Monday, May 20, 2024
Monday, May 20, 2024

తొలి విడత పోలింగ్‌ సంకేతాలు?

ఆరు వారాలపాటు ఏడు దశల్లో సాగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ మొదటి ప్రక్రియ శుక్రవారం ముగిసింది. 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలోని 102 లోకసభ స్థానాలకు పోటీ పడ్తున్న వారి భవిష్యత్తు ఇ.వి.ఎం.లలో నిక్షిప్తమై పోయింది. ఈ 102 స్థానాలలో ప్రస్తుత ప్రతిపక్షాలు గత ఎన్నికల్లో 45 సీట్లు సాధించాయి. తొలి విడత పోలింగ్‌లో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు, రాజస్థాన్‌ లోని 12, ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది, మధ్యప్రదేశ్‌లోని ఆరు, ఉత్తరాఖండ్‌ లోని అయిదు, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని రెండు, మేఘాలయలో రెండు, అండమాన్‌, నికోబార్‌, మిజోరం, నాగాలాండ్‌, పుదుచ్చేరి, సిక్కిం, లక్షద్వీప్‌లోని ఒక్కో స్థానానికి, అసోం, మహారాష్ట్రలో అయిదేసి, బీహార్‌లో నాలుగు, పశ్చిమ బెంగాల్‌లో మూడు, మణిపూర్‌లో రెండు, త్రిపుర, జమ్మూ-కశ్మీర్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఒక్కో స్థానానికి నేడు పోలింగ్‌ పూర్తి అయింది. సాయంత్రం అయిదు గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 59.7 శాతం ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. బెంగాల్‌ లోని కూచ్‌ బెహార్‌ లో తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య కలహాలు జరిగాయన్న సమాచారం అందింది. పోలింగ్‌ ఏజెంట్ల మీద దాడులు జరిగాయంటున్నారు. అయితే పోలీసులు మాత్రం గొడవలేమీ జరగలేదంటున్నారు. మణిపూర్‌లోని విష్ణుపూర్‌లో తుపాకులు పేలాయి. ఇంఫాల్‌ తూర్పు జిల్లాలో ఒక పోలింగ్‌ కేద్రాన్ని చిందరవందర చేశారు. తమిళనాడులోని సేలం జిల్లాలో ఇద్దరు వృద్ధులు పోలింగ్‌ కేంద్రం దగ్గర మృతి చెందారు. తొలి విడత పోలింగులో ఎనిమిది మంది కేంద్ర మంత్రుల, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల, ఒక మాజీ గవర్నర్‌ భవిష్యత్తు తేలనుంది. కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరి, జితేంద్ర సింగ్‌, కిరణ్‌ రిజిజు, అర్జున్‌ రాం మేఘ్వాల్‌, సంజీవ బాల్యాన్‌, తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళసై, లోకసభలో కాంగ్రెస్‌ పక్ష ఉపనాయకుడు గౌరవ్‌ గొగోయ్‌, అసోం మాజీ ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్‌ పోటీ చేస్తున్న నియోజక వర్గాలలో శుక్రవారం పోలింగ్‌ జరిగింది. విడతల వారీగా పోలింగ్‌ జరిగిన సందర్భాలు ఇదివరకూ ఉన్నా ఈసారి ఏడు విడతలుగా పోలింగ్‌ నిర్వహించడం విమర్శలకు దారి తీసింది. ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు తీసుకురావడానికి బీజేపీ ఓటర్ల జాబితాలో ఒక్కో పేజీలో ఉన్నవారి బాధ్యత ఒక్కో వ్యక్తి (పన్నా ప్రముఖ్‌)కు అప్పగించినప్పటికీ పోలింగ్‌ 60శాతం కన్నా మించకపోవడం ‘‘అబ్కీ బార్‌ చార్‌ సౌ పార్‌’’ అన్న మోదీ నినాదం తుస్సుమనడానికే సంకేతం. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కాలికి బలపం కట్టుకుని దేశమంతా గత రెండు నెలల నుంచి నిర్విరామంగా ఎన్నికల ప్రచారంలో మునిగి తేలినా ఓటర్లలో ఉత్సాహం పెల్లుబుకపోవడం బీజేపీకి ప్రతికూల పరిస్థితి ఉందనడానికి నిదర్శనం. మూడోసారీ ప్రజలు తనను అధికార పీఠం ఎక్కిస్తారని మోదీ అనేక ఆశలు పెట్టుకున్నారు. 2047 నాటికి అంటే స్వాతంత్య్రం సంపాదించి వందేళ్లు అయ్యే నాటికి ఈ ఎన్నికలలో విజయం ఒక మైలు రాయి వంటిదని మోదీ ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. కానీ అది ఓటర్లను అంతగా ఆకర్షించినట్టు లేదు. ఈసారి బీజేపీ 370 స్థానాలు సాధిస్తుందని, ఎన్‌.డి.ఎ.కూటమికి 400 కన్నా ఎక్కువ స్థానాలు వస్తాయని మోదీ విపరీతంగా ప్రచారం చేశారు. 2019 ఎన్నికలలో బీజేపీకి 303 సీట్లు, బీజేపీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఎ.కు 355 స్థానాలు దక్కాయి. ఈ ఎన్నికల తరవాత దేశంలో భారీ మార్పులు రాబోతున్నాయని మోదీ పార్లమెంటులోనే ప్రకటించారు. ఆ భారీ మార్పులు ఏమిటో ఆయన చెప్పక పోయినా 400 స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తారన్న వార్తలు బాగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలను మోదీ ఖండిరచినా రెండవ శ్రేణి నేతలు ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించడం చూస్తే సంఫ్‌ు పరివార్‌ అసలు ఉద్దేశం ఏమిటో స్పష్టం అవుతూనే ఉంది.
మోదీ ఆశలు ఏమైనప్పటికీ, అధికార పక్షాలకు అనుకూలంగా ఎన్నికల సర్వేలు ఎన్ని బాకాలు ఊదినప్పటికీ తొలి విడత ఓటింగ్‌ సరళికి సంబంధించిన ప్రాథమిక సమాచారం ప్రకారం చూస్తే మోదీ కలలు నెరవేరే అవకాశం కనిపించడం లేదు. ఎన్నికల ప్రచారం పొడవునా గత పదేళ్లలో తమ ప్రభుత్వం ఏం సాధించిందో మోదీ చెప్పుకోలేక పోయారు. హిందుత్వనే ఆశ్రయించారు. ప్రతిపక్షాల మీద నిరాధారమైన ఆరోపణలు గుప్పించారు. తొలివిడతలో ఓటర్లు అంత ఉత్సాహం చూపించకపోవడం సాధారణంగా ప్రజలలో ఉన్న నిరాసక్తతకు చిహ్నం. ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ‘‘ఇండియా’’ కూటమిలో సంపూర్ణ సమైక్యత లోపించినట్టు కనిపించినా ప్రతిపక్షాలు అనేక అంశాలపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. మోదీ ఈ సారి గెలిస్తే భవిష్యత్తులో ఎన్నికలు ఉండవన్న అభిప్రాయం సైతం ప్రజల్లో బాగా పాకి పోయింది. ప్రతిపక్షాలు మోదీని గద్దే దించాలని నినాదం ఇచ్చినా సారభూతంగా ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన రాజ్యాంగ పరిరక్షణకు, మతతత్వాన్ని నిరోధించడానికి కంకణబద్ధమై ఉందన్న నమ్మకం ఓటర్లలో కలిగించగలిగింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను పథకం ప్రకారం ఎన్నికలకు ముందు అరెస్టు చేయడంలోని ఆంతర్యాన్ని కూడా ప్రజలు గ్రహించారు. పదేళ్ల పాటు మోదీ బూటకపు వాగ్దానాలు వినీ వినీ ఓటర్లు అలసి పోయి ఉన్నారు. ఉత్తర భారత దేశంలో దాదాపు అదృశ్యమై పోయిన కాంగ్రెస్‌ ఈ ఎన్నికలలో బలం పుంజుకునే అవకాశాలు విస్తృతంగా కనిపిస్తున్నాయి. వామ పక్షాలతో సహా ఇతర ప్రతిపక్షాల పరిస్థితీ గణనీయంగా మెరుగుపడే ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలు కేవలం అధికారం సంపాదించడానికి జరుగుతున్నవి కాదని, ఇది సైద్ధాంతిక పోరాటంలో భాగం అని ప్రజలకు తెలియజెప్పడానికి ప్రతిపక్షాలు చేసిన కృషి ప్రభావం జనంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరాదిలో బీజేపీ 2019లో గణనీయమైన సీట్లు సంపాదించింది. అక్కడ బీజేపీ బలం తగ్గడమే తప్ప పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. మిగతా ఆరు విడతల పోలింగ్‌ లోనూ ఓటర్లు నిరాసక్తంగా ఉంటే అది ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతకు రుజువుగా మిగులుతుంది. దక్షిణాదిలో బీజేపీ ముందు నుంచే బలహీనంగా ఉంది. ఎన్నికల ప్రచార క్రమంలో మోదీ ఎన్ని దఫాలు దక్షిణాదిలో పర్యటించి జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇదే ధోరణి మిగతా ఆరు విడతల్లోనూ కొనసాగితే మోదీ విశ్రాంతి తీసుకోక తప్పేట్టు లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img