Monday, May 20, 2024
Monday, May 20, 2024

మోదీ దుర్మార్గపు ప్రచారం

సార్వత్రిక ఎన్నికల మొదటి దశగా ఈ నెల 19వ తేదీన జరిగిన పోలింగ్‌లో ఎన్డీయేకు విజయావకాశాలు తక్కువేనని వస్తున్న వార్తలతో నిరాశకు గురైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు అసత్యాలు, విద్వేష ప్రసంగాలను ఆశ్రయిం చారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా విషపూరిత భాషను ఉపయోగిస్తున్నారు. రాజస్థాన్‌లోని బన్స్‌వారాలో ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోది పేల్చిన అవాకులు, చవాకులు ఇందుకు తార్కాణం. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మత విభజన సృష్టించేందుకు మోదీ ఇంతకు దిగజారడం అత్యంత విచారకరం. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న మైనారిటీలైన ముస్లింలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ర్యాలీలో దుర్మార్గమైన దాడి చేశారు. మాజీ ప్రధాని డాక్టర్‌ మన్‌మోహన్‌ సింగ్‌ 2006లో చేసిన ప్రకటనను తప్పుగా ఉటంకిస్తూ ఆదివారం రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో దేశంలోని అతిపెద్ద మైనారిటీ వర్గమైన ముస్లింలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన దుర్మార్గపు దాడి అన్ని పరిమితులను దాటిపోయింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఇది తీవ్రంగా ఉల్లంఘించింది. ద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం కోర్టు ప్రకటనలను తీవ్రంగా ఉల్లంఘించడమే. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి కీలకమైన సమస్యను అసభ్యంగా మల్చడం ప్రేరేపిత తప్పు అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్‌ మేనిఫెస్టోను విమర్శించే హక్కు భారత ప్రధానికి ఉంది. పార్టీ సమావేశాల్లో కాంగ్రెస్‌ పార్టీ, ఇతర ప్రతిపక్ష నాయకులపై ఆయన విరుచుకుపడడాన్ని ఎవరూ పట్టించుకోరు. కానీ ఆదివారం నాడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి ఏమాత్రం తగనివి. ముస్లిం సమాజంలో భయాందోళనలు కలిగించే విధంగా ఉన్నాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి మీ ఇళ్లకు వచ్చి బంగారం, వెండితోపాటు మీ మంగళసూత్రాల సహా ఆస్తులను లాక్కుని ‘చొరబాటుదారుల’కి, ముస్లింలకు పంపిణీ చేస్తుందన్న మోదీ వ్యాఖ్యలు మెజారిటీ వర్గాల్లో భయాన్ని సృష్టించే, మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఎత్తుగడ. ఇది ఖచ్చితంగా ఏప్రిల్‌ 19న మొదటి దశ పోలింగ్‌ తర్వాత ఆయన భయాందోళనకు ప్రతిబింబం. బన్స్‌వారా ర్యాలీలో మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే, ప్రజల ఆస్తులు, భూమి, బంగారాన్ని లాక్కుని ముస్లింలకు పంచేస్తుందని వ్యాఖ్యానించారు. మీ కష్టార్జితాన్ని చొరబాటుదారులకు పంచేందుకు మీరు అంగీకరిస్తారా?’ అని ప్రశ్నించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదలపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని లోక్‌నీతి-సీఎస్‌డీఎస్‌ సర్వే చెపుతోంది. ‘గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే నేడు ఉద్యోగం దొరకడం సులభమా లేక కష్టమా’ అని ప్రశ్నిస్తే కష్టంగానే ఉన్నదని 62 శాతం మంది కుండబద్దలు కొట్టారు. ‘ధరల పెరుగుదల మాటేమిటి? ఐదేళ్లలో పెరిగాయా తగ్గాయా’ అని అడిగితే ఏకంగా 71 శాతం మంది పెరిగాయనే చెప్పారు. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని దక్కించుకోవాలని ఆశిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఉద్యోగాలు, ధరల పెరుగుదల, పొదుపు రేట్లు, ప్రజల జీవితాలు వంటి కీలక అంశాలను తన ఎన్నికల ప్రచారంలో తప్పనిసరిగా ప్రస్తావించాల్సి ఉంటుంది. కానీ ఆయన ఈ సమస్యలపై పెదవి విప్పరు. తన పాలనలో దేశం సుభిక్షంగా ఉన్నదని, ప్రగతి పథంలో పయనిస్తోందని చెబుతుంటారు. ప్రతిపక్షాలు అనవసరంగా బురద చల్లుతున్నాయని ఆరోపిస్తారు. ఆయన ప్రసంగాల్లో ప్రతిపక్షాలపై విసుర్లే తప్ప ఎక్కడా ప్రజా సమస్యల ప్రస్తావన ఉండదు. ఆకట్టుకునే ప్రసంగాలతో ఓటర్లను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ మాటలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేకపోవడం, సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఏమి చేయాలో తోచక ప్రధాని ఈ విధమైన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.
మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష నాయకులు సోమవారం తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. దేశ ప్రధాని పదవిలో ఉండి మోదీ మత విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎన్నికల నిబంధలను ఉల్లఘించి ముస్లింలను లక్ష్యంగా చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల, బీజేపీ అభ్యర్థి మాజీ సినీ నటి హేమమాలినిపై అవాంఛనీయమైన స్త్రీద్వేషపూరిత వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రణదీప్‌ సూర్జేవాలాను 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధించింది. కాంగ్రెస్‌ నాయకుడిపై ఈసీ అటువంటి చర్యలు తీసుకోవడం సమర్థనీయం. అలాగే ప్రధానమంత్రి కొన్ని రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిరోధించే విషయంలో ఎన్నికల కమిషన్‌ తక్షణ చర్య తీసుకోవాలన్న డిమాండ్‌ వెల్లువెత్తుతోంది. అయితే 142 కోట్ల మంది భారత ప్రజలకు సంరక్షకుడిగా ఉండి, అన్ని మత సమూహాలకు చెందిన మొత్తం జనాభా తరపున ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి చేసిన ఈ దారుణ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడం శోచనీయం. ఈ వ్యాఖ్యలు ఎంత దారుణమో ఎన్నికల సంఘం మౌనం మరింత దారుణం. మోదీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ తీసుకునే చర్యలను ఊహించడం కష్టం. మోదీ వ్యాఖ్యలను అసహ్యించుకునే వ్యక్తులు పుష్కలంగా ఉన్నారు. వీరిలో కాంగ్రెస్‌, ‘‘ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు’’ కూడా ఉన్నారు. కుల, మతాల పేరిట ఓటర్లను విభజించేందుకు ప్రధాని నరేంద్రమోదీ వేసిన ఈ ఎత్తుగడపై భారత ఎన్నికల కమిషన్‌కు చర్య తీసుకోవడానికి కారణం ఉంది కానీ అది జరుగుతుందా? అన్నదే అందరి అనుమానం. మోదీ వ్యాఖ్యలపై ఆందోళన చెందిన పౌరులు సంతకం చేసిన పిటిషన్‌ను ఎన్నికల సంఘానికి పంపేందుకు కొన్ని ప్రతిపక్ష పార్టీలు సిద్ధమౌతున్నాయి. మోదీ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత సాకేత్‌ గోఖలే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘ఎన్నికల సంఘం ప్రతిపక్షాలను పట్టించుకోకుండా మోదీకి, బీజేపీకి ఉచిత పాస్‌లు ఇస్తూనే ఉంది. ఎన్నికల సమయంలో ఈసీ రాజకీయ పార్టీలకు జవాబుదారీగా ఉండదు. కానీ వారు దేశ ప్రజలకు జవాబుదారీగా ఉన్నారు’ అని గోఖలే చేసిన వ్యాఖ్యలు అసందర్భమేమి కాదు. విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలను మోదీ ప్రసంగం తీవ్రంగా ఉల్లంఘించడమే. అందువల్ల సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలపై దృష్టిసారిస్తుందనీ, మోదీకి కోర్టు ధిక్కార నోటీసును జారీ చేసి చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img