుతున్న నిర్మాణాలైతే ఆ విషయం ప్రభుత్వం స్పష్టం చేయవచ్చు. ఈ కొండపైనే ప్రభుత్వ భవనాలు నిర్మించి పర్యావరణం దెబ్బతీయకుండా ఇతర ప్రాంతాల్లో నిర్మించవచ్చు. ఈ సమస్యపైన విచారణ చేపట్టడానికి హైకోర్టు కమిషన్‌ నియమించింది. కమిషన్‌ దర్యాప్తు ఇంకా ముగియలేదు. అయితే దీని వెనుక రహస్యం ఏమీ లేనప్పుడు ప్రజలు చూసేందుకు ప్రభుత్వం ఎందుకు అనుమతించలేదు. ఆ రహస్యం ఏమిటని ప్రభుత్వంపై సందేహాలు కలుగుతాయి. ఆందోళన వ్యక్తం చేయడానికి ఇది ప్రధాన కారణాల్లో ఒకటి. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణను సైతం కోర్టు అనుమతి తర్వాతనే కొండపైకి వెళ్లడానికి అనుమతించారు. అదీ ఆయన కోర్టును అడిగిన తర్వాత మూడు నెలలకు అనుమతి లభించింది. శుక్ర వారం కొండపైకి వెళ్లడానికి నారాయణతో పాటు ఉన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తిని పైకి వెళ్లకుండా నిలిపివేయడం ఏమిటి. బహిరంగంగా పని చేస్తున్న పార్టీ నాయకులు కొండపైకివెళ్లి పరిశీలించకూడదా? మడ అడవులు సముద్ర తీరం కోతకు గురికాకుండా కొంత మేరకు నిలువరిస్తాయి. అలాగే సముద్రం పొంగి తీరప్రాంతాలు మునగకుండా సహాయపడతాయి. ఇదే కాదు పర్యావరణ హితమైన కాకినాడ వద్ద గల మడ అడవులను ధ్వంసం చేసిన ‘ఘనత’ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కింది!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img