Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

సుప్రీంకోర్టు వివేచనా దృక్పథం

కొందరు న్యాయమూర్తులు చాలా క్రియాశీలంగా వ్యవహరిస్తారు. మరికొంతమందికి నిర్దిష్టమైన భావజాలమూ ప్రస్ఫుటంగా వ్యక్తం అవుతుంది. ఇంకొందరు న్యాయమూర్తులు రాసే తీర్పులు ఉత్తమ సాహిత్య స్థాయి అందుకుంటాయి. ఏ న్యాయమూర్తి అయినా చట్ట పరిధిలోనే తీర్పులు చెప్పగలరు. కానీ కాలదోషం పట్టిన, దుష్ట చట్టాలను తమ తీర్పుల్లో కాకపోయినా విచారణ సందర్భంగా చేసే వ్యాఖ్యల్లోనో, ప్రాస్తావిక అంశాల్లో భాగంగానో దుయ్యబట్టే న్యాయమూర్తులూ ఉంటారు. మరణ శిక్ష ఉండాలా ఉండకూడదా అన్న అంశంపై మన దేశంలో న్యాయ మూర్తుల మధ్య విపరీతమైన చర్చ జరిగింది. న్యాయమూర్తి వి.ఆర్‌. కృష్ణ అయ్యర్‌ లాంటి వారైతే మరణ శిక్షకు స్థానం ఉండకూడదనీ, ఆ శిక్ష విధించడానికి న్యాయస్థానాలకు చట్ట రీత్యా అవకాశం ఉండడం అంటే రాజ్య వ్యవస్థకు పౌరులను హతమార్చే అధికారం ఇచ్చినట్టే అని భావించారు. న్యాయవ్యవస్థ క్రియాశీలంగా మారిందని సంతోషించిన వారున్నట్టే విచారం వ్యక్తం చేసిన యథాతథ వాదులకూ కొదవలేదు. న్యాయమూర్తులు కృష్ణ అయ్యర్‌, పి.ఎన్‌. భగవతి తీవ్రంగా ప్రయత్నించి ఉండకపోతే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు వీలుండేదే కాదు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడుగానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడుగానీ ఇలా క్రియాశీలంగా వ్యవహరించిన దాఖలాలు పెద్దగా కనిపించవు. ఆయన మౌలికతీర్పులు ఇవ్వలేదని కాదు. ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టిన తరవాత రమణ వ్యవహార సరళిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఆయన పౌరహక్కులకు ప్రాధాన్యం ఇచ్చేవారు అన్న మాట ఇంతకు ముందూ విన్నాం. కానీ ఇప్పుడు ఆ హక్కుల ప్రాధాన్యతను అడుగడుగునా నొక్కి చెప్తున్నారు. దేశద్రోహ చట్టం అని అందరికీ తెలిసిన భారత శిక్షా స్మృతి(ఐ.పి.సి.) లోని 124ఎ సెక్షన్‌ ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకం అని వాదిస్తున్నవారు చాలా కాలం నుంచే ఉన్నారు. ఇటీవలి కాలంలో ఎవరిమీద పడితే వారి మీద దేశద్రోహ చట్టం మోపి, కొసరుగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధకచట్టం(యు.ఎ.పి.ఎ.) కూడా తగిలిస్తున్నారు. ఈ దశలో కొన్ని హైకోర్టులు, కొన్ని సందర్భాలలో సుప్రీంకోర్టు ఈ విధానం చెల్లదని తీర్పులు చెప్పిన ఉదంతాలున్నాయి. వలసవాద పాలనలో స్వాతంత్య్ర సమరయోధులను వేధించడానికి బ్రిటిష్‌ వారు తీసుకొచ్చిన ఈ చట్టాన్ని స్వాతంత్య్రానంతరం కూడా కొనసాగించడం సహించరానిదే. ఇలాంటి చట్టాలు ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థకు తగవు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేశద్రోహచట్టం ఆవశ్యకతను బాహాటం గానే వ్యతిరేకించారు. దానితో పాటు ఆయన మరికొన్ని మౌలిక ప్రశ్నలు కూడా లేవనెత్తారు. ఒక వ్యక్తికి బెయిలు మంజూరుచేసిన తరవాత విడుదల చేయడంలో జాప్యాన్ని కూడా ప్రధాన న్యాయమూర్తి ఈసడిరచారు. అలాగే కోర్టుల్లో పేరుకుపోయిన లక్షలాది కేసులను తెమల్చడం అసాధ్యమైంది ఏమీ కాదన్న విశ్వాసాన్ని కూడా న్యాయమూర్తి రమణ వ్యక్తం చేశారు.
దేశద్రోహ చట్టాన్ని రద్దుచేయవలసిన బాధ్యత మౌలికంగా పార్లమెంటుది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత కాల దోషం పట్టిన కొన్ని వందల శాసనాలను రద్దు చేశారు. కానీ దేశద్రోహ నిబంధనను మాత్రం అలాగే ఉంచారు. మోదీకన్నా ముందున్న పాలకులు దేశద్రోహ నిబంధనను దుర్వినియోగం చేయలేదని కాదు. కానీ ప్రస్తుతం ఉన్న దేశద్రోహ కేసుల్లో 96 శాతం మోదీ ఏలుబడిలోనే అని గమనిస్తే ఈ దుష్ట నిబంధన కుటిల రాజకీయాలకు, ప్రజాస్వామ్యం పీక నొక్కడానికి ఎలా ఉపయోగిస్తున్నారో అర్థం అవుతుంది. అసమ్మతిని సహించే సంస్కారం ఈ ప్రభుత్వానికి లేదు. అందుకని ప్రభుత్వంపై అసమ్మతి వ్యక్తం చేయడాన్ని, ప్రభుత్వ విధానాలను తప్పు పట్టడాన్ని కూడా దేశద్రోహం కిందే పరిగణిస్తూ ఎడాపెడా కేసులు మోపుతోంది. ఈ నిబంధన కింద జైలుకెళ్లిన వారికి బెయిలు రావడం కూడా కష్టమే. అంటే అటు బెయిలూ రాక ఇటూ విచారణా లేకుండా ఏళ్ల తరబడి రాజకీయ ప్రత్యర్థులను జైళ్లల్లో కుక్కడానికి దీన్ని బలాదూరుగా దుర్వినియోగం చేస్తున్నారన్న మాట. దేశద్రోహ నిబంధన విషయంలోనైతే సుప్రీంకోర్టు దాని హేతుబద్ధతనే ప్రశ్నించింది. తిలక్‌, గాంధీ లాంటి వారిని జైళ్లల్లో నిర్బంధించడానికి బ్రిటిష్‌ వారు ప్రవేశ పెట్టిన చట్టంతో ప్రజాస్వామ్య వ్యవస్థలో పనేమిటి అని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ చట్టం తరచుగా దుర్వినియోగం అవుతుండడంపట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఈ నిబంధన విషయంలో తన అసమ్మతిని, వైఖరిని స్పష్టంగా వ్యక్తం చేశారు.
ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయాన్ని పట్టించుకోకుండా హర్యానా పోలీసులు వందమంది రైతులపైన దేశద్రోహ నేర చట్టం క్రింద కేసులు పెట్టారు. ఇక తదుపరి అడుగు వేయాల్సింది చట్ట సభ, అధికార పక్షమే. అలాగే బెయిలుమంజూరు అయిన తరవాత వెంటనే విడుదల చేయకుండా విపరీతమైన కాలయాపన జరుగుతోంది. అదేమంటే లిఖిత పూర్వక ఆదేశాలు అందలేదంటున్నారు. సమాచార సాంకేతికత విపరీతంగా వినియోగించుకుంటున్న దశలో న్యాయస్థానాల ఆదేశాల అమలుకు ఎందుకు ఉపకరించడం లేదో తెలియదు. దీన్నే ప్రధాన న్యాయమూర్తి అభ్యంతర పెట్టారు. అన్ని జైళ్లకు ఎలక్ట్రానిక్‌ రూపంలో సమాచార వ్యవస్థ ఉందో లేదో కనుక్కోవాలని, లేకపోతే ఏర్పాటు చేయాలని రాష్ట్రాల ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేయాలని, ఏమైనా సరే నెల రోజుల్లోగా సత్వరం బెయిలు ఉత్తర్వులు చేరవలసిన చోటికి చేరే ఏర్పాట్లు చేయాలని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ, ఎల్‌. నాగేశ్వర రావు. ఎ.ఎస్‌. బొపన్నతో కూడిన బెంచీ సుప్రీంకోర్టు సెక్రెటరీ జనరల్‌ను ఆదేశించింది. ‘‘ఇంకా మనం పావురాల టపా కోసం ఆకాశంవేపు చూస్తూ కూర్చోవలసిన అగత్యంఉందా?’’ అని రమణ ప్రశ్నించారు. ఇప్పటికే కోర్టుఉత్తర్వులు, తీర్పులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతూనే ఉన్నారు. అవి అధికారికమైనప్పుడు బెయిలు ఉత్తర్వులు లిఖిత రూపంలో అందితేనే విడుదల అన్నది కేవలం వితండ వాదమే అవుతుంది. జిల్లా కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిలు ఉత్తర్వులను జైళ్ల అధికారులకు సత్వరం అందే ఏర్పాటు చేయడానికి తగిన వ్యవస్థ ఏర్పడాలన్నది ప్రధాన న్యాయమూర్తి ఆలోచన. దేశద్రోహం ఆరోపణలకు గురై జైళ్లల్లో మగ్గుతున్న వారికి కాలం కలిసొచ్చి కోర్టులో విచారణ జరగడమే తక్కువ. ఒక వేళ జరిగినా నిందితులకు ఆ చట్టం కింద శిక్షలు పడుతున్న సందర్భాలు మరీ అపురూపమే. దేశద్రోహ అభియోగాలు ఎటూ రుజువు కావని ప్రభుత్వాలకు, పోలీసులకూ తెలుసు. కానీ కోర్టులు విడుదల చేసే దాకా జైళ్లల్లో మగ్గబెట్టడానికి వీలుంటుంది కదా అన్న సంతృప్తి పాలక వర్గాలకు మిగులుతుంది. న్యాయం చేయడం అంత సులభం కాదని ఇంతకు ముందు ప్రధాన న్యాయమూర్తి మరో సందర్భంలో వ్యాఖ్యానించారు. కానీ దేశద్రోహ చట్టం అవసరాన్ని ప్రశ్నించి ఆయన ఆ కష్టమైన పనినే తలకెత్తుకున్నారు. ఆయన అభిశంసనలు, ప్రయత్నాలు ఫలిస్తే చరిత్రలో మిగిలిపోతారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img