Monday, May 20, 2024
Monday, May 20, 2024

ఎన్నికల కమిషన్‌ అంతర్ధానం!

కష్టాలు వచ్చినప్పుడు దేవుడు గుర్తుకు రావడంలో అసహజం ఏమీ లేదు. దైవ భక్తి ఉన్న వారు తీరని ఆపద వచ్చినప్పుడు భారమంతా దేవుడి మీదే వేసి చేతులు జోడిరచి కూర్చుంటారు. కానీ మరో సందర్భం వచ్చినప్పుడూ కొన్ని రాజకీయ పార్టీలకు శ్రీరాముడు గుర్తొస్తాడు. అయోధ్యలో కొత్తగా నిర్మించిన బాల రాముడి ఆలయం గుర్తొస్తుంది. ఆ ఆలయాన్ని చూసి బీజేపీకి ఓటు వేయండి అని బీజేపీ నాయకులు బాహాటంగానే అడుగుతుంటారు. ఎన్నికల ప్రచారంలో కులం, మతం లాంటి వాటి ప్రస్తావన తీసుకు రాకూడదన్న నియమం ఉంది. ఎన్నికల నైతిక ప్రమాణాల ప్రకారం కులం, మతం మొదలైన అంశాలను ప్రస్తావించడం నిషేధం. కానీ బీజేపీ ఎన్నికల ప్రచారం మొత్తం మతం ఆధారంగానే సాగుతుంది. అసలు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి దోహదం చేసిందే అడ్వాణీ నాయకత్వంలో సాగిన రక్తసిక్తమైన రథ యాత్ర. ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఊపందుకున్న దశలో బీజేపీ నాయకులు, అభ్యర్థులు మతాన్ని విచ్చలవిడిగా ఎన్నికల ప్రచారంలో వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొంపెల్ల మాధవీ లత శ్రీ రామ నవమి ఉత్సవం సందర్భంగా జరిగిన ఊరేగింపులో మసీదుపై బాణం ఎక్కు పెట్టడం కనిపిస్తుంది. అదే శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఇటీవల నిర్మించిన ఆలయంలో బాల రాముడి విగ్రహంపై సూర్యకిరణాలు పడడాన్ని విపరీతంగా ప్రచారంలో పెట్టారు. దీన్ని సూర్యాభిషేకం అంటున్నారు. ఇవి సహజంగా పడ్డ సూర్య కిరణాలు కావని అందరికీ తెలుసు. సహజంగానే దేవుళ్ల విగ్రహాలపై ఒకనొక సమయంలో సూర్యకిరణాలు పడే దేవాలయాలు దేశంలో అనేకం ఉన్నాయి. అది ఆ ఆ దేవాలయాలను నిర్మించిన శిల్పుల, వాస్తు శిల్పుల ప్రతిభ. మోదీ హయాంలో నిర్మించిన రామ మందిరాన్ని తలుచుకుని వేయవలసిన చోట ఓటు వేయాలని బీజేపీ పోస్టర్లు విడుదల చేసింది. దీని అంతరార్థం మోదీ రామ మందిరం నిర్మించారు కనక బీజేపీకి ఓటు వేయాలనే. రామానంద్‌ సాగర్‌ నిర్మించిన రామాయణం సీరియల్‌లో రాముడి పాత్రలో నటించిన అరుణ్‌ గోవిల్‌ ఎన్నికలు వచ్చే సరికి సాక్షాత్తు శ్రీరాముడి అవతారంగా మారిపోతారు. ఆయన రాముడి బొమ్మ పట్టుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రామ మందిరం చిత్రపటం పట్టుకుని ఓట్లు అడుగుతారు. హైదరాబాద్‌ కు చెందిన బీజేపీ ‘‘ఫైర్‌ బ్రాండ్‌’’ రాజా సింగ్‌ ప్రసంగాలకైతే లెక్కే లేదు. ఆయన మీద ఏ చర్యా ఉండదు. మరో బీజేపీ నాయకుడు రాజ్య వర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ నేరుగా రామ మందిరం పేరనే ఓట్లు వేయాలంటున్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కూతురు అంజలీ బిర్లాది అదే పద్ధతి.
ఎన్నికల నైతిక ప్రవర్తనా నియమావళి ప్రకారం ఇవన్నీ నిషేధమే కాని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ కు కానీ, ఎన్నికల కమిషనర్ల నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయముర్తికి స్థానం లేకుండా చేసిన కొత్త చట్టం ప్రకారం మోదీ నియమించిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు గ్యానేశ్‌ కుమార్‌, సుఖ్బీర్‌ సింఫ్‌ు సంధూకు బీజేపీ చేస్తున్న ఈ ఆగడాలేవీ కనిపించవు, వినిపించవు. వాటి గురించి ఈ త్రిమూర్తులు ఒక్క మాట కూడా మాట్లాడరు. ఏ ఆహారం ఎవరు తీసుకుంటారన్నది వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు పరిమితమైంది. కానీ ప్రధానమంత్రి మోదీ ప్రతిపక్ష నాయకులు వసంత కాలంలో మాంసం తింటున్నారు, చేపలు తింటున్నారు అని అభ్యంతరం పెడ్తారు. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో ఆయనకు ముస్లిం లీగ్‌ సిద్ధాంతం కనిపిస్తుంది. కాంగ్రెస్‌ది మొగల్‌ మానసికత అని అనునిత్యం తూర్పార పడుతుంటారు. నిశితంగా పరిశీలిస్తే ఈ అప్రస్తుత అంశాలను మోదీ ప్రస్తావించడం ఎన్నికల నైతిక ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించడమే. కానీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్‌ కుమార్‌కు ఈ మాటలేవీ వినిపించవు. మాట్లాడితే ఆయన కవితా పాదాలు వల్లిస్తూ సమాధానం చెప్పనవసరం లేని దారి వెతుక్కుంటారు. ఇప్పుడూ ఆయన కవిత్వం చదవడంలోనో, రాయడంలోనో, వినిపించడంలోనో తలమునకలై ఉంటారు. అందుకని బీజేపీ నాయకులు అవాకులు, చెవాకులు పేలినా ఆయన పట్టించుకోరు. అలాగని ఎన్నికల కమిషన్‌ ఎవరి మీదా చర్య తీసుకోదని కాదు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రణదీప్‌ సూర్జేవాలా పార్లమెంటు సభ్యురాలు, ప్రస్తుతం మథుర నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి, ప్రసిద్ధ నటి హేమ మాలిని మీద ఏవో వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై రెండు రోజుల పాటు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఆంక్షలు విధించారు. ఎన్నికల కమిషన్‌ ప్రతిపక్షాల వారి తప్పులెన్నడంగా దిగజారిపోయింది. అధికారపక్షం ఏం చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. విచిత్రం ఏమిటంటే బీజేపీ లేదా మోదీ అధికారంలో ఉన్న సమయంలో సాధించిన విజయాల ఆధారంగా ఓట్లు అడగడం లేదు. ఎంతసేపూ శ్రీరాముడి నామ జపమే. రామ మందిరం నిర్మించినందుకు తమకు ఓట్లు వేయమని అడగడమే. మోదీ ఆ మాట పదే పదే చెప్తారు కానీ ఓటు బీజేపీకి వేయాలని అడగరు. తనను చూసి ఓటు వేయాలంటారు. ఈ సారి బీజేపీ ఎన్నికల ప్రణాళిక పుస్తక శీర్షికే మోదీ గ్యారంటీలు. ఆ శీర్షికలో బీజేపీ మచ్చుకు కూడా కనిపించదు. అంతా మోదీ మయం. గత జనవరిలో అయోధ్యలో రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు ప్రతిపక్ష ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన నాయకులెవరూ హాజరు కానందుకు విరుచుకు పడ్తున్నారు. వారు హిందూ వ్యతిరేకులని ప్రచారం చేస్తున్నారు. భగవంతుడు సర్వాంతర్యామి అని అన్ని మతాల వారూ విశ్వసిస్తారు. అలాంటిది రాముడిని అయోధ్యకు పరిమితంచేసి, ఆలయ నిర్మాణ ‘‘కీర్తి’’ని కొల్లగొట్టి ఓట్లు సాధించాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ఆగడాలు ఎన్నికల కమిషన్‌ కు కనిపించవు. అయోధ్య రామ మందిర ఆవిష్కరణకు హాజరుకాని పార్టీల వారికి ఓటు వేయకూడదని కూడా మోదీ ఆట్టే దాపరికం లేకుండానే చెప్తారు. ఇదీ ఎన్నికల కమిషనర్ల త్రయానికి వినిపించదు. అన్ని రాజకీయ పార్టీలను సమాన దృష్టితో చూసిన ఎన్నికల కమిషనర్‌ శేషన్‌ ఒక్కరే కాదు. అనేక మంది ఉన్నారు. కానీ ఇప్పుడున్న ఎన్నికల కమిషనర్ల ప్రవర్తన తీరుచూస్తే అసలు ఎన్నికల కమిషన్‌ ఉందా అన్న అనుమానం కలుగుతుంది. సాక్షాత్తు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా గాంధీనే ఎన్నికలలో పోటీ చేయకుండా చేసిన గత చరిత్రతో ఇప్పటి పరిస్థితికి పోలికే లేదు. ఎన్నికల కమిషన్‌ అస్తిత్వం రుజువయ్యేదల్లా ప్రతిపక్షాలు గీత దాటాయనుకున్నప్పుడే. మిగతా సమయంలో ఎన్నికల కమిషన్‌ ఆచూకీయే మాయం అవుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img